news18-telugu
Updated: November 11, 2020, 5:57 PM IST
ఫ్రతీకాత్మకచిత్రం
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిడ్–19 మానవ జీవనశైలిలో పెను మార్పులను తీసుకువచ్చింది. కరోనా మహమ్మారి విజృంభనతో ట్రావెలింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. ప్రజలు ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో అన్న అనుమానాలతో ట్రావెలింగ్ చేయడం దాదాపుగా మానేసారు. ఈ నేపథ్యంలో ట్రావెలింగ్ సంస్థలు ప్రయాణీకుల భద్రత కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయిప్పటికీ, కరోనా భయంతో ప్రజలు ట్రావెల్ చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీనిపై తాజాగా ఒక అధ్యయనం చేశారు లండన్ పరిశోధకులు. వారి పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు పునరుద్ధరించబడుతున్నాయి. అయితే, దాదాపు 83% మంది ప్రయాణీకులు కరోనాకు ముందు లాగా తరచూ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడటం లేదని తేలింది.
అంతేకాక, 31% మంది మాత్రమే విమానంలో ప్రయాణానికి మొగ్గుచూపుతున్నారని అధ్యయనం పేర్కొంది. అధ్యయనంలో భాగంగా లండన్‌కు చెందిన 10,000 మంది ప్రయాణీకుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. మహమ్మారి సంక్రమణ భయంతో ఆసియా- పసిఫిక్ ప్రాంతాలకు చెందిన దేశాల్లో కేవలం నాలుగింట ఒక వంతు మంది ప్రజలు మాత్రమే ఆరు నెలల్లోపు ప్రయాణానికి సిద్దంగాఉన్నామని చెప్పారు. కాగా, కోవిడ్–-19తో దాదాపు ఆరు నెలల పాటు అంతర్జాతీయ ప్రయాణాలు స్తంభించిపోయాయి. దీంతో ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం మంది ఇంట్లో నుంచే పనిచేయాల్సి వచ్చింది.
ప్రయాణీకులను పెంచుకునేందుకు డిజిటల్ టెక్నాలజీలపై దృష్టి పెట్టాలి..
వైరస్ ప్రభావంతో అనేక కంపెనీలకు ఆర్ధికంగా భారీ నష్టం జరగడంతో ప్రయాణ ఖర్చులను కూడా తగ్గించుకున్నాయి. మహమ్మారితో వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ పెరగడంతో ఆఫీసులకు ప్రయాణాలు తగ్గిపోయాయి. దీనిపై ఇన్మార్సాట్ ఏవియేషన్ గ్లోబల్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ రోజర్సన్ మాట్లాడుతూ " కరోనా మహమ్మారి కారణంగా చాలా రోజుల నుండి అందరూ ఇళ్ళలోనే ఉన్నారు. ప్రస్తుతం వారందరూ తమ ఇంట్లో నుండే పనులు చక్కబెట్టడానికి అలవాటు పడ్డారు. తద్వారా ప్రయాణాలు చాలా వరకు తగ్గాయి." అని అన్నారు.
కరోనా మహమ్మారి అంతర్జాతీయ, దేశీయ విమానయాన సంస్థలకు నష్టాలను మిగిల్చింది. కరోనాకు ముందు అగ్రశ్రేణి విమానయాన సంస్థలకు 55% నుంచి 75% వరకు లాభాలను తెచ్చేది. అయితే, కరోనా తర్వాత పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. విమానయాన సంస్థలు నష్టాల బాట పట్టడంతో వందల, వేల మంది సిబ్బందిని తొలగించాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2020 చివరి నాటికి విమానయాన పరిశ్రమ నష్టాలు 84 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తెలిపింది. కరోనా భయంతో విమాన ప్రయాణం చేయడానికి ఇష్టపడని వారి కోసం కాంటాక్ట్ లెస్ క్యాటరింగ్, వ్యక్తిగత పరికరం ద్వారా ఇన్‌ఫ్లైట్ వినోదాన్ని అందించడం, కాంటాక్ట్‌లెస్ చెల్లింపు వ్యవస్థ, ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వంటి వాటిపై విమానయాన సంస్థలు ఎక్కువ దృష్టి పెట్టాలని అధ్యయనం పేర్కొంది.
Published by:
Krishna Adithya
First published:
November 11, 2020, 5:55 PM IST