Corona Oven | కరోనా వైరస్... ఇటీవల జనాల్లో తీవ్ర భయాందోళనల్ని సృష్టించిన భయంకరమైన వైరస్. మీరు కొనే వస్తువులపైనా ఈ వైరస్ ఉండొచ్చు. అందుకే ఈ వైరస్‌ను చంపేందుకు కరోనా ఓవెన్‌ను తయారు చేసింది ఓ స్టార్టప్.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా శుభ్రతపై అవగాహన పెరిగిపోయింది. ఇంట్లోకి తీసుకొచ్చే ప్రతీ వస్తువును శుభ్రం చేసే అలవాటు పెరిగిపోయింది. కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులు ఏవైనా సరే శుభ్రం చేసిన తర్వాతే ఇంట్లోకి తీసుకొస్తున్నారు. వీటిని శుభ్రం చేయడానికి బెంగళూరుకు చెందిన స్టార్టప్ Log9 Materials 'కరోనా ఓవెన్' తయారు చేసింది. ఇప్పుడు ఈ 'కరోనా ఓవెన్'కు ఫుల్ డిమాండ్ ఉంది ఏకంగా విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. లాగ్9 మెటీరియల్స్ ఫ్రాన్స్‌కు చెందిన వెర్సాల్లెస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా 'కరోనా ఓవెన్'లను ఫ్రాన్స్‌కు ఎక్స్పోర్ట్ చేయనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడి అధికారిక ప్యాలెస్‌లో కూడా 'కరోనా ఓవెన్' పెట్టనున్నారు.
'కరోనా ఓవెన్'తో మీరు మీ మాస్కులు, పీపీఈ కిట్స్, నిత్యావసర వస్తువుల్ని కేవలం 10 నిమిషాల్లో శుభ్రం చేయొచ్చు. 'కరోనా ఓవెన్'లో వస్తువులు పెట్టిన తర్వాత ఆన్ చేస్తే అల్ట్రా వయొలెట్ జెర్మిసిడల్ ఇర్రేడియేషన్ ద్వారా యూవీసీ లైట్ వస్తువులపై పడుతుంది. కేవలం 10 నిమిషాల్లో కరోనా వైరస్‌తో పాటు ఇతర క్రిములన్నీ అంతమవుతాయి. ఆ వస్తువుపై ఎలాంటి వైరస్లు ఉండవు. 'కరోనా ఓవెన్'ను ఉపయోగించడం చాలా సులువు. మైక్రోవేవ్ ఓవెన్ ఉపయోగించినంత ఈజీగా 'కరోనా ఓవెన్'ను వాడుకోవచ్చు. బ్యాటరీ ద్వారా ఇది పనిచేస్తుంది.
నానో టెక్నాలజీ స్టార్టప్ అయిన లాగ్9 మెటీరియల్స్ ఈ ప్రొడక్ట్ పేటెంట్ కోసం ప్రయత్నిస్తోంది. ఇటీవల సీఈ మార్క్ సర్టిఫికేషన్ వచ్చింది. మాస్కులు, పీపీఈ కిట్స్‌ని ఒకసారి ఉపయోగించి పారెయ్యకుండా మళ్లీ వాడుకోవడానికి 'కరోనా ఓవెన్' తోడ్పడుతుంది. 'కరోనా ఓవెన్' కొనేందుకు యురోపియన్ దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కెనెడాకు చెందిన పలు సంస్థలు కూడా వీటిని కొనేందుకు చర్చలు జరుపుతున్నాయి. 'కరోనా ఓవెన్'కు మరిన్ని మెరుగులు దిద్దేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరుతో ఒప్పందం కుదుర్చుకుంది లాగ్9 మెటీరియల్స్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.