కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ బహిరంగ సవాల్ విసిరారు. తన మీద, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మీద మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వల్లే కర్నూలులో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందంటూ భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘నా వల్ల, కర్నూలు ఎంపీ వల్ల కరోనా వ్యాపించిందని భూమా అఖిలప్రియ ఆరోపించారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి. మీకే కాదు. ఎవరికైనా సరే. నాపై విచారణ వేస్తారా వేయండి. అధికారులపై వేస్తారా?, వేయండి. మేం తప్పు చేసి ఉంటే, మా కర్నూలులో రాజుగారి సెంటర్ అని ఉంది. అక్కడ మమ్మల్ని ఉరితీయండి. రెడీగా వెళ్తాం. అందరికన్నా ముందు మసీదులు బంద్ నేను చేయించా. తబ్లిగీ జమాత్ నుంచి వచ్చిన వారి ఇంటింటికీ వెళ్లి వారికి, మతగురువులకి, సంస్థలకు చెప్పి 24 గంటల్లో వారిని క్వారంటైన్ కేంద్రాలకు తీసుకుని వెళ్లా.’ అని హఫీజ్ ఖాన్ చెప్పారు.
అంతకు ముందు భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ‘కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే కరోనా కట్టడికి ఏం చేస్తున్నారో తెలియడం లేదు. కర్నూలు జిల్లాలో కరోనా పెరగడానికి కారణం హఫీజ్ ఖాన్ అని అందరికీ తెలుసు. జిల్లాలో కేసులు పెరగడానికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే (బియ్యపు మధుసూదన్ రెడ్డి) ట్రాక్టర్లతో ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే తీరును చూసి దేశమంతా మనల్ని చూసి నవ్వుతోంది. వైసీపీ ఎమ్మెల్యే నిర్వాకం వల్ల 8 మంది ప్రభుత్వ అధికారులకు కరోనా వచ్చింది. వారి కుటుంబాలకు కాళహస్తి ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్తారు? ఆ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు?’ అని ప్రశ్నించారు.
ఇది కూడా చూడండి:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bhuma Akhilapriya, Kurnool, Ysrcp