కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి కోసం కఠినమైన ఆంక్షలను విధించింది. రాష్ట్రంలో ఏప్రిల్ 22 నుంచి మే 1 వరకు లాక్‌డౌన్ విధించింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి మే1 ఉదయం 7 గంటల వరకు ఈ కఠినమైన ఆంక్షలు అమల్లో ఉంటాయి. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
కొత్త నిబంధనలు ఇవే:
గురువారం రాత్రి 8 నుంచి మే1 ఉదయం 7 వరకు కఠినమైన ఆంక్షలు
వివాహ వేడుకలపై ఆంక్షలు జరగాలి. ఒకే హాల్‌లో ఒకే వేడుకగా నిర్వహించాలి. పెళ్లిళ్లకు 25 మంది కంటే ఎక్కువ హాజరుకాకూడదు. 2 గంటల్లోగా పూర్తవ్వాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే 50వేలు జరిమానా విధిస్తారు.
50శాతం సీటింగ్ కెపాసిటీతో ప్రైవేట్ బస్సులు నడుస్తాయి. సిటీల్లో రెండు కంటే ఎక్కువ చోట్ల ఆపకూడదు. ప్రయాణికులు దిగే సమయంలో 14 రోజుల క్వారంటైన్ స్టాంప్ వేయాలి.
బస్సులు మినహా ఇతర ప్రైవేట్ వాహనాలకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి. 50శాతం సీటింగ్ కెపాసిటీకి మించి ప్రయాణించకూడదు. అది నగర పరిధిలో మాత్రమే. వేరేకొ నగరం, లేదా జిల్లాకు వెళ్లాలంటే ఖచ్చితమైన కారణం చెప్పాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10వేలు జరిమానా.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 15 శాతం సిబ్బందికి మాత్రమే అనుమతి.
లోకల్ రైళ్లలో సాధారణ ప్రజలకు అనుమతి లేదు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ సిబ్బంది, వైద్య చికిత్స అవసరమైన వారి కోసమే లోకల్ రైళ్లు నడుస్తాయి. వీరికి ప్రత్యేక పాసులు మంజూరు చేస్తారు.
కాగా, మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం 67,468 కేసులు నమోదయ్యాయి. ఏకంగా 568 మంది మరణించారు. 54,985 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వీటితో కలిపి మహారాష్ట్రలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 40,27,827కి చేరింది. వీరిలో 3268448 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 61,911 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 695747 యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.