కారు అమ్మి కరోనా పేషెంట్లకు 250 ఆక్సిజన్ సిలిండర్లు... యువకుడిపై ప్రశంసల జల్లు...

కారు అమ్మి కరోనా పేషెంట్లకు 250 ఆక్సిజన్ సిలిండర్లు... యువకుడిపై ప్రశంసల జల్లు...

కారు అమ్మి కరోనా పేషెంట్లకు 250 ఆక్సిజన్ సిలిండర్లు... (credit - twitter)

ఏకంగా 250 మంది పేషెంట్లకు అతను ప్రాణం పోశాడు. కారు కంటే... వారి ప్రాణాలే ముఖ్యమని అతను భావించాడు. అందుకే అతన్ని అంతా మెచ్చుకుంటున్నారు.

 • Share this:
  తెల్లారి లేస్తే... నాకేంటట... అనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. ఇదే ప్రపంచంలో మంచివాళ్లూ ఉన్నారు. వాళ్లలో ఓ వ్యక్తి జాలి గుండె గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అతను ఉండేది మహారాష్ట్ర... ముంబైలోని మలాడ్‌లో. పేరు షానవాజ్ షేక్. వయసు 31 ఏళ్లు. ఎప్పుడూ ఫోర్డ్ ఎండీవర్ కారులో... రయ్ మని దూసుకెళ్లేవాడు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో... కరోనా పేషెంట్లను చూశాక... అతని ఆలోచన పూర్తిగా మారిపోయింది. నా కోసం కాదు... ప్రజల కోసం బతకాలి అనుకున్నాడు. వెంటనే తన కారునే ఓ ప్రైవేట్ అంబులెన్స్‌గా మార్చాడు. తద్వారా చాలా మందిని ఆస్పత్రులకు ఫ్రీగా చేర్చాడు. ఇంతలో మరో ఉత్పాతం వచ్చింది.

  బిజినెస్‌మేన్ అయిన షానవాజ్... పార్టనర్‌కి ఓ చెల్లి ఉంది. ఆమె ఆరు నెలల గర్భవతి. మే 28న కరోనా సోకిందని తెలియడంతో ఆమె భర్త ఆమెను ఓ ఆటో ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను దాదాపు ఐదు ఆస్పత్రులకు తీసుకెళ్లాడు. ఎవ్వరూ ఆమెను చేర్చుకోవడానికి ముందుకురాలేదు. కొంత మంది కరోనా పేషెంట్లకు బెడ్స్ ఖాళీలేవని చెప్పారు. కొంత మంది వెంటిలేటర్లు లేవన్నారు. ఆరో ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె ఆటోలోనే చనిపోయింది. ఆ విషయాన్ని కొందరు డాక్టర్లకు చెబుతూ... ఆమె భర్త... ఏమన్నాడంటే... "ఇన్ని ఆస్పత్రులున్నాయి. ఎవరూ కాపాడలేదు. ఆమెకు టైముకి ఆక్సిజన్ సిలిండర్ అందించి ఉంటే బతికేది" అన్నాడు. ఆ మాటల్ని షానవాజ్ విన్నాడు. అంతే ఆ క్షణమే బలమైన నిర్ణయం తీసుకున్నాడు.

  తన SUV (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్)ని వెంటనే అమ్మాలనుకుంటున్నట్లు తన ఫ్రెండు ఒకతనికి షానవాజ్ చెప్పాడు. తద్వారా కార్ల కంపెనీ యూనిట్‌ని డైరెక్టుగా కలిశాడు. విషయం వాళ్లకు చెప్పగానే... వెంటనే వాళ్లు ఆ కారును కొన్నారు. అతని నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. ఆ డబ్బుతో... షానవాజ్ జూన్ 5న 250 ఆక్సిజన్ సిలిండర్లు కొన్నాడు. వాటిని కరోనా సోకిన పేద ప్రజలకు ఇచ్చాడు. ఇందుకు రెండు కండీషన్లు పెట్టాడు. ఆక్సిజన్ సిలిండర్ తప్పనిసరి అని డాక్టర్ చెప్పినట్లుగా ఓ స్లిప్పు, ఆక్సిజన్ సిలిండర్‌ను పేషెంట్ తాలూకు వారే వచ్చి తీసుకెళ్లాలి. మొత్తం కుటుంబమే క్వారంటైన్‌లో ఉంటే... వాలంటీర్లు వచ్చి ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లారు.

  అసలీ సిలిండర్లు లేకపోతే ప్రాణాలెందుకు పోతున్నాయి అనే డౌట్ షానవాజ్‌కి వచ్చింది. ఇది తెలుసుకున్న కేర్ హాస్పిటల్‌లో డాక్టర్ షాబుద్దీన్ షేక్ ఓ ప్రత్యేక వీడియోని షానవాజ్‌కి చూపించారు. తద్వారా షానవాజ్‌కి అవి ఎంత ముఖ్యమో అర్థమైంది. "ఇవాళ నేను ఓ కారును కోల్పోవడం వల్ల నాకు పెద్దగా పోయిందేమీ లేదు. కానీ... ఆక్సిజన్ సిలిండర్ల వల్ల కొన్ని ప్రాణాలు నిలబడుతున్నాయి. వాళ్ల ఆశీర్వచనాలు నాకు దక్కుతున్నాయి. భవిష్యత్తులో మళ్లీ నేను కారు కొనుక్కోగలను" అన్నాడు షానవాజ్. నెటిజన్లు అతన్ని మెచ్చుకుంటున్నారు. లివింగ్ ఏంజెల్ అని ప్రశంసిస్తున్నారు.
  First published: