ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇప్పటికే అంతరాష్ట్ర సరిహద్దులను మూసి వేసినట్టు ప్రకటించిన ఏపీ మంత్రి... తాజాగా అంతర్ జిల్లా రవాణాను కూడా లాక్ డౌన్ చేశామని తెలిపారు. రాష్ట్రంలో ప్రపంచ మహమ్మారి ఉదృతం కాకుండా ఉండటానికి ప్రజలు కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామ వాలంటీర్లు కరోనా వ్యాప్తి అరికట్టడానికి ప్రధాన భూమిక పోషిస్తున్నారని తెలిపారు. వారి ద్వారానే విదేశాల నుండి వచ్చిన వారిని వెంటనే ట్రాక్ చేయగలిగామమని అన్నారు. ఇలాంటి వ్యవస్థ దేశంలో మన దగ్గర ఉండడం గర్వకారణమని మంత్రి పేర్ని నాని అన్నారు.
ప్రత్యేక యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం వైద్య ఆరోగ్య శాఖకు అందిస్తున్నారని అన్నారు. సరదాకి ఎవరు బయటకు రాకూడదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. పేదల ఆర్థిక కష్టానికి సహాయంగా 1000 రూపాయలు అందిస్తామని అన్నారు. పెన్షన్లు అందజేసే సమయంలో వేలిముద్రలు నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. సోషల్ మీడియాలో ప్రజలను భయపెట్టే వార్తలు షేర్ చేసిన, పోస్ట్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జూన్ దాకా కేంద్రం బడ్జెట్ పై అవకాశం కల్పించినట్లు సమాచారం ఉందని మంత్రి తెలిపారు. సరదాకి బయటకు వచ్చాం అనే వారిపై 330 కేసులు నమోదు చేశామని... 286 వాహనాలు సీజ్ చేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు.