దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో మిగిలిన రాష్ట్రాల కరోనా కేసులు ఒక ఎత్తైతే.. మహారాష్ట్రది మరో ఎత్తు. ఎందుకంటే అక్కడ రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో గంటకు మూడు వేల మందికి పైగా కరోనా భారీన పడుతున్నారు. ప్రతి 3 నిమిషాలకి ఒకరు కరోనాతో మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో, కరోనా కట్టడి చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్, నైట్‌కర్ఫ్యూ లాంటివి అమలు చేస్తోంది. నైట్ కర్ఫ్యూ సమయంలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతించింది. అయినప్పటికీ, కేసులు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక కొత్త వ్యవస్థను రూపొందించింది. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవల కోసం ఉపయోగించే వాహనాలను గుర్తించేందుకు స్టిక్కర్స్ అంటించాలని నిర్ణయించింది. ఆయా వాహనాలు అందిస్తున్న సర్వీసులను బట్టి రెడ్, గ్రీన్, ఎల్లో వంటి మూడు కలర్ స్టిక్కర్లను ఉపయోగించనున్నారు. ఈ మేరకు ముంబై కమిషనర్ సరికొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. కొత్త నిబంధన ప్రకారం, కలర్ కోడెడ్ స్టిక్కర్లు ఉంటేనే కర్ఫ్యూ సమయంలో వాహనాలను రోడ్లపైకి అనుమతిస్తారు. తద్వారా, అనవసరంగా బయటికి వచ్చే వాహనాలను కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, ఏ అత్యవసర సేవలకు ఏ రంగు స్టిక్కర్ ఉపయోగిస్తారో తెలుసుకుందాం.
రెడ్ కలర్ స్టిక్కర్
ఫ్రంట్‌లైన్ వారియర్స్, డాక్టర్లు, అంబులెన్సులు, హాస్పిటల్స్, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, క్లినిక్‌లు, మెడికల్ ఇన్సూరెన్స్ ఆఫీసులు, ఫార్మసీలు ఉపయోగించే వాహనాలకు రెడ్ కలర్ స్టిక్కర్లు అంటిస్తారు. వ్యాక్సిన్లు, శానిటైజర్లు, మాస్క్‌లు, ముడిసరుకు ట్రాన్స్పోర్ట్ చేసే వాహనాలు, పంపిణీ చేసే వ్యక్తులు కూడా రెడ్ కలర్ స్టిక్కర్లను పొందవచ్చు.
గ్రీన్ కలర్ స్టిక్కర్
ఆహారం, కిరాణా వస్తువులైన కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, బేకరీ ఉత్పత్తులు, ఇతర ముడి లేదా వండిన ఆహార పదార్థాల రవాణాకు ఉపయోగించే వాహనాలకు గ్రీన్ కలర్ స్టిక్కర్ అంటిస్తారు.
ఎల్లో కలర్ స్టిక్కర్
కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల అధికారులు, సిబ్బంది వాహనాలకు ఎల్లో కలర్ స్టిక్కర్ అంటిస్తారు. ప్రజా రవాణా వాహనాలు, మీడియా, నీటి సరఫరా, విద్యుత్, గ్యాస్ సరఫరా, టెలికాం, ఈ–కామర్స్, ప్రైవేట్ భద్రతా సిబ్బందికి పసుపు రంగు స్టిక్కర్స్ ఇవ్వబడతాయి. ఈ స్టిక్కర్‌తో వారు కర్ఫ్యూ సమయంలోనూ వారు రోడ్లపై ప్రయాణించవచ్చు. కాగా, ఈ స్టిక్కర్లను స్థానిక పోలీస్ స్టేషన్ల నుండి పొందవచ్చు. వాహనం ముందు, వెనుక భాగాల్లో ఈ స్టిక్కర్‌ను అంటించాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వులు మే 1 వరకు అమలులో ఉంటాయని ముంబై పోలీస్ అధికారు స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Maharashtra, Mumbai