KIM JONG UN CLAIMS NORTH KOREAS COVID 19 RESPONSE HAS BEEN A SHINING SUCCESS
Kim Jong Un: ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసూ లేదా?...గొప్పలు చెప్పుకున్న కిమ్
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్
ఉత్తర కొరియాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా వైరస్ కేసు కూడా లేదని ఆ దేశం చెబుతోంది. అయితే అది అసాథ్యమని నిపుణులు వాదిస్తున్నారు. మొత్తానికి తన నాయకత్వ లక్షణాలు, సామర్థ్యంతో కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడుకోగలిగినట్లు ఆ దేశాధ్యక్షుడు కిమ్ గొప్పలు చెప్పుకుంటున్నారు.
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తాము ముందు చూపుతో చేపట్టిన పగడ్భందీ చర్యలు అద్భుత ఫలితాన్ని ఇచ్చినట్లు ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గొప్పలు చెప్పుకున్నారు. కరోనా వైరస్ దేశంలో వ్యాపించకుండా జనవరి మాసంలోనే దేశ సరిహద్దులన్నీ మూసేసినందున, మంచి ఫలితాలు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉ.కొరియాలోని అధికార వర్కర్స్ పార్టీ పొలిటిబ్యూరో సమావేశంలో కిమ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆ దేశ అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. చైనాలో కరోనా వైరస్ విజృంభించడంతో జనవరి మాసంలోనే చైనాతో పాటు అన్ని దేశాల సరిహద్దులను ఉత్తరకొరియా మూసేసింది. వేలాది మందిని ఐసొలేషన్‌లో ఉంచింది. ఇప్పటి వరకు తమదేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని ఉత్తరకొరియా చెప్పుకుంటోంది. అయితే ఇది అసాధ్యమన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ ముందుచూపుతో ఆరు మాసాల మునుపటి నుంచే పగడ్భందీ చర్యలు తీసుకున్నందునే... ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని తమ దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోగలిగినట్లు పొలిట్ బ్యూరో సమావేశంలో కిమ్ చొప్పుకొచ్చారు.
అదే సమయంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులకు చోటు కల్పించకుండా దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కిమ్ సూచించారు. ఇప్పటి వరకు విధించిన ఆంక్షలను యధాతథంగా కొనసాగించాలని, లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తొందరపాటుతో ఆంక్షలను సడలిస్తే ఊహలకు మించిన సంక్షోభం ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు సతమతమవుతున్నా...తాను దేశ ప్రజలను తాను కాపాడగలిగినట్లు చెప్పుకునేందుకు కిమ్ ప్రయత్నిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలతో తేటతెల్లమవుతోంది. ఈ పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొన్న సభ్యులు భౌతిక దూరంను పాటించకపోవడం, కరోనా మాస్క్‌లు ధరించకపోవడం విశేషం.
ఉత్తరకొరియాకు కరోనా వైరస్ వ్యాపించిందా? లేదా? అనే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సహా ఎవరికీ ఏమీ తెలీదు. చైనాలో కరోనా వైరస్ విజృంభించడంతో జనవరి 30 నుంచి ఆ దేశంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉత్తరకొరియాలో కూడా అనథికారిక వర్గాల సమాచారం మేరకు కొందరికి కరోనా వైరస్ సోకినట్లు రెడ్ క్రాస్ సంస్థ తెలిపింది. ఉత్తరకొరియాలో కరోనా ప్రభావం ప్రస్తుతం పెద్దగా లేకున్నా...ఆ దేశ ప్రజలకు ఇతర ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
స్థానిక మీడియా కథనాల మేరకు ఉత్తరకొరియాలో పరిస్థితులు క్రమంగా సహజ స్థితికి వెనుదిరుగుతున్నాయి. సామాన్య ప్రజలు మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. దుకాణాలు, హోటళ్లను తెరిచారు. జూన్ మాసం నుంచి స్కూళ్లను కూడా పున:ప్రారంభించినట్లు తెలుస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కిమ్ పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా వరకు తగ్గించారు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో కిమ్ ఏడుసార్లు మాత్రమే పబ్లిక్ కార్యక్రమాల్లో కనిపించారు. 2018, 2019లో ఆయన 45, 46 సార్లు బహిరంగ వేదికలపై కనిపించారు.