COVID-19: కలిసి పుట్టిన కవలలు కరోనాకు బలి.. గంటల వ్యవధిలోనే అన్నాదమ్ముళ్ల మృతి

కరోనాకు బలైన కవలలు

ఇద్దరు కవలలు బలయ్యారు. కవలలు.. ఇద్దరూ 24 ఏళ్ల వయసు యువకులు, మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన వారు కావడంతో ఆ తల్లిదండ్రుల వేదన మరింత హృదయవిదారకంగా ఉంది

  • Share this:
కరోనా వైరస్ చాలా మంది జీవితాల్లో అంతులేని విషాదాన్ని, చీకట్లను నింపుతోంది. ఆత్మీయులను దూరం చేస్తూ కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగులుస్తోంది. ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది చనిపోతున్న సందర్భాలూ ఉన్నాయి. అలాంటి సమయంలో బాధిత కుటుంబాల ఆవేదన వర్ణణాతీతంగా ఉంటోంది. ఒక్కరోజులోనే జీవితాలు, కుటుంబాల పరిస్థితులు తలకిందులయిపోతున్నాయి. సంతోషం కనుమరుగైపోతోంది. ఇలాంటి దురదృష్ట సంఘటనే మీరట్​లోని ఓ కుటుంబంలో జరిగింది. కరోనాకు ఇద్దరు కవలలు బలయ్యారు. కవలలు.. ఇద్దరూ 24 ఏళ్ల వయసు యువకులు, మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన వారు కావడంతో ఆ తల్లిదండ్రుల వేదన మరింత హృదయవిదారకంగా ఉంది.

జార్జ్ రేమండ్ రఫెల్స్​​, సోజా దంపతులకు 1997 ఏప్రిల్ 23న కవలలు జన్మించారు. వారికి జోఫ్రెడ్ వర్ఘీస్ జార్జ్​, రాల్​ఫ్రేడ్​ జార్జ్​ గ్రెగొరి అని పేర్లు పెట్టారు. వారిద్దరూ దాదాపు ఒకేలా పెరిగారు. రూపం ఒక్కటే చదువూ ఒక్కటే. ఉద్యోగమూ సేమ్​. ఇద్దరికీ ఒకరంటే ఒకరికీ ఎంతో ఇష్టం. ఇద్దరూ కంప్యూటర్ ఇంజినీరింగ్ చేశారు. హైదరాబాద్​లో ఉద్యోగం చేస్తున్నారు. ఇలా ఎంతో సంతోషాలతో తులతూగే వారి కుటుంబంలో కరోనా ఒక్కసారిగా విషాదం నింపింది. తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆ ఇద్దరికీ ఏప్రిల్​ 24నే కరోనా వైరస్ సోకింది. ఆ ప్రమాదక వైరస్​తో పోరాడుతూ మే 14, 15 తేదీల్లో ఇద్దరూ గంటల వ్యవధిలో మృతి చెందారు. దీంతో ఆ తల్లిదండ్రుల వేదన ఆకాశాన్నంటింది.

తన కుమారులు ఏం చేసినా దాదాపు ఒకేలా చేసేవారని తండ్రి రఫెల్స్​ చెప్పారు. ఇంటికి కూడా ఒకేసారి వచ్చేవారని, రాకపోతే ఇద్దరూ వచ్చేవారు కాదని అన్నాడు. ‘వారిద్దరిలో ఒకరికి ఏమైనా.. మరొకరికి అది జరుగుతుంది. పుట్టిన దగ్గరి నుంచి అలాగే జరుగుతోంది. జోఫ్రెడ్ మృతి చెందాక నేను నా భార్యకు చెప్పా.. వారిలో ఒంటరిగా ఎవరూ రారని. గంటల వ్యవధిలో ఒకరు మే 13న.. మరొకరు మే 14న మృతి చెందారు’ అని కన్నీళ్లతో రఫెల్స్​ చెప్పారు.

“మా కోసం వారు ఎన్నో ప్లాన్స్ వేశారు. మాకు మంచి జీవితాలను ఇవ్వాలని అనుకున్నారు. టీచర్లుగా పని చేస్తూ వారిని చదివించేందుకు, ప్రయోజకులను చేసేందుకు ఎంతో కష్టపడ్డాం. అందుకే వారు మమ్మల్ని చాలా బాగు చూసుకోవాలనుకున్నారు. అన్ని విషయాల్లో సంతోషంగా ఉండేలా చేయాలనుకున్నారు. అలాగే కొరియా లేదా జర్మనీ వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడాలని అనుకున్నారు. కానీ అంతలోనే ఇలా జరిగింది. ఆ దేవుడు మమ్మల్ని ఎందుకు శిక్షించాడో అర్థం కావడం లేదు’ అని రఫెల్స్​ భావోద్వేగంగా చెప్పారు.
Published by:Shiva Kumar Addula
First published: