కరోనా నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాయం చేసేందుకు వ్యక్తులు, సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నాయి. ఇటీవల పలు కంపెనీల అధినేతల సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలసి తమ కంపెనీ తరఫున విరాళాల చెక్కులను అందజేశారు. తాజాగా ఆ జాబితాలో కియా మోటార్స్ కూడా చేరింది. కోవిడ్-19 నియంత్రణలో భాగంగా సహాయచర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కియామోటార్స్ రూ.2 కోట్ల విరాళం ప్రకటించింది. విరాళాలకి సంబంధించిన వివరాలను క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌కు కియా మోటర్స్ ఇండియా ఎండీ కుక్ హాయన్ షిమ్ అందజేశారు. కియా మోటార్స్‌తో పాటు చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ కూడా రూ.2 కోట్ల విరాళాలను ప్రకటించింది. రూ.2 కోట్ల చెక్‌ను శ్రీ సిటీ ఫౌండర్ & మేనేజింగ్ డైరెక్టర్ సన్నారెడ్డి రవీంద్ర సీఎం వైఎస్ జగన్‌ను కలసి అందజేశారు.
మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన ఏపీ ఐఏఎస్ అధికారుల సంఘం
ఇక కోవిడ్ 19 సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్. సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్ ప్రసాద్, విజయకుమార్, ప్రద్యుమ్న, ఐఏఎస్ ఆఫీసర్స్ ఆసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ తదితరులు సీఎం జగన్‌ను కలసి తమ అంగీకార లేఖను అందజేశారు.