Black Fungus: బ్లాక్ ఫంగస్ ప్రమాదం పిల్లలకే ఎక్కువా? రాబోయే రోజుల్లో ఏం జరగనుంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం కొత్తగా బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కూడా ప్రమాదకరంగా మారుతోంది. మూడో దశలో కరోనా, బ్లాక్ ఫంగస్ రెండూ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతాయేమోనని కొందరు అనుమానిస్తున్నారు. మరి దీనిపై డాక్టర్లు ఏమంటున్నారు?

  • Share this:
దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. మొదటి దశలో వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపిన వైరస్, ఈ దశలో యువతపై పంజా విప్పిందని వైద్యులు చెబుతున్నారు. అయితే మూడో దశ అంటూ వస్తే, దాని ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండవచ్చని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొన్ని అధ్యయనాలు మాత్రం ఇవన్నీ ఊహాగానాలేనని చెబుతున్నాయి. రెండో దశలో కేసులు పెరగడంతో, బాధితుల్లో యువత కూడా ఉన్నట్లు తేల్చాయి. ప్రస్తుతం కొత్తగా బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కూడా ప్రమాదకరంగా మారుతోంది. మూడో దశలో కరోనా, బ్లాక్ ఫంగస్ రెండూ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతాయేమోనని కొందరు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో కరోనా, బ్లాక్ ఫంగస్ ప్రభావంపై తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్నలు, వాటికి సమాధానాలు చూద్దాం.

* వ్యాక్సిన్ వేసేంత వరకు పిల్లలను ఎలా సంరక్షించాలి?
ప్రస్తుతం పిల్లలపై వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ ఫలితాలు రావడానికి కొంచెం సమయం పట్టవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి పిల్లలకు టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు వారిని సంరక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. వైరస్ పెద్దవాళ్ల ద్వారానే వారికి సంక్రమించే అవకాశం ఉంటుంది. అందువల్ల కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్‌కు దూరంగా ఉండవచ్చు. దీనికి తోడు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు మాస్కు ధరించేలా చూడాలి. అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వారి రోగనిరోధక శక్తి వృద్ధి చెందడానికి పోషకాహారం అందివ్వాలి.

* కోవిడ్ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అప్రమత్తం కావాలి?
వైరస్ సోకిన పిల్లల్లో తేలికపాటి జ్వరం, దగ్గు, వాంతులు, చిరాకు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు పిల్లల వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడాలి. డాక్టర్లకు పూర్తి వివరాలు తెలిసేలా సింటమ్ చార్ట్‌ను తల్లిదండ్రులు సిద్ధం చేయడం మంచిది. అవసరమైతే ఒకటి లేదా రెండు రోజులు పిల్లల కోసం కేటాయించి, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి. ఒకవేళ వారి ఆరోగ్యం మెరుగవ్వడానికి బదులుగా మరింత క్షీణిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే హాస్పిటల్‌లో చేర్పించి, నిపుణుల సమక్షంలో చికిత్స అందిచాల్సి ఉంటుంది.

* బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? పిల్లలకు కూడా ఇది వ్యాపిస్తుందా?
బ్లాక్ ఫంగస్ లేదా మ్యుకోర్ మైకోసిస్ అనేది అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్. రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉన్నవారికి ఇలాంటి ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు సోకవు. దీర్ఘకాలిక అనారోగ్యాలకు చికిత్స తీసుకుంటున్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఇవి ప్రభావం చూపుతాయి. కోవిడ్ నుంచి కోలుకున్న డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు, స్టెరాయిడ్లను ఎక్కువ మొత్తంలో వినియోగించేవారికి బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు ఎక్కువ అని అధ్యయనాలు తేల్చాయి. అయితే పెద్దలతో పోలిస్తే కోవిడ్ సోకిన పిల్లలకు ఇవి రావడం చాలా అరుదు. ఒకవేళ ఏవైనా ఫంగల్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే మాత్రం, వీలైనంత త్వరగా వారికి చికిత్స అందించాల్సి ఉంటుంది.

* వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందువల్ల.. పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపకూడదా?
కరోనా వైరస్ వాహకాల ద్వారా గాలిలో 10 మీటర్ల వరకు వ్యాపించే అవకాశం ఉందని తాజా మార్గదర్శకాలు చెబుతున్నాయి. కాబట్టి పిల్లలను గ్రౌండ్‌కు, ఇతర ఆట స్థలాలకు పంపకపోవడమే మంచిది. అనవసరంగా వారిని ఇంటి నుంచి బయటకు పంపకూడదు. పిల్లలు కూడా మాస్క్ ధరించేలా చూడాలి. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్తే.. కచ్చితంగా మాస్క్ ధరించాలి. దీంతో పాటు ఇతరులకు ఆరు అడుగుల దూరంలో ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి కోవిడ్ మార్గదర్శకాలు పాటించేలా చూడటం తల్లిదండ్రుల బాధ్యత. ఇంటి చుట్టుపక్కల కోవిడ్ పాజిటివ్ రోగులు ఉంటే, ఇంట్లో కూడా పిల్లలు మాస్క్ ధరించాలి.

* పిల్లలకు వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? వారికి కూడా టీకా రెండు డోసులుగా ఇవ్వాలా?
పిల్లలకు వ్యాక్సిన్లపై టీకా తయారీ సంస్థలు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. 12 ఏళ్లు పైబడిన వారికి, ఈ సెప్టెంబర్ నాటికి టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు వ్యాక్సిన్లు సిద్ధం కావడానికి మరో ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టవచ్చు. పిల్లలకు కూడా రెండు వ్యాక్సిన్ డోసులను ఇవ్వాలి. ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్లపై కూడా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇవి అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

* మూడో దశలో వ్యాపించే కరోనా, పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా?
మొదటి దశలో కరోనా సీనియర్ సిటిజన్లను, రెండో దశలో పెద్దలను ప్రభావితం చేసింది. ఇలాంటి వారిలో ఇప్పటికే రోగనిరోధకత వృద్ధి చెందే అవకాశం ఉంది. దీనికి తోడు ఈ వయసుల వారికి వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా మరో దశలో వైరస్ వ్యాపిస్తే.. 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి కోవిడ్ ప్రమాదకరంగా మారుతుందని అధ్యయనాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ వాదనను ధ్రువీకరించేందుకు ఎలాంటి ఆధారాలు లేవు.

* కరోనా సోకి కోలుకున్న పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎంత కాలం ఉంటుంది?
కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత రోగనిరోధక శక్తి ఆరు నెలల నుంచి కొన్ని దశాబ్దాల వరకు కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన కచ్చితమైన వ్యవధి ఇంకా తెలియదు.

* పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎలాంటి ఆహారం అందించాలి?
వివిధ రకాల విటమిన్లు, ఐరన్, ఇతర సూక్ష్మపోషకాలు, ప్రోటీన్ ఎక్కువగా లభించే ఆహారం రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మంచి నిద్ర, శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన జీవనశైలి.. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

* ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నారని తల్లిదండ్రులు ఎలా నిర్ధారిస్తారు?
పిల్లలు సమయం ప్రకారం తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వీటితో పాటు ఆటపాటలకు కూడా ఒక షెడ్యూల్‌ను అనుసరించడం మంచిది. ఈ షెడ్యూల్‌లో పిల్లల రోజువారీ వ్యక్తిగత పనులతో పాటు వారి వయసుకి తగిన ఇంటి పనులకు కూడా స్థానం కల్పించాలి. ఇంటి పనుల్లో తల్లిదండ్రులకు సహాయం చేయడం సరదాగా ఉండాలి. మొక్కలకు నీళ్లు పెట్టడం, తోబుట్టువులతో ఆడుకోవడం వంటి రోజువారీ కార్యకలాపాలు తప్పనిసరిగా ఉండాలి. దీంతో పాటు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ, ఉల్లాసంగా ఉంటే.. వారు అన్ని విషయాల్లో చురుగ్గా, ఆరోగ్యంగా ఉన్నారని భావించాలి.
Published by:Shiva Kumar Addula
First published: