కోవిడ్-19 (Covid 19) వ్యాధి బారినపడిన రోగులలో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఇప్పటికే చాలా పరిశోధనల్లో తేలింది. కరోనా రోగుల్లో జ్ఞాపక శక్తిని కోల్పోవడం, ఊపిరితిత్తులు(Lungs) దెబ్బతినడం వంటి తదితర లక్షణాలను శాస్త్రవేత్తలు గతంలో గుర్తించారు. అయితే తాజా అధ్యయనంలో మరొక భయానక అంశం వెలుగులోకి వచ్చింది. తీవ్ర, స్వల్ప లక్షణాలతో ఆసుపత్రి పాలైన కరోనా రోగులు దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఎండ్-స్టేజ్ మూత్రపిండాల వ్యాధి (ESKD) వచ్చే ముప్పు కూడా ఉందని అధ్యయనంలో తేలింది. వెటరన్స్ అఫైర్స్ సెయింట్ లూయిస్ హెల్త్ కేర్ సిస్టమ్, వాషింగ్టన్ యూనివర్సిటీ (Washington University) శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. వారి అధ్యయన ఫలితాలను అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ జర్నల్‌లో ప్రచురించారు.
అమెరికాలో ప్రజలు చనిపోవడానికి ప్రధాన కారణాలలో మూత్రపిండాల వైఫల్యం ఒకటి కాగా.. శాస్త్రవేత్తలు ఈ వ్యాధి ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఫెడరల్ హెల్త్ డేటాను విశ్లేషించారు. సైలెంట్ డీజీస్ గా పేరు తెచ్చుకున్న ఈ కిడ్నీ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించవు. దీనివల్ల 37 మిలియన్ అమెరికన్ రోగులలో 90% మందికి వారి కిడ్నీల అనారోగ్యం గురించి తెలిసి ఉండదని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ అంచనా వేసింది.
కరోనా వల్ల ఇలా ఎందుకు జరుగుతుంది?
పల్మనరీ, ఎక్స్‌ట్రాపల్మోనరీ అవయవ వ్యవస్థలను దెబ్బతీసే ప్రమాదాలను తీవ్రతరం చేయడంలో కోవిడ్ -19 సంబంధం కలిగి ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. దీన్నే లాంగ్ కోవిడ్ (long Covid) అని పిలుస్తారు. కరోనా సోకిన తరువాత ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం కొత్త లక్షణాలతో బాధపడే పరిస్థితినే లాంగ్ కోవిడ్ అంటారు. మార్చి 1, 2020 నుంచి మార్చి 15, 2021 వరకు 17,26,683 మంది సైనికులు, 30 రోజుల్లో కోలుకున్న 89,216 కరోనా బాధితులు, 16,37,467 కరోనా సోకని ప్రజలపై అధ్యయనం నిర్వహించారు.
Children Fight Covid-19: పిల్లలపై కరోనాప్రభావం ఎందుకు తక్కువ?.. మిస్టరీని చేధించిన పరిశోధకులు..
అయితే, ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.కోవిడ్-19 వ్యాధితో ఆసుపత్రిలో లేదా ఐసీయూలో చేరిన వ్యక్తులు కిడ్నీ సమస్యల బారినపడే ప్రమాదం అధికంగా ఉందని అధ్యయన సీనియర్ రచయిత, ఎండీ జియాద్ అల్-అలీ తెలిపారు. స్వల్ప లక్షణాలున్న బాధితులలో కూడా ముప్పు ఉంటుందన్నారు. ఆకస్మాత్తుగా కిడ్నీ పనిచేయకపోవడం (Acute Kidney Injury) వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం 2.1- 2.9 శాతంగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
లాంగ్ కోవిడ్ నుంచి కోలుకునేవారు గుర్తుంచుకోవాల్సిన అంశాలు..
ఇంటి దగ్గరే చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్న వారిలో కూడా కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే, ఈ లక్షణాలు కనిపించవు. కాబట్టి తక్కువ మూత్రవిసర్జన, కాళ్లు, కళ్ళ చుట్టూ వాపు, అలసట, శ్వాస ఆడకపోవడం, వికారం, మూర్ఛలు, కోమా వంటి లక్షణాలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మూత్రంలో అధిక ప్రోటీన్, రక్తం కనిపిస్తే ఆందోళన పడాల్సిన అవసరం ఉంటుంది. ఊపిరితిత్తుల కణాలను పాడు చేసిన మాదిరిగా మూత్రపిండాల కణాలను కూడా కరోనా వైరస్ పాడు చేయగలవునే విషయం గుర్తుంచుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
మూత్రపిండాల పనితీరు పరిశీలించడానికి ఎప్పటికప్పుడు కరోనా రోగులు సాధారణ క్రియేటినిన్ పరీక్ష చేయించుకోవాలి. మధుమేహం, అధిక రక్త పోటుతో బాధపడుతున్న రోగులు మరింత జాగ్రత్త పడాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ముందస్తుగానే కిడ్నీ పనితీరును గుర్తిస్తే.. వ్యాధిని వెంటనే నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తరచూ హెల్త్ చెకప్ చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine, Covid, Kidney, Vaccinated for Covid 19