కేంద్ర ప్రభుత్వం ఇటీవల అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకంలో నియమనిబంధనల్ని సడలించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ప్రకారం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC సబ్‌స్క్రైబర్‌గా ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోతే 90 రోజుల వేతనంలో సగం జీతాన్ని పరిహారంగా పొందొచ్చు. గతంలో ఇది 25 శాతం మాత్రమే ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల 50 శాతానికి పెంచింది. అంతేకాదు... గతంలో అయితే ఉద్యోగం కోల్పోయిన 90 రోజుల తర్వాత దరఖాస్తు చేయాలన్న నిబంధన ఉండేది. ఆ నిబంధనను కూడా మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగం కోల్పోయిన 30 రోజుల తర్వాత క్లెయిమ్‌కు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు చేసిన 5 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం 40 లక్షల మంది కార్మికులకు మేలు చేస్తుందని అంచనా. ఈఎస్ఐసీ నిర్వహించే అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకంలో నిరుద్యోగులకు పరిహారాన్ని దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే సెటిల్ చేస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వెల్లడించారు. 2020 మార్చి 24 నుంచి 2020 డిసెంబర్ 31 మధ్య కరోనా వైరస్ సంక్షోభ కాలంలో ఉద్యోగం కోల్పోయినవారుకు ఈ పరిహారం కోసం దరఖాస్తు చేయొచ్చు. అయితే ఆ నిరుద్యోగులు గతంలో ఈఎస్ఐ సబ్స్క్రైబర్లుగా ఉండటం తప్పనిసరి.
అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2021 జూన్ 30 వరకు పొడిగించింది. అయితే ప్రస్తుతం ప్రకటించిన ఈ సడలింపులు మాత్రం 2020 డిసెంబర్ 31 వరకే వర్తిస్తాయి. 2021 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు పాత నిబంధనలే అమలులో ఉంటాయి. కార్మికుల సంక్షేమం కోసం 2018లో ఈ స్కీమ్‌ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.