news18-telugu
Updated: December 29, 2020, 5:17 PM IST
ప్రతీకాత్మకచిత్రం
అందరినీ కలవరపెడుతున్న కొత్త రకం కరోనా వైరస్ గురించి తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఊరట కలిగించే విషయం చెప్పారు. బ్రిటన్ నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్న కొత్త రకంగా కరోనా వైరస్ ప్రాణాంతకం కాదని ఆయన తెలిపారు. ఈ కొత్త రకం వైరస్ శరవేగంగా విస్తరించే లక్షణం కలిగి ఉందని.. ప్రాణాంతకం కాదని వివరించారు. ఈ వైరస్ విషయంలో ప్రజలు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. కొత్త రకం వైరస్‌పై కేంద్రం అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వుందని ఈటల రాజేందర్ తెలిపారు.
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని.. ఫస్ట్ వేవ్‌కు సంబంధించిన కేసులు, మరణాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని ఆయన అన్నారు. చలికాలం కాబట్టి ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని.. ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం కొత్త రకంగా కరోనా వైరస్‌పై మరింత అధ్యయనం చేస్తోందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వైరస్ నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అంతకుముందు బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన వారిలో ఆరుగురిలో కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో బెంగళూరులోని ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్‌లో మూడు శాంపిళ్లు, హైదరాబాద్ సీసీఎంబీలో 2 శాంపిళ్లు, పుణె ఎన్ఐవీలో ఒక శాంపిల్‌లో కొత్త రకం వైరస్‌ను గుర్తించినట్లు తెలిపింది. ఈ ఆరుగురిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐసొలేషన్‌లో ఉంచినట్టు పేర్కొంది. వీరితో కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లందరినీ క్వారంటైన్‌కు తరలించినట్లు చెప్పింది. దీనిపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇండియాతో పాటు డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనన్, సింగపూర్ దేశాలకూ యూకేలో కనిపించిన కొత్త రకం కరోనా వైరస్ పాకింది.
Published by:
Kishore Akkaladevi
First published:
December 29, 2020, 5:11 PM IST