Vaccination: వ్యాక్సినేషన్ ప్రక్రియపై నెలకొన్న ఏడు అపోహలు.. అసలు వాస్తవాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

Covid-19 Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌పై అనేక అపోహలు వినిపిస్తున్నాయి. రాజకీయ కారణాలతో టీకాలపై దుష్ర్పచారం చేసిన ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో టీకా పంపిణీపై నెలకొన్న అపోహలు, అసలు వాస్తవాలను నీతి ఆయోగ్ వెల్లడించింది.

  • Share this:
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ద్వారానే కరోనాను నిరోధించడం సాధ్యమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ జనవరిలోనే మొదలైంది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ టీకాల కొరత కారణంగా ఈ ప్రక్రియకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌పై అనేక అపోహలు వినిపిస్తున్నాయి. రాజకీయ కారణాలతో టీకాలపై దుష్ర్పచారం చేసిన ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో టీకా పంపిణీపై నెలకొన్న అపోహలు, అసలు వాస్తవాలను నీతి ఆయోగ్ వెల్లడించింది. వీటికి సంబంధించిన వాస్తవాలను నీతి ఆయోగ్ సభ్యులు (ఆరోగ్య విభాగం), కోవిడ్-19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌ నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ పాల్ వెల్లడించారు.

* అపోహ 1: విదేశాల నుంచి వ్యాక్సిన్లు కొనడానికి కేంద్రం ప్రయత్నించట్లేదు.
వాస్తవం: కేంద్ర ప్రభుత్వం 2020 మధ్య నుంచే అన్ని ప్రధాన అంతర్జాతీయ వ్యాక్సిన్ తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఫైజర్, మోడెర్నా సంస్థలతో ఇప్పటికే కొన్ని రౌండ్ల చర్చలు జరిగాయి. భారతదేశంలో ఈ కంపెనీల వ్యాక్సిన్లను సరఫరా చేయడానికి, అవసరమైతే తయారు చేయడానికి సహాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరో విషయం ఏంటంటే.. అంతర్జాతీయంగా ఆమోదం పొందిన టీకాలు కొనడం అనేది ఇతర వస్తువులను కొన్నంత సులభం కాదు. టీకాలు ప్రపంచవ్యాప్తంగా పరిమితంగానే తయారవుతున్నాయి. వాటి సరఫరా కూడా తక్కువగానే ఉంది. దీనికి తోడు కంపెనీలకు సొంత ప్రాధాన్యాలు కూడా ఉంటాయి. సొంత దేశాలకు సంస్థలు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. మన దేశంలోనూ ఇలాగే జరుగుతోంది.

భారత్‌కు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ఫైజర్ సుముఖంగా ఉంది. టీకాలను వీలైనంత త్వరగా దిగుమతి చేసుకోవడానికి ఆ సంస్థ, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయి. రష్యా నుంచి స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు భారత్‌కు చేరుకున్నాయి. త్వరలోనే వీటిని భారత్‌లో తయారు చేయడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన టెక్నాలజీ బదిలీ పూర్తయిన తరువాత, భారత ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీ ప్రక్రియను ప్రారంభిస్తాయి. వ్యాక్సిన్లనూ భారత్‌లో తయారు చేసేందుకు అంతర్జాతీయంగా ఆమోదం పొందిన అన్ని తయారీ సంస్థలతోనూ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.

* అపోహ 2: ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను కేంద్రం ఆమోదించలేదు.
వాస్తవం: ప్రపంచ దేశాల్లో వినియోగానికి ఆమోదం పొందిన అన్ని వ్యాక్సిన్లకు భారత ప్రభుత్వం గత నెలలోనే అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. ఈ టీకాలు బ్రిడ్జింగ్ ట్రయల్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇతర దేశాలలో తయారు చేసి, ట్రయల్స్‌లో మెరుగైన పనితీరు కనబర్చిన వ్యాక్సిన్లు దేశంలో మళ్లీ ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం లేకుండా అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం డీసీజీఏ వద్ద విదేశీ వ్యాక్సిన్ తయారీదారుల దరఖాస్తు ఒక్కటి కూడా పెండింగ్‌లో లేదు.

అపోహ 3: దేశీయ వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం చర్యలు తీసుకోవట్లేదు.
వాస్తవం: 2020 ప్రారంభం నుంచి వివిధ కంపెనీలు వ్యాక్సిన్ల ఉత్పత్తి చేపట్టేలా చేయడంలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన పాత్ర పోషిస్తోంది. భారతీయ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ మాత్రమే వ్యాక్సిన్ల విషయంలో విజయవంతమైంది. ఇప్పటికే భారత్ బయోటెక్ సొంత ప్లాంట్ల సంఖ్యను నాలుగుకు పెంచడంతో పాటు మరో మూడు కంపెనీలు, ప్లాంట్లు కోవాగ్జిన్ ఉత్పత్తిని ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అక్టోబరు నాటికి పది కోట్ల డోసులు తయారు చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరో మూడు పీఎస్‌యూలు కలిసి డిసెంబర్ నాటికి నాలుగు కోట్ల డోసులు ఉత్పత్తి చేయనున్నాయి.

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే సీరం ఇన్స్టిట్యూట్ నెలకు 11 కోట్ల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేలా ప్రణాళిక వేస్తోంది. డాక్టర్ రెడ్డీస్‌ ఆధ్వర్యంలో ఆరు కంపెనీలు స్పుత్నిక్ టీకాలు తయారు చేయనున్నాయి. ఇప్పటికే కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి ప్రభుత్వం నిధులు సైతం మంజూరు చేసింది. 2021 చివరి నాటికి భారత్‌లో 200 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మరే ఇతర దేశంలోనూ ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు.

* అపోహ 4: కేంద్రం కంపల్సరీ లైసెన్సింగ్‌ను అమలు చేయాలి
వాస్తవం: కంపల్సరీ లైసెన్సింగ్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో మంచి ఆప్షన్‌ కాదు. యాక్టివ్ పార్ట్నర్‌షిప్‌, మానవ వనరుల శిక్షణ, ముడి పదార్థాల సోర్సింగ్, బయో-సేఫ్టీ ల్యాబ్‌లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ సందర్భంలో సాంకేతిక బదిలీ ప్రధానమైన అంశం. ఇది రిసెర్చ్, డెవలప్‌మెంట్ చేపట్టిన కంపెనీ చేతుల్లో ఉంటుంది. ఇప్పటి వరకు కేంద్రం కంపల్సరీ లైసెన్సింగ్ కంటే ఒక మెట్టు ముందే ఉంది. కోవాగ్జిన్ ఉత్పత్తిని పెంచడానికి భారత్ బయోటెక్, మరో మూడు సంస్థల మధ్య పార్ట్నర్‌షిప్ ఒప్పందం కుదిరింది. స్పుత్నిక్ టీకా కోసం కూడా ప్రభుత్వం ఇలాంటి విధానం అనుసరిస్తోంది.

* అపోహ 5: కేంద్రం తన బాధ్యతలను తక్కువ చేసుకుంటూ, రాష్ట్రాలపై భారం పెట్టింది
వాస్తవం: వ్యాక్సిన్ తయారీదారులకు నిధులు సమకూర్చడం నుంచి ఉత్పత్తిని వేగవంతం చేయడం వరకు.. అన్ని పనులూ కేంద్ర ప్రభుత్వమే చేసింది. విదేశీ టీకాలను భారతదేశానికి తీసుకురావడం వెనుక కూడా కేంద్ర ప్రభుత్వం కృషి ఉంది. కేంద్రం సేకరించిన వ్యాక్సిన్‌ను ప్రజలకు ఉచితంగా అందజేయడానికి రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. ఈ విషయాలన్నీ రాష్ట్రాలకు కూడా తెలుసు. వివిధ రాష్ట్రాలు కోరినందువల్లే సొంతంగా టీకాలు సేకరించడానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం, విదేశాల నుంచి నేరుగా వ్యాక్సిన్లను సేకరించడంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి రాష్ట్రాలకు బాగా తెలుసు. అందువల్ల ఈ వాదన సరైనది కాదు.

జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యాక.. మూడు నెలల్లో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు కూడా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేయలేకపోయిన రాష్ట్రాలు.. బయటి నుంచి వ్యాక్సిన్ల కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఆరోగ్యం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం. అందువల్ల ఈ విషయంలో ఎక్కువ అధికారాలు కల్పించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. అందువల్ల కేంద్రం కూడా అనుమతులు ఇచ్చింది. అయితే రాష్ట్రాల గ్లోబల్ టెండర్లు ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదనేది వాస్తవం. కేంద్రం ముందు నుంచి రాష్ట్రాలకు ఇదే చెబుతోంది.

* అపోహ 6: కేంద్రం రాష్ట్రాలకు తగినన్ని వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం లేదు
వాస్తవం: కేంద్రం పారదర్శక పద్ధతిలో తగినన్ని వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు కేటాయిస్తోంది. టీకా లభ్యత గురించి రాష్ట్రాలకు కూడా ముందుగానే కేంద్రం తెలియజేస్తుంది. రానున్న రోజుల్లో ఉత్పత్తి పెరగడంతో పాటు టీకాల లభ్యత కూడా పెరుగుతుంది. అప్పుడు సరఫరా కూడా ఊపందుకుంటుంది. ప్రభుత్వానికి సంబంధం లేకుండా.. రాష్ట్రాలు 25 శాతం డోసులను, ప్రైవేట్ ఆసుపత్రులు 25 శాతం డోసులను పొందుతున్నాయి. టీకా సరఫరాపై వాస్తవాల గురించి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, రాజకీయ కారణాలతో ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా కొందరు నాయకులు ప్రవర్తిస్తున్నారనేది వాస్తవం. ఇలాంటి ప్రవర్తన చాలా దురదృష్టకరం. రాజకీయాలకు ఇది సమయం కాదు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ ఏకం కావాలి.

* అపోహ 7: పిల్లలకు టీకాలు వేయడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు
వాస్తవం: ప్రస్తుతానికి ప్రపంచంలోని ఏ దేశమూ పిల్లలకు టీకాలు ఇవ్వడం లేదు. పిల్లలకు టీకాలు వేయడంపై డబ్ల్యూహెచ్‌ఓ కూడా ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. పిల్లలపై వ్యాక్సిన్ల భద్రత గురించి అధ్యయనాలు జరిగాయి. ఇవి ప్రోత్సాహకరంగా ఉన్నాయి. భారతదేశంలో కూడా పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. ట్రయల్స్ ఆధారంగా, తగిన డేటా లభించిన తరువాతే దీనిపై తుది నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుంది.
First published: