ప్రజల్లో కరోనా వైరస్ భయాలు ఇంకా పోలేదు. ఈ మహమ్మారిపై ప్రజల్లో ఎన్నో అపోహలు నెలకొన్నాయి. దీనికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, ఇంకా వైరస్ వ్యాప్తి గురించి భయపడుతూనే ఉన్నారు. తాజాగా కరోనాకు దూరంగా ఉండటానికి అవసరానికి మించి మంచినీరు తాగిన వ్యక్తి.. మరణం అంచుల వరకు వెళ్లి కోలుకున్నాడు. ఈ ఘటన ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. బ్రిస్టల్‌లోని ప్యాచ్వే ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల ల్యూక్ అనే వ్యక్తి తనకు కరోనా సోకిందని అనుమానించాడు. వైరస్ నుంచి కోలుకోవడానికి ఎక్కువ మొత్తంలో మంచినీరు తాగడం మొదలుపెట్టాడు. ఎవరూ ఊహించని విధంగా ఈ అలవాటే ల్యూక్‌ను దెబ్బతీసింది. ఎక్కువగా నీళ్లు తాగడంవల్ల శరీరంలో ఉండే సోడియం అంతా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోయి అతడు కుప్పకూలిపోయాడు. అవసరానికి మించి నీరు తాడగం వల్ల శరీరంలో ఉండే సాల్ట్స్ బయటకు పోతాయి. ఇది వాటర్ ఇన్టాక్సికేషన్కు (Water intoxication) కారణమవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
* ఎలక్ట్రోలైట్లు పడిపోయి..
శరీరంలో సాల్ట్ లెవల్స్, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోవడం వల్ల ల్యూక్ నీరసంతో కళ్లుతిరిగి పడిపోయాడు. దీంతో అతడి భార్య లారా అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. వారు వచ్చేసరికి అరగంటకు పైగా సమయం పట్టింది. అప్పటికే అతడు పూర్తిగా స్పృహ కోల్పోయాడు. ఎమర్జెన్సీ సిబ్బంది ల్యూక్‌ను సౌత్మీడ్ హాస్పిటల్లో చేర్చి చికిత్స అందించారు. హాస్పిటల్లో చేర్చిన 24 గంటల వరకు ల్యూక్ పరిస్థితి విషమంగానే ఉంది. రెండు, మూడు రోజుల వరకు ఐసీయూలో ఉంచారు. వెంటిలేటర్ పెట్టి ట్రీట్మెంట్ చేసిన తరువాత అతడు కోలుకున్నాడు.
* అవన్నీ అపోహలే..
కొన్ని రోజుల వరకు ఫ్లూయిడ్స్, ఎలక్రోలైట్లు అందించి ల్యూక్ ప్రాణాలను డాక్టర్లు కాపాడగలిగారు. ఇప్పుడు అతడు కోలుకుంటున్నాడు. అవసరానికి మించి నీరు తాగితే శరీరంలోని సోడియం, ఇతర సాల్ట్స్ మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి. దీంతో ఎలక్ట్రోలైట్ల సంఖ్య తగ్గిపోతుంది. ల్యూక్ విషయంలో ఇదే జరిగింది. వాటర్ ఇన్‌టాక్సికేషన్ వల్ల అతడి మెదడులో వాపు ఏర్పడింది. సమస్య తీవ్రంగా ఉంటే అతడు చనిపోయేవాడు. ఎక్కువగా మంచినీరు తాగటం వల్ల కరోనా వ్యాపించదు అనేది అపోహ అని డాక్టర్లు చెబుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:December 30, 2020, 12:39 IST