కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
కరోనా వైరస్ లాక్ డౌన్ కాలంలో సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి కేంద్రం తీపికబురు అందించింది. ఇప్పటికే వారి కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది. అయితే, ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్ ధర కేవలం రూ.50 మాత్రమే ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కూలీల కోసం ఇప్పటి వరకు ఆరు రైళ్లను నడిపినట్టు చెప్పిన కిషన్ రెడ్డి, రాబోయే రోజుల్లో 300 పైగా రైళ్లు నడపబోతున్నామని చెప్పారు. ఏకాభిప్రాయం తర్వాతే లాక్డౌన్ పొడిగించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలు, కేసుల ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను విభజించినట్లు చెప్పారు. ‘వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు, యాత్రీకులను తరలిస్తాం. ఎవరిని తరలించాలో రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారులే గుర్తిస్తారు. వలస కార్మికులను తరలించేందుకు ఇవాళ్టి నుంచి 300కు పైగా రైళ్లు నడుపుతాం. వలస కార్మికులు ఉన్న చోటుకే బస్సులు వచ్చి తీసుకెళ్తాయి. ఎవరూ రైల్వే స్టేషన్లోకి రావొద్దు.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే రావాలి. రాష్ట్రాలు ఎన్ని రైళ్లు కోరితే అన్ని రైళ్లు కేటాయిస్తాం. దూరంతో సంబంధం లేకుండా రూ.50 టిక్కెట్ ధర నిర్ణయించాం. టిక్కెట్ ధరను రాష్ట్ర ప్రభుత్వం లేదా పనిచేసే కంపెనీ చెల్లించాలి.’ అని కిషన్ రెడ్డి చెప్పారు. స్వస్థలాలకు వెళ్లే వలసకూలీలు కలెక్టర్లు, తహసీల్దార్లను సంప్రదించి వారికి సహకరించాలని కోరారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
May 2, 2020, 4:09 PM IST