Andhra Pradesh: లాక్ డౌన్, కర్ఫ్యూ పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ.. మంత్రి ఏమన్నారో తెలుసా?

ఏపీ మంత్రి ఆళ్ల నాని

ఏపీలో కరోనా సెకెండ్ వేవ్ విస్తరిస్తోంది. తొలి వేవ్ కంటే ప్రమాదకరంగా కనిపిస్తోంది. దీంతో మళ్లీ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ లాంటి అనుమానాలు ప్రజలను భయపెడుతున్నాయి. అయితే ఏపీ వైద్య శాఖ మత్రి ఆళ్ల నాని వాటిపై క్లారిటీ ఇచ్చారు.

 • Share this:
  ఏపీపై ప్రస్తుతం కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించని శాతంలో పెరుగుతున్నాయి. 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య రెండు వేల మార్కును దాటుతుండడం నిజంగానే ఆందోళన పెంచుతోంది. గతంలో మూడు నెలల కిందట గరిష్ట స్థాయి కేసులు మళ్లీ నమోదవుతుండడం ప్రజలను కలవరపాటు గురి చేస్తోంది.  ఓవైపు ప్రజలు నిర్లక్ష్యం వీడడం లేదు. ఎక్కడా కరోనా నిబంధనలు అమలవ్వడం లేదు. మరోవైపు స్కూళ్లు, కాలేజీల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ తో.. థియేటర్ల దగ్గర జన సమూహం పెరుగుతోంది.  బార్లు, పబ్బుల్లో విచ్చల విడిగా జనం నిబందనలను గాలికి వదిలేస్తున్నారు. ఇలా అందరి నిర్లక్ష్యం కారణంగా కరోనా రెచ్చిపోతోంది. రెట్టింపు వేగంతో దూసుకువస్తోంది.

  రెండు వారాల కిందటి వరకు వందల్లోనే నమోదయ్యే కేసులు.. తరువాత వేయి మార్కును దాటాయి. ఇప్పుడు రెండు వేల మార్కు దాటడంలో పోటీ పడుతున్నాయి. అటు మరణాల సంఖ్య కూడా కొద్ది కొద్దిగా పెరుగుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య అధికమవుతోంది. అందులోనూ సెకెండ్ వేవ్ లో ఎలాంటి లక్షణాలు బయటపడకపోవడం మరింత ఆందోళన పెరిగేలా చేస్తోంది. ఎవరికి కరోనా ఉందో.. లేదో తెలియడం లేదు. కరోనా సోకిన వారు కూడా ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో యదేచ్ఛగా రోడ్లపై తిరేగేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరి ప్రజల్లో అనుమానాలు పెరిగాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మళ్లీ లాక్ డౌన్ తప్పదేమో? కర్ఫ్యూ లాంటి ఆంక్షలు మళ్లీ వస్తాయా అని భయపడుతున్నారు. అంతేకాదు కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికే స్వచ్ఛంద లాక్ డౌన్ లు ఏర్పాటు చేసుకుంటున్నారు కూడా.

  అయితే ఏపీలో కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే అని.. అయితే కరోనా కట్టడికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని.  వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టనున్నామన్నారు. కోవిడ్ హాస్పిటళ్ళు, కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్స్ సంఖ్య పెంచమని ఇప్పటికే అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. అయితే లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించటం‌, వ్యాక్సినేషన్ కు ముందుకు రావడం చేయాలి అని కోరారు.  ప్రస్తుతానికైతే  ఎక్కడా వ్యాక్సిన్ కొరత లేదన్నారు. ఏపీ వ్యాప్తంగా 3.80 లక్షల డోసుల వ్యాక్సిన్ సిద్ధంగా ఉంది. కేంద్రానికి ఇండెంట్ పంపించాం. ఇవాళ, రేపటి లో 2 లక్షల డోసులు, వారంలో మరో 15 లక్షల డోసుల కేంద్ర నుంచి రానున్నాయని స్పష్టం చేశారు.

  మంత్రి లాక్ డౌన్, కర్ఫ్యూ ఉండదని చెప్పినా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఊరట కలిగేలా లేదు. రోజు రోజుకూ కేసుల సంఖ్య రెట్టింపు అవ్వడం భయపెడుతోంది. ప్రజలు నిర్లక్ష్యం వీడకపోతే మరోసారి కఠిన ఆంక్షలు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
  Published by:Nagesh Paina
  First published: