1984లో చోటు చేసుకున్న భోపాల్ గ్యాస్ ప్రమాదం నుంచి బయటపడిన 102 మంది బాధితులు కరోనాతో మృతిచెందినట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే పలు ఎన్జీవో సంస్థలు మాత్రం ఈ సంఖ్య 254గా ఉందని పేర్కొంటున్నాయి. డిసెంబర్ 2న భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి 36 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భోపాల్ గ్యాస్ విషాద ఘటన నుంచి బయటపడిన బాధితులు ఎంత మంది కరోనాతో మరణించారనే దానిపై అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థలు గణంకాలను వెల్లడించాయి. కాగా, భోపాల్ గ్యాస్ లీకేజీ ఘటన ప్రపచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తుగా నిలిచింది. భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా కంపెనీ నుంచి 1984 డిసెంబర్ 2వ తేదీన అర్ధరాత్రి మిథైల్ ఐసోసైనెట్ గ్యాస్ లీక్ అయింది. ఈ దుర్ఘటనలో 15వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గ్యాస్ లీకేజ్ ప్రభావం దాదాపు 5 లక్షలకు పైగా ప్రజలపై ప్రభావం చూపింది.
"కోవిడ్ కారణంగా డిసెంబర్ 2వ తేదీ వరకు భోపాల్ జిల్లాల్లో 518 మంది మృతిచెందారు. అందులో 102 మంది భోపాల్ గ్యాస్ విషాద ఘటన బాధితులు ఉన్నారు. అందులో 69 మంది 50 ఏళ్లు పైబడినవారు. మిగిలిన 33 మంది వయస్సు 50 కంటే తక్కువ" భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ డైరెక్టర్ బసంత్ కుర్రే తెలిపారు.
మరోవైపు భోపాల్ గ్రూప్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్ ఎన్జీవోకు చెందిన రచ్నా ధింగ్రా మాట్లాడుతూ.. "రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం భోపాల్ జిల్లాలో ఇప్పటివరకు 518 మంది కరోనాతో మరణించారు. వీరిలో 450 మంది ఇళ్లను మేము సందర్శించాం. ఈ 450 మందిలో 254 మంది భోపాల్ గ్యాస్ విషాదం నుంచి బయటపడినవారని తేలింది. ఈ 254 మంది కూడా భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ జారీచేసిన స్మార్ట్ కార్డులను కలిగి ఉన్నారు. గ్యాస్ బాధితులకు చికిత్స అందించడం కోసం కేటాయించినవే ఈ స్మార్ట్ కార్డ్స్. స్మార్ట్ కార్డ్ మాత్రమే కాకుండా భోపాల్ గ్యాస్ విషాదం పరిహారానికి చెందిన ఆర్డర్ ఫొటో కాపీలు కూడా ఉన్నాయి. మేము స్మార్ట్ కార్డ్స్‌తో పాటు, పరిహారపు ఆర్డర్స్‌కు సంబంధించిన కాపీలను మేము వాళ్లను సందర్శించినప్పుడు సేకరించాం. వీటిని గ్యాస్ రిలీఫ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రవి వర్మకు సమర్పించాం. కోవిడ్-19తో మరణించిన గ్యాస్ బాధితుల పూర్తి గణంకాలు ప్రభుత్వం వద్ద లేవు"అని చెప్పారు.
ఇక, భోపాల్ గ్యాస్ బాధితుల కోసం పనిచేస్తున్న భోపాల్ గ్రూప్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్, భోపాల్ గ్యాస్ పీడిట్ స్టేషనరీ కర్మచారి సంఘ్, భోపాల్ గ్యాస్ పీడిట్ మహిళా పురుష్ సంగర్ష్ మోర్చా, చిల్డ్రన్ ఎగెనెస్ట్ డౌ కెమికల్స్ సంస్థలకు చెందిన ప్రతినిధులు మాట్టాడుతూ.. కరోనా కాలంలో గ్యాస్ విషాదం నుంచి బయటపడినవారికి అదనపు సహాయం పరిహారం ఇవ్వాలని కోరారు. గ్యాస్ లీకేజ్ ప్రభావం వీరిపై దీర్ఘకాలం ఉంటుందనేది ఇదివరకు అనేక సార్లు నిరూపితమైందని అన్నారు. వీరు సులువుగా కరోనా బారిన పడి మరణించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
Published by:Sumanth Kanukula
First published:December 03, 2020, 07:39 IST