Covid Treatment: పిల్లలకు రెమ్‌డెసివిర్‌, సీటీ స్కాన్ వద్దు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ఎలాంటి లక్షణాలు లేకుండా లేదా తేలికపాటి లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలిన పిల్లలకు స్టెరాయిడ్లు ఇవ్వకూడదు. వీరికి చికిత్సలో లేదా రోగనిరోధకతను పెంచడానికి యాంటీమైక్రోబయాల్స్ సిఫారసు చేయకూడదు.

  • Share this:
దేశంలో కోవిడ్ రెండోదశ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. మూడవ దశలో మహమ్మారి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు కోవిడ్ చికిత్సకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వారికి యాంటీ వైరల్ డ్రగ్ అయిన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌ను ఇవ్వకూడదని, కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సలహా ఇచ్చింది. దీంతో పాటు సీటీ స్కాన్, స్టెరాయిడ్స్ వాడకానికి సంబంధించిన సలహాలు ఈ మార్గదర్శకాల్లో ఉన్నాయి.

సెకండ్ వేవ్‌లో వ్యాధి సోకిన, ఆసుపత్రిలో చేరిన 60-70 శాతం మంది పిల్లలకు దీర్ఘకాలిక వ్యాధులు లేదా తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఎలాంటి అనారోగ్యాలు లేని పిల్లలు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకున్నారని వివరించారు. దీనికి తోడు.. తరువాత దశలో పిల్లలపై కోవిడ్ ఎక్కువ ప్రభావం చూపుతుందని సూచించడానికి ఎలాంటి డేటా అందుబాటులో లేదని నేషనల్ కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్‌ బృదం, సీనియర్ వైద్య నిపుణులు తెలిపారు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మార్గదర్శకాలను ప్రకటించింది.

కొత్త మార్గదర్శకాల్లో ప్రధానాంశాలు

* తేలికపాటి వ్యాధి లక్షణాలు ఉన్నవారికి..
ఎలాంటి లక్షణాలు లేకుండా లేదా తేలికపాటి లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలిన పిల్లలకు స్టెరాయిడ్లు ఇవ్వకూడదు. వీరికి చికిత్సలో లేదా రోగనిరోధకతను పెంచడానికి యాంటీమైక్రోబయాల్స్ సిఫారసు చేయకూడదు. అత్యవసరమైతేనే సీటీ స్కాన్, హెచ్‌ఆర్‌సీటీ ఇమేజింగ్ సిఫార్సు చేయాలి. తేలికపాటి ఇన్ఫెక్షన్లు ఉన్నవారిలో జ్వరం, గొంతు నొప్పి తగ్గించడానికి.. ప్రతి 4 నుంచి 6 గంటలకు 10-15mg పారాసెటమాల్ ఇవ్వవచ్చు. కౌమారదశలోని పిల్లల్లో దగ్గును నివారించడానికి గోరువెచ్చని సెలైన్ వాటర్‌తో పుక్కిలించవచ్చు.

* లక్షణాలు మధ్యస్థంగా ఉన్నవారికి..
మధ్యస్థ లక్షణాలతో కోవిడ్ బారిన పడిన పిల్లలకు ఆక్సిజన్ చికిత్స అందించాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కానీ ఈ స్థితిలో ఉండే పిల్లలందరికీ కార్టికోస్టెరాయిడ్స్ అవసరం లేదు. అయితే వ్యాధి తీవ్రత వేగంగా పెరుగుతుంటే మాత్రం, వాటిని ఇవ్వవచ్చు.

* తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉంటే..
పిల్లలలో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ ఉంటే, వెంటనే వైద్యుల సమక్షంలో ఆక్సిజన్, వెంటిలేటర్ల ద్వారా చికిత్స అందించాలి. సూపర్‌డెడ్ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉంటే, యాంటీమైక్రోబయాల్స్ ఇవ్వాలి. షాక్‌ బారిన పడే అవకాశం ఉంటే, దాన్ని నివారించే మార్గాలు పాటించాలి. 12 ఏళ్లు దాటిన కోవిడ్‌ బాధితుల్లో గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు ప్రామాణిక ‘సిక్స్ మినిట్స్ వాకింగ్ టెస్ట్’ నిర్వహించాలని కేంద్ర మార్గదర్శకాలు సూచించాయి. ఈ సమయంలో వారి చేతి వేళ్లకు ఆక్సిమీటర్‌ను పెట్టి, ఆక్సిజన్ స్థాయిని గుర్తించాలి. ఫలితాల ఆధారంగా చికిత్స విషయంలో వైద్యులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

India Corona: కేసులు తగ్గినా.. భయపెడుతున్న మరణాలు.. నేటి కరోనా బులెటిన్ వివరాలు
Published by:Shiva Kumar Addula
First published: