సెలవులు ఎందుకిచ్చాం? కరోనాపై మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు

మంత్రి ఈటల రాజేందర్

తెలంగాణలో ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులకు కరోనావైరస్ సోకింది. వీరిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. మహేంద్ర హిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కోలుకోవడంతో ఇప్పటికే డిశ్చార్చి చేశారు.

  • Share this:
    కరోనావైరస్ ప్రభావంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. వందలాది మంది విద్యార్థులు ఉండే విద్యాసంస్థల్లో కరోనావైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. ఐతే విద్యార్థులకు సెలవులు రావడంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇంకొందరు పర్యాటక ప్రదేశాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థలకు సెలవులిచ్చింది... ప్రయాణాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి కాదని స్పష్టం చేశారు. కరోనా బారిన పడకుండా ఇంట్లోనే ఉండేందుకే సెలవులు ఇచ్చామని తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని ప్రజలకు మరోసారి సూచించారు ఈటల. వైరస్ సోకకుండా పిల్లలను కాపాడుకునే బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదేనన్నారు.

    కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులకు కరోనావైరస్ సోకింది. వీరిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. మహేంద్ర హిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కోలుకోవడంతో ఇప్పటికే డిశ్చార్చి చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో ఐదు యాక్టివ్ కరోనా పాజిటివ్ కేసులున్నాయి. ఇక విదేశాల నుంచి నగరానికి దాదాపు 20వేల మంది ప్రయాణికులు వచ్చే అవకాశం ఉండడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడే స్క్రీనింగ్ చేసి.. అనుమానితులను నేరుగా వికారాబాద్, దూలపల్లిలోని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. ప్రజలు కూడా తమకు సహరించాలని విజ్ఞప్తిచేశారు మంత్రి ఈటల.
    Published by:Shiva Kumar Addula
    First published: