దేశంలో ఒమిక్రాన్ కేసుల కట్టడి కోసం రాష్ట్రాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలని కోరింది. తాజాగా కేంద్రం సూచనలను అమలు చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ఈ రోజే నుంచే నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా మార్గదర్శకాలను అంతా పాటించాలని.. కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కరోనా కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌లలో కరోనా మళ్లీ విస్తరిస్తోందని.. కాబట్టి దానిని మనం నివారించాలని అన్నారు. ఇందులో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నామని తెలిపారు. ఇది రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఉంటుంది.
కరోనా తన రూపం మార్చుకుందని సీఎం శివరాజ్ సింగ్ అన్నారు. దేశంలోని 16 రాష్ట్రాలకు Omicron వ్యాపించిందని అన్నారు. ఇది మధ్యప్రదేశ్‌కు కూడా చేరుకునే అవకాశం ఉందని.. ఓమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ప్రజలంతా మాస్క్ ధరించి, భౌతిక దూర పాటించాలని అన్నారు. అనవసరంగా జనంలోకి వెళ్లవద్దని సూచించారు.
ఇక దేశంలో కొత్తగా 7,495 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న 6,960 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల కొత్తగా 434 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో మొత్తం 78,291 మంది చికిత్స తీసుకుంటున్నారు. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,42,08,926కు చేరింది. కరోనా మరణాల సంఖ్య మొత్తం 4,78,759కి పెరిగింది. దేశంలో మొత్తం 1,39,69,76,774 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో ఇప్పటివరకు మొత్తం 104 మంది కోలుకున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.