సవాళ్లే విజయానికి సోపానాలు... కరోనా కూడా ఓ సవాలు అంతే...

ఈ 21 రోజుల్లో 21 పాఠాలు నేర్చుకుందాం అంటూ కర్ణాటకకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై తన జీవిత పాఠాలను చెబుతున్నారు. 

news18-telugu
Updated: March 26, 2020, 5:52 PM IST
సవాళ్లే విజయానికి సోపానాలు... కరోనా కూడా ఓ సవాలు అంతే...
ప్రతీకాత్మక చిత్రం (Image:Pexels)
  • Share this:
(కె.అన్నామలై, మాజీ ఐపీఎస్ అధికారి, కర్ణాటక) 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సమయంలో ప్రజలు 21 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ‘ఈ 21 రోజుల్లో 21 పాఠాలు’ నేర్చుకుందాం అంటూ కర్ణాటకకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై తన జీవిత పాఠాలను చెబుతున్నారు.

మనమంతా మన జీవితాలు బావుండాలని, ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. ఈ క్రమంలో ఎదురయ్యే కష్టనష్టాలను ద్వేషిస్తాం. అలాంటి సమయంలో ఎవరో అవాంఛితంగా మన జీవితంలోకి చొరబడినట్టు అందుకే, మన జీవన ప్రయాణం నెమ్మదించినట్టు భావిస్తాం. ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే ప్రతికూలతను దాటుకుని ముందుకు రావడమే అసలైన ఎదుగుదల. విజయాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ, ఎన్నో కష్టాలు, ఒడిదొడుకులను దాటుకుని సాధించిన విజయమే అసలైన పాఠాలు నేర్పుతుంది.

అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఓ చిన్న గదిలో 1809లో పుట్టిన ఓ పెద్ద మనిషి సాధారణంగా మనుషులు అనుభవించే విషాదం కంటే ఎక్కువే చవిచూశాడు. 1912లో అతడి చిన్న సోదరుడు థామస్ జూనియర్ చనిపోయాడు. అతడికి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు తల్లిని కోల్పోయాడు. తల్లి తర్వాత అతడి ఆలనా పాలనా చూసిన అక్క కూడా అతడికి 19 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి చనిపోయింది. అతడి తొలి ప్రేమ మొగ్గతొడగకముందే ప్రియురాలు అన్ రటలెడ్జ్ కూడా కన్నుమూసింది. మేరీతో పెళ్లి జరిగిన తర్వాత 1846లో పుట్టిన రెండో కుమారుడు ఎడ్వర్డ్ నాలుగేళ్లకే (1850లో) కన్నుమూశాడు. 1847లో జన్మించిన మూడో కొడుకు కూడా 11 సంవత్సరాలకే కాలం చేశాడు. 1853లో పుట్టిన చిన్న కొడుకు 18 సంవత్సరాలకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఇన్ని విషాదాలను దగ్గరి నుంచి చూసిన అతడి జీవితం మరింత రాటుదేలింది. అన్ని కష్టాలు, నష్టాలను ఎదుర్కొంటూ వచ్చిన ఆ వ్యక్తి రెండు సార్లు అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఆయన ఎవరో కాదు. అబ్రహాం లింకన్. ఓ గొప్ప అధ్యక్షుడు, రాజనీతిజ్ఞుడు. విలువల పరంగా, రాజ్యాంగ పరంగా, సివిల్ వార్ సమయంలో రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొని అమెరికాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన నాయకుడు.తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, రాజనీతిజ్ఞులు, నాగరిక వీరుల జీవిత కథలను మనం ఓ సారి డీకోడ్ చేసి చూస్తే వారి జీవితాన్ని మలుపుతిప్పి ఎదగడానికి దోహదపడిన ఘటనలను చూడవచ్చు. అయితే, అందులో అత్యధిక శాతం ప్రతికూలమైనవే అయి ఉంటాయి. అవి ఎలాంటి వంటే, తాను నెలకొల్పిన కంపెనీ నుంచి బహిష్కరణకు గురైన స్టీవ్ జాబ్స్, ఆ తర్వాత అదే కంపెనీలో చేరి యాపిల్ సంస్థను ప్రపంచ దిగ్గజ కంపెనీగా మార్చడం లాంటివన్నమాట. ఇక హెన్రీ ఫోర్డ్ తొలిదశలో తనకు వస్తున్న నష్టాన్ని లెక్కచేయకుండా ముందుకు వెళ్లడం వల్లే ఆ తర్వాత కార్ల తయారీ రంగంలో విప్లవాన్ని తీసుకురాగలిగారు. మొద్దబ్బాయి, చదవలేడు అని ముద్రపడిన అల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆ తర్వాత క్రమంలో ఫిజిక్స్‌లో నోబుల్ బహుమతి గెలుపొందారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షించిన హారీపోటర్ పుస్తకం పబ్లిష్ కావడానికి ఆ నవలా రచయిత జేకే రౌలింగ్ ఎన్నో తిరస్కారాలను ఎదుర్కొన్నారు. ఈ జాబితా అనంతమైంది. గొప్ప గొప్ప వ్యక్తులు అందరిలోనూ ఇలాంటివి పునరావృత్తం అవుతూ ఉంటాయి.

అలాంటి వారి దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన ఆ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వారంతా విజయాలను విజయాలుగా, వైఫల్యాలను పరాజయాలుగా చూడరు. వారు రెండింటినీ జీవన ప్రయాణంలో ఎదురైన రెండు ఘటనలుగానే చూస్తారు. ఈ రెండూ అనివార్యంగా భావిస్తారు. గెలుపు, ఓటమి రెండింటినీ సమానంగా తీసుకోగలిగినట్టుగా వారి మైండ్ సెట్ రూపుదిద్దుకుని ఉంటుంది. తమకు ఎదురైన పాఠాలను మెట్లుగా చేసుకుని మరింత పైకి ఎదగడానికి అనువుగా తమను తాము మార్చుకుంటారు.

ఉడిపిలో నాకు ఓ కథ గుర్తొస్తుంది. అప్పుడు నేను ఉడుపి ఎస్పీగా ఉన్నా. కువైట్‌ జైల్లో ఉన్న తన భర్తను రక్షించుకోవడానికి ఓ మహిళ పడిన కష్టం అది. కువైట్‌లోకి శృంగార ఉద్దీపన కలిగించే ట్యాబ్లెట్లను అక్రమంగా తీసుకుని వచ్చారని అతడిపై ఆరోపణ. అయితే, తనకే పాపం తెలియదని, మంగళూరు విమానాశ్రయంలో తనకు కొందరు ఈ ట్యాబ్లెట్లను ఇచ్చారని, కువైట్‌లో ఉన్న తమ బంధువు, హార్ట్ పేషెంట్ కోసం ఆ మందులను పంపిస్తున్నామని అతడు చెప్పాడు. అయితే, ఈ కేసులో భారత ఎంబసీతో ఆమెకు పరిచయం ఏర్పాటు చేయడం మినహా నేను పెద్దగా ఏమీ చేయలేకపోయాను. అయితే, ఎప్పుడూ ఉడుపి దాటి కూడా బయటకు రాని ఆ మహిళ ఢిల్లీకి వెళ్లింది. అక్కడ తమ ఎంపీని కలిసింది. ఆ తర్వాత కేంద్ర విదేశాంగ శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లింది. ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా కొంత డబ్బు సేకరించి కువైట్ వెళ్లింది. అక్కడ స్థానిక సంఘాలను కలిసింది. తనకు అవసరమైన న్యాయ సహాయం తీసుకుంది. చివరగా, అక్కడ భారత ఎంబసీ సాయంతో తన భర్త అమాయకుడని వాదించి కేసు గెలిచింది. భర్తను తీసుకుని భారత్‌కు చేరుకుంది.ఈ స్టోరీ నాకు బాగా గుర్తుండిపోయింది. తన కుటుంబంలో ఆదాయం సంపాదించే ఒకే ఒక్క వ్యక్తిని జైల్లో పెడితే, ఆమె అతడిని బయటకు తీసుకురావడానికి ఎంతో శ్రమించింది. ఎన్నో అవాంతరాలను, ప్రతికూలతలను దాటుకుని ముందుకు వెళ్లింది. వాస్తవానికి ఆమె ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. 1. తన భర్త జైల్లో చిక్కుకోవడం తన తలరాత అని సరిపెట్టుకోవడం. 2. పరిస్థితుల మీద తిరగబడడం. ఆమె రెండో ఆప్షన్‌ను ఎంచుకుంది. ఈ న్యాయ పోరాటంలో... నేనెప్పుడూ బయట తిరగలేదే, పరాయి దేశంలో భాష తెలియకపోతే ఎలా అని ఆమె ఎక్కడా భయపడలేదు. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఎదుర్కొని బయటపడాలని నిర్ణయించుకుంది.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని బాధ కలిగించే మెసేజ్‌లు చూస్తున్నా. మస్కట్‌లో ఉన్న ఓ తండ్రి ట్వీట్ చేశాడు. కేరళలో ఉన్న తన 9 నెలల కుమార్తె చనిపోయిందని, తాను భారత్ రావడానికి అనుమతించాలని కోరాడు. తమ ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు చాలా బాధకలుగుతుంది. ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలని కోరుకుంటారు. కొంచెం పోలీసుల సాయం కావాలంటూ నాకు కూడా కొన్ని ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఇది వారికి కచ్చితంగా బాధాకరమైన సమయమే. అందులో ఎలాంటి అనుమానం లేదు. నాకు వీలైనంత వరకు సాయం చేశా. వీలుకాకపోతే నా నిస్సహాయతను కూడా వ్యక్తం చేశా. ఈ 21 రోజుల్లో ప్రజలు ఏవైతే ప్రతికూలతలు, అవాంతరాలు ఎదుర్కొంటున్నారో వాటి నుంచి కచ్చితంగా బయటపడగలరని నేను భావిస్తున్నా. బయటపడాలని ప్రార్థిస్తున్నా. కచ్చితంగా బయటపడతాం కూడా. ఇలాంటి సంక్లిష్ట సమయం నుంచి బయపడిన తర్వాత మనం కచ్చితంగా మునుపటిలా ఉండం. ఇది మనకు మనంగా చేయవలసిన వాగ్దానం.

ప్రఖ్యాత జపనీస్ రచయిత హరుకీ మురకామీ రచన నుంచి ఓ స్ఫూర్తిదాయక సందేశంతో నేను దీన్ని ముగించాలనుకుంటున్నా.

‘ఒక్కసారి తుఫాను వెలిసిందనుకో. దాని నుంచి నువ్వు ఎలా బయటపడ్డావో గుర్తుండదు. ఎలా బతికావో గుర్తుండదు. అసలు తుఫాన్ వెలిసిందా అనే సందేహం కూడా కలుగుతుంది. కానీ, ఒకటి మాత్రం కచ్చితం. తుఫాన్‌ నుంచి బయటపడిన తర్వాత నువ్వు పాత మనిషివి కాదు. ఇప్పుడు వచ్చిన తుఫాన్ కూడా అలాంటిదే.’

ప్రతికూలతలను అధిగమించండి.

ఇది కూడా చదవండి

రండి.. లాక్ డౌన్‌ 21 రోజుల్లో 21 పాఠాలు నేర్చుకుందాం...

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు