అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 2వేల మందికి పైగా పొట్టనపెట్టుకున్న కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. కన్నీటికి కారణమవుతోంది. అంత్యక్రియల కోసం స్మశానాల దగ్గర గంటల తరబడి అంబులెన్స్‌ల దగ్గర వేచిచూస్తున్న కుటుంబాల్లో ఎవరినీ కదిలించినా ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. కరోనా వల్ల నలిగిపోయిన కుటుంబాల్లో అహ్మదాబాద్‌లోని ఒదవ్ ప్రాంతానికి చెందిన మనోజ్ మిస్త్రీ కుటుంబం ఒకటి. ఈ చిత్రంలో మీకు కనిస్తున్న వ్యక్తి పేరు మనోజ్ మిస్త్రీ. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ఒదవ్ నివాసి. 42 ఏళ్ల మనోజ్ అన్న దేవాంగ్కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దేవాంగ్ భార్యకు కూడా వైరస్ సోకింది. దీంతో.. అహ్మదాబాద్‌లోని 1200 పడకల కోవిడ్ హాస్పిటల్లో అతనికి చికిత్సనందిస్తున్నారు. అయితే.. కరోనా రోగుల వద్దకు నేరుగా వెళ్లి కలిస్తే వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉండటంతో వారితో కుటుంబ సభ్యులు మాట్లాడేందుకు వీడియో కాల్ సదుపాయాన్ని హాస్పిటల్ యాజమాన్యం కల్పించింది. ఉదయం 9 గంటలకు ఒకసారి, సాయంత్రం 3 గంటలకు మరోసారి కరోనా పేషంట్లతో వీడియో కాల్ మాట్లాడేందుకు వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఉంటుంది. అయితే.. ఆ వీడియో కాల్ మాట్లాడాలంటే హాస్పిటల్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు పది రోజుల క్రితం కరోనాతో మనోజ్ అన్నయ్య దేవాంగ్ ఆసుపత్రిలో చేరాడు. ఆ పది రోజుల నుంచి రోజూ వీడియో కాల్ మాట్లాడి అన్నయ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నాడు.
తల్లిదండ్రులకు కరోనా సోకి ఆసుపత్రిలో ఉండటంతో దేవాంగ్ కూతురు ఆమె బాబాయ్ అయిన మనోజ్ మిస్త్రీతోనే ఉంటోంది. రోజూలానే అన్నయ్యతో వీడియో కాల్ మాట్లాడేందుకు మిస్త్రీ మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లాడు. తన అన్నయ్యను చూసేందుకు ఎదురుచూస్తున్న మనోజ్‌కు ఓ చేదు వార్త తెలిసింది. ఆ విషయం తెలిసి గుండె బద్ధలైంది. దేవాంగ్ ఆరోగ్యం మరింతగా క్షీణించి మరణించాడని ఆసుపత్రి సిబ్బంది వార్డులో ఉన్న మనోజ్‌తో చెప్పారు. అన్నయ్యతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్న ఆ తమ్ముడిని దేవాంగ్ మరణవార్త కలచివేసింది. ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యాడు.
ఉదయం వచ్చినా తన అన్నతో చివరిసారి మాట్లాడే అవకాశం ఉండేదని, ఉదయం 9 గంటలకు రాలేకపోయి 10.30కు వచ్చానని.. ఆ సమయంలో వీడియో కాల్ మాట్లాడేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారని వార్డులో ఉన్న మనోజ్ గుండెలవిసేలా రోదించాడు. తన అన్నయ్య కూతురికి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలని, తన తండ్రి చనిపోయాడని ఎలా చెప్పాలని ఏడ్చాడు.
మరో దురదృష్టకర విషయం ఏంటంటే.. మనోజ్ వదిన, దేవాంగ్ భార్య కూడా ఆక్సిజన్ సపోర్ట్‌తో శ్వాస తీసుకుంటూ కరోనాతో పోరాడుతోంది. ఆ పరిస్థితుల్లో ఉన్న తన వదినకు అన్నయ్య చనిపోయిన విషయం ఎలా చెప్పగలనని మనోజ్ కన్నీళ్లు పెట్టుకున్న తీరు చూసి వార్డులో ఉన్న వారందరికీ హృదయం ద్రవించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.