Corona Virus: కరోనా వస్తే అలా చేయొద్దన్న హరీశ్ రావు

సిద్ధిపేట జిల్లాలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని... పలువురు అనుమానితులకు పరీక్షలు నిర్వహించామని హరీశ్ రావు తెలిపారు.

news18-telugu
Updated: March 26, 2020, 8:27 PM IST
Corona Virus: కరోనా వస్తే అలా చేయొద్దన్న హరీశ్ రావు
అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష
  • Share this:
కరోనా వచ్చినా భయపడాల్సిన పనిలేదని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. అయితే అలాంటి వాళ్లు తమకు తాము బాధపడుతూ ఎవరికి చెప్పకుంటే... వాళ్లు వారి కుటుంబానికి, సమాజానికి ద్రోహం చేసిన వారవుతారని ఆయన వ్యాఖ్యానించారు. సిద్ధిపేట జిల్లాలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని... పలువురు అనుమానితులకు పరీక్షలు నిర్వహించామని హరీశ్ రావు తెలిపారు. జిల్లాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిత్యవసరాలు, అత్యవసరాలలపై టెలి కాన్ఫరెన్సు ద్వారా చర్చించామని అన్నారు. జిల్లాకు విదేశాల నుంచి 456 మంది వచ్చారని... వీరిలో 239 మంది క్వారయింటైన్ పూర్తి చేసుకుని వెళ్లిపోయారని హరీశ్ రావు వివరించారు.

మిగిలిన వారు క్వారయింటైన్ లో ఉన్నారని... వారి కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మూడు నాలుగు రోజుల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారని, వారిని కూడా 14 రోజుల క్వారయింటైన్ లో ఉంచాలని ఆదేశించామని అన్నారు. జిల్లాలో ఈ రోజు నుంచి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని... ఇది 24 గంటలు పని చేస్తుందని అన్నారు. అత్యవసరమైతే ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 9849903256... రాత్రి 8 గంటల నుంచి తిరిగి ఉదయం 8 గంటల వరకు 8008555613 ఈ నెంబర్లు పని చేస్తాయని హరీశ్ రావు అన్నారు.

సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటించాలని... పరిస్థితి చేయి దాటాక ముందే జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు నిర్వహించిన సమీక్షలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ లింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.



First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు