Home /News /coronavirus-latest-news /

MINISTER ETELA RAJENDAR CLARIFIES ON LESS CORONA VIRUS TESTS IN TELANGANA AK

తెలంగాణలో తక్కువగా కరోనా పరీక్షలు... మంత్రి ఈటల ఏమన్నారంటే...

మంత్రి ఈటల రాజేందర్

మంత్రి ఈటల రాజేందర్

రాష్ట్రంలో కరోనా ర్యాపిడ్ టెస్టులు చేయడం లేదనే అంశంపై స్పందించిన మంత్రి ఈటల... తెలంగాణలో ర్యాపిడ్ టెస్టులు చేయవద్దని సీఎం కేసీఆర్ గట్టిగా నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు.

    ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని వస్తున్న వార్తలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. తాము పరీక్షలు తక్కువగా చేస్తున్నామని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన వివరించారు. కేంద్రం, ఐసీఎంఆర్ ఇచ్చిన విధివిధానాలకు అనుగుణంగానే కరోనా పరీక్షలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారికే మాత్రమే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉందని మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్రంలో కరోనా ర్యాపిడ్ టెస్టులు చేయడం లేదనే అంశంపై స్పందించిన మంత్రి ఈటల... తెలంగాణలో ర్యాపిడ్ టెస్టులు చేయవద్దని సీఎం కేసీఆర్ గట్టిగా నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు.

    అసలు ఈ ర్యాపిడ్ టెస్టులపై ఎవరికీ క్లారిటీ లేదని... ఇటీవల ఐసీఎంఆర్ పలు ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వెనక్కి పంపించాలని కోరిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందాలు సంతృప్తి వ్యక్తం చేశాయని మంత్రి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల చనిపోయిన వారి శాతం ఏడుగా ఉంటే... మన దేశంలో అది 3.2 శాతంగా ఉందని ఈటల అన్నారు. తెలంగాణలో అది కేవలం 2.5 శాతం మాత్రమే అని అన్నారు. తెలంగాణలో కరోనా కారణంగా ఇప్పటివరకు 25 మంది చనిపోయారు. వారిలో ఇద్దరు పక్క రాష్ట్రానికి చెందినవారని అన్నారు. అందులో చాలామందికి క్యాన్సర్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

    దేశంలో మర్కజ్ వెళ్లొచ్చిన వారి వల్లే కేసులు పెరుగుతున్నాయనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చింది కూడా తెలంగాణ ప్రభుత్వమే అని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కొత్త కేసులు రావడం లేదని... కేవలం జీహెచ్ఎంసీలో మాత్రమే కేసులు నమోదవుతున్నాయని మంత్రి ఈటల స్పష్టం చేశారు. తాము కరోనా కేసులకు సంబంధించిన సమాచారాన్ని సరిగ్గా ఇవ్వడం లేదనే ఆరోపణలను ఆయన ఖండించారు. మే 8 నాటికి రాష్ట్రం కరోనా ఫ్రీగా మారుతుందని ఆశిస్తున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Coronavirus, Etela rajender, Rapid test kits, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు