Home /News /coronavirus-latest-news /

MAOIST ARE SUFFERING FROM CORONA WARANGAL POLICE COMMISSIONER SAID VRY KMM

Corona to maoist : కరోనా కోరల్లో మావోయిస్టులు.. 12 మంది అగ్రనేతలకు పాజిటివ్ .. చికిత్స కోసం వచ్చిన మావోయిస్టు అరెస్ట్..

కరోనా కోరల్లో మావోయిస్టులు.. 12 మంది అగ్రనేతలకు కరోనా..

కరోనా కోరల్లో మావోయిస్టులు.. 12 మంది అగ్రనేతలకు కరోనా..

Corona to maoist : కరోనా కేవలం పట్టణాలకే కాదు..పచ్చని అడవుల్లో తలదాచుకునే మావోయిస్టులను కూడ వదలడం లేదు..ఇలా కరోనా సోకడంతో ఓ మావోయిస్టు నేత చికిత్స చేయించుకునేందుకు బయటకు రావడంతో పోలీసులకు చిక్కాడు. అయితే మరో 12 మంది అగ్రనేతలు కరోనాతో భాదపడుతున్నారని పట్టుబట్ట మావోయిస్టు వెల్లడించారు.

ఇంకా చదవండి ...
జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు,
ఖమ్మం జిల్లా

సీపీఐ మావోయిస్టు పార్టీ నేతలు కరోనా కోరల్లో చిక్కుకున్నారా..? పార్టీలోని పలువురు సీనియర్లు, కీలకమైన నేతలు ప్రస్తుతం ఈ వైరస్‌ బారిన పడ్డారా..? మరి వీరికి వైద్యం ఎక్కడ..? అన్న దానిపై ఇప్పుడు తాజాగా చర్చోప చర్చలు సాగుతున్నాయి. పేరుమోసిన నగరాల్లోని పెద్దాసుపత్రుల్లోనే వైద్యం సరిగా అందక మరణమృదంగం మోగుతున్న పరిస్థితుల్లో ఈ వైరస్‌ బారిన పడిన మావోయిస్టు నేతలు ఎక్కడ, ఎలా వైద్య సేవలు పొందుతున్నారు..? ఎలా మనుగడ సాగిస్తున్నారు అన్నదే ఇప్పుడు అదరినీ వేధిస్తున్న ప్రశ్న.

మావోలకు కరోనా..

తాజాగా ఓ మావోయిస్టు కీలక నేతను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతణ్ని జుడీషియల్‌ రిమాండ్‌కు పంపే క్రమంలో చేసిన వైద్య పరీక్షల్లో అతనికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసులు ఈ కోణంలో ఆరా తీశారు.. తీరా అతను చెప్పిన నిజాలతో బేజారయ్యారు. ఇప్పుడు మావోయిస్టు ఉద్యమంలోని పలువురు కీలక నేతలను సైతం కరోనా చుట్టుముట్టిందన్న విషయం వెలుగులోకి వచ్చేసరికి దండకారణ్యంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో కూడిన దండకారణ్యంలోని గిరిజనగూడేలకు కరోనా వైరస్‌ పాకితే ఇక పరిస్థితి కంట్రోల్‌ చేయడం కష్టమన్నది అధికారుల భావన.

కరోనా చికిత్స కోసం వచ్చి పట్టుబడ్డ మావోయిస్టు

కరోనా వైరస్‌ బారిన పడి తగిన చికిత్స కోసం చత్తీస్‌ఘడ్‌ నుంచి వరంగల్‌కు వస్తున్న మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోన్‌ డివిజనల్‌ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్‌ అలియాస్‌ శోభ్రాయ్‌ అలియాస్‌ మోహన్‌తో పాటు మరో కొరియర్‌ను వరంగల్ పోలీసులు ములుగు రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరికి నిర్వహించిన ఆరోగ్య పరీక్షల అనంతరం, పరిస్థితులపై విచారించగా శోభ్రాయ్‌ వెల్లడించిన సమాచారంతో పోలీసులు ఉలికిపాటుకు గురయ్యారు.

ప్రస్తుతం మావోయిస్టు పార్టీలోని కీలకమైన పన్నెండు మంది నేతలు కోవిడ్‌ పాజిటివ్‌తో బాధపడుతున్నారన్న విషయం వెల్లడైంది. వీరిలో కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌, తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవుజి, యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, కటకం రాజిరెడ్డి అలియాస్‌ ధర్మన్న, కట్టా రాంచందర్‌రెడ్డి అలియాస్‌ వికల్ప్‌, మూల దేవేందర్‌రెడ్డి అలియాస్‌ మాస దడ, కంకటి వెంకటయ్య అలియాస్‌ వికాస్‌, ముచ్చకి ఉజల్‌ అలియాస్‌ రఘు, కొడి మంజుల అలియాస్‌ నిర్మల, పూసం పద్మ, కాకర్ల సునీత అలియాస్‌ బుర్రా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈమేరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి వెల్లడిచేశారు. అయితే వీరంతా బయటకు వస్తే చికిత్స అందిస్తామని ఆయన చెప్పారు.

కరోనా చికిత్సకు అనుమతి లేదా..

అయితే కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించే విషయంలో మావోయిస్టు పార్టీ టాప్‌ క్యాడర్‌ తీవ్రమైన ఆంక్షలు విధిస్తోందని.. మరీ తీవ్రంగా అదీ ప్రాణాపాయంలో ఉన్న సమయంలోనే చికిత్సకు అనుమతి ఇస్తుండడంతో.. పరిస్థితి విషమించి ప్రాణాలమీదకు వస్తోందని తెలిసింది. వాస్తవానికి చత్తీస్‌ఘడ్‌లోని బీజపూర్‌ జిల్లా సిల్గేర్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పోలీసు క్యాంపును వ్యతిరేకిస్తూ మేనెల మూడో వారంలో ఇటు చత్తీస్‌ఘడ్‌, ఇటు తెలంగాణ సరిహద్దు గ్రామాలకు చెందిన వేలాది మంది గిరిజనులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా కోవిడ్‌ పాజిటివ్‌ ఉన్న వారిని మావోయిస్టు నాయకులు కలవడం వల్ల వారికి వైరస్‌ సోకింది.

చికిత్స లేకపోవడంతో పట్టణాలకు చేరుతున్న మావోలు

దీనికి తోడు మారుమూల గిరిజన గూడేల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం.. అక్కడకు వైద్య బృందాలు వెళ్లే పరిస్థితి లేకపోవడం.. దీనికి తోడు వైరస్‌ సోకిన వారికి పార్టీ సత్వరమే అనుమతి ఇవ్వకపోవడంతో ఇది తీవ్రరూపం దాలుస్తోంది. దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు జారీ చేశాయి. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన మావోయిస్టు నేతలు, క్యాడర్‌, ఇంకా ఇతరేతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉద్యమాన్ని వదలి జనజీవన స్రవంతిలోకి రావాలని, తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగైన వైద్యం అందిస్తాయని ప్రకటించినా స్పందన రాలేదు. అయితే కరోనా వైరస్‌ విషయంలో మావోయిస్టులు తీసుకున్న వైఖరి క్యాడర్‌లో నిరాశా నిస్పృహల్లో ముంచెత్తిందని పోలీసులకు దొరికిన మావోయిస్టుల ద్వారా తెలుస్తోంది.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona cases, Maoist, Warangal

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు