ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి అజాగ్రత్తల వల్ల వైరస్ విజృంభిస్తోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కమ్మపల్లి పంచాయతీల్లో లాక్ డౌన్ విధించారు. గ్రామంలో కరోనా విజృంభిస్తుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలను మూసివేసిన అధికారులు.. గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇటీవల గ్రామంలో పది కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కమ్మపల్లి పంచాయతీలో 10 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. పక్కనే ఉన్న గంగిరెడ్డి పల్లె పంచాయతీలో ఒక కేసు నమోదైంది.
టెస్టుల్లో పాజిటివ్ గా నమోదైన వారిని ఐసోలేషన్ కు తరలించారు. కొంతమందికి హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలోకి ఎవర్నీ రాకుండా అధికారులు కట్టుదిట్టం చేశారు. రామచంద్రాపురం ఎమ్మార్వో, పోలీసులు, వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మరోవైపు రాయలసీమ జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో కరోనా కలకలం రేగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలను మూసివేశారు. రెండు రోజుల క్రితం ఇద్దరు విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించగా.. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు నిర్వహించారు. ఇద్దరికీ పాజిటివ్ గా నిర్ధరాణ అవడంతో వారికి ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం స్కూల్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు స్కూల్లో 400 మందికి పైగా విద్యార్థులుండటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఏపీలో సోమవారం ఒక్క రోజు 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 మందికి పాజిటివ్ గా తేలింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor, Corona Possitive