కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మొత్తం వ్యవస్థలు స్తంభించిపోయాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో బతుకు బండి నడవడం ఎలా అనే ఆందోళనతో పాటు నెలాఖరు వచ్చేసింది.. ఇంటి అద్దెలు ఎలా అనే భయం కూడా ప్రజల్లో మొదలైంది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అద్దె నివాసాల్లో ఉండే కూలీలను (ముఖ్యంగా వలసకూలీలు),రెంట్ కోసం భూ యజమానులు ఓ నెల రోజుల పాటు ఒత్తిడి చేయవద్దని స్పష్టంచేసింది. ఎవరైనా ఇంటి యజమానులు లేదా భూ యజమానులు కూలీలు, విద్యార్థులను అద్దె కోసం ఒత్తిడి తెస్తే వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇటీవల హైదరాబాద్లో తన పరిధి మేరకు పెద్దమనసు చాటుకున్నాడు ఓ ఇంటి యజమాని. హైదరాబాద్ జీడిమెట్లలోని సుభాష్ నగర్లో ఉండే ఓ ఇంటి యజమాని, తన ఇంట్లో అద్దెకు ఉంటున్న నాలుగు కుటుంబాలకు అద్దె మాఫీ చేసేశాడు. రెండు అంతస్తుల భవనంలో ఇంటి ఓనవర్తో నాలుగు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. కరోనా వైరస్ వల్ల ఆ ఇళ్లలో ఉండే వారు, గడప దాటలేని పరిస్థితి నెలకొంది. దీంతో కరోనా వైరస్ తగ్గే వరకు తనకు ఇంటి అద్దె కట్టాల్సిన అవసరం లేదని ఆ ఇంటి యజమాని హామీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Trending, Union Home Ministry