Andhra Pradesh: ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ‘ఎన్ 440కే వేరియంట్ వైరస్’ వార్

Andhra Pradesh: ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ‘ఎన్ 440కే వేరియంట్ వైరస్’ వార్

చంద్రబాబు, వైఎస్ జగన్

Andhra Pradesh: కొత్త రకం వైరస్ పేరు చెప్పిన చంద్రబాబు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

  • Share this:
    ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య వైరస్ వార్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎన్ 440కే వేరియంట్ వైరస్‌ను గతంలోనే కర్నూలులో గుర్తించారని.. ఇది వ్యాప్తిలో ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది పాత కరోనా వైరస్‌ వేరియంట్‌తో పోలిస్తే చాలా ప్రమాదకరమని చంద్రబాబు అన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టు కూడా ప్రస్తావించిందని తెలిపారు. ఏపీలో కరోనా కట్టడి విషయంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిలైందని మండిపడ్డారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఏపీ మంత్రి పేర్ని నాని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కరోనా కంటే చంద్రబాబు అత్యంత ప్రమాదకారి అని ఆరోపించారు.

    ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో సర్వశక్తులు ఒడ్డి పని చేస్తోందని.. శక్తికి మించి ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తోందని అన్నారు. ఇలాంటి కష్ట సమయంలోనూ చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ 440కే వేరియంట్ వైరస్ ఏపీదేనని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్ 440కే వైరస్‌పై ఎలాంటి నిర్దారణ జరగలేదని.. దేశంలో బి 1617 మినహా కొత్త రకం వైరస్ ఎక్కడా లేదని పేర్ని నాని చెప్పారు. కొత్త రకం వైరస్ పేరు చెప్పిన చంద్రబాబు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

    వ్యాక్సిన్ల నియంత్రణ ఎవరి చేతుల్లో ఉందో చంద్రబాబుకు తెలియదా ? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కేంద్రం సమృద్ధిగా వ్యాక్సిన్లు ఇస్తే రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయగలమని అన్నారు. ఆక్సిజన్ బెడ్స్, రెమిడెసివర్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచామని వివరించారు. మొత్తానికి ఏపీలో కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ ఉందో లేదో తెలియదు కానీ.. ఈ వైరస్ విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ మొదలైనట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: