Covid-19 mistakes: కరోనా కేసుల పెరుగుదలకు ప్రధాన కారణాలు ఇవే.. ఇకనైనా జాగ్రత్త పడాలంటున్న నిపుణులు

Covid-19 mistakes: కరోనా కేసుల పెరుగుదలకు ప్రధాన కారణాలు ఇవే.. ఇకనైనా జాగ్రత్త పడాలంటున్న నిపుణులు

ప్రతీకాత్మక చిత్రం

గత ఏడాది సెప్టెంబరు తరువాత కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది. కానీ కొన్ని వారాలుగా రెండో దశలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.

  • Last Updated:
  • Share this:
భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసుల సంఖ్య రెట్టింపు సంఖ్యలో పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఒక్క రోజులో రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది సెప్టెంబరు తరువాత కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది. కానీ కొన్ని వారాలుగా రెండో దశలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రజలు కోవిడ్ మార్గదర్శకాలను పాటించకపోవడం, ఎన్నికలు, పండుగలు, ఇతర కార్యక్రమాల కారణంగా కేసులు పెరుగుతున్నాయి. 2020లో మొదటిసారి లాక్‌డౌన్‌ విధించినప్పుడు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించటం, వ్యక్తిగత పరిశుభ్రత.. వంటి వాటిని ప్రజలు పాటించారు. కానీ ప్రస్తుతం చాలామంది ఈ మార్గదర్శకాల విషయంలో కొన్ని తప్పులు చేస్తున్నారు. అవేంటంటే..


* మాస్క్ సరిగా ధరించకపోవడం
కరోనా వైరస్ ప్రధానంగా ముక్కు ద్వారా మనిషి శరీరంలోకి వ్యాపిస్తుంది. దీన్ని అడ్డుకోవాలంటే మాస్కులు సక్రమంగా ధరించాలి. ప్రజలు మాస్కులు ధరించడంపై శ్రద్ధ పెట్టక పోవడం వల్ల కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. చాలామంది మాస్కును ముఖానికి సగం వరకు మాత్రమే ధరిస్తారు. కొంతమంది ముక్కుకు కాకుండా నోటి వరకు మాత్రమే వీటిని పెట్టుకుంటున్నారు. ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉంచే మాస్కులు ధరించని వారికి జరిమానా సైతం విధిస్తున్నారు. అయినా ప్రజల్లో మార్పు రావట్లేదు.* ఇన్‌ఫెక్షన్ సోకదని భావించడం
దేశంలో లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేసిన తరువాత ప్రజలు కోవిడ్ మార్గదర్శకాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. తమకు కరోనా సోకదని, కేసులు తగ్గుతున్నందువల్ల ఇన్‌ఫెక్షన్ తీవ్రత పెద్దగా ఉండట్లేదని చాలామంది భావించారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించట్లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా తిరగడం వల్ల వైరస్ వ్యాప్తి పెరిగింది.

* ఎదుటివారు కోవిడ్ నియమాలు పాటిస్తే సరిపోతుంది అనుకోవడం
తమకు తెలిసినవారు, బంధుమిత్రులు కోవిడ్ నియమాలు పాటిస్తున్నారు కాబట్టి.. తాము మాస్కు ధరించకున్నా ఫర్వాలేదని చాలామంది భావిస్తున్నారు. ఎదుటివారితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యమవుతుంది. ఇతరులు పాటిస్తే సరిపోతుందనుకోవడం, తెలియని వ్యక్తులతో అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల కొత్త రకం వైరస్‌ సులువుగా వ్యాపిస్తోంది.

* ఇంట్లో సురక్షితంగా ఉన్నామని భావించడం
కరోనా తరువాత ప్రజలు చాలా కాలం పాటు స్నేహితులు, బంధువులను కలవలేకపోయారు. అందువల్ల లాక్‌డౌన్ ముగిసిన తరువాత ఇంటి వద్ద సమావేశాలను నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో కాకుండా సొంత ఇళ్లలో ఎక్కువ మంది కలిస్తే ప్రమాదం ఉండదు అనుకున్నారు. ఇది కూడా వైరస్ వ్యాప్తికి కారణమైంది.

* జాగ్రత్తలు పాటించాల్సిందే
ఇకనైనా ప్రజలు ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్-19 మార్గదర్శకాలను ప్రజలు కచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం, శానిటైజర్లు వాడటం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటివి మానేయకూడదు. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలి. దీంతో పాటు ఇంట్లో వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి.

Published by:Sumanth Kanukula
First published:

అగ్ర కథనాలు