Corona: కర్ణాటకలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం.. కొడగులో ఒకే కుటుంబంలో 32 మందికి కరోనా

ప్రతీకాత్మక చిత్రం

జిల్లాలోని విరాట్‌పేట తాలూకా కెదముళ్లూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో 32 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. టీమిండియా ఉమెన్ క్రికెటర్ వేద కృష్ణమూర్తి కుటుంబంలో ఏకంగా ఏడుగురికి కోవిడ్ పాజిటివ్‌గా...

  • Share this:
    బెంగళూరు: కర్ణాటకలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. ఆదివారం ఒక్కరోజే కర్ణాటకలో 34,804 కరోనా పాజిటివ్ కేసులు, 143 కరోనా మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. ఇందులో.. ఒక్క బెంగళూరు నగరంలోనే 20,733 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం. కొడగు జిల్లాలో కరోనా బెంబేలెత్తిస్తోంది. జిల్లాలోని విరాట్‌పేట తాలూకా కెదముళ్లూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో 32 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. టీమిండియా ఉమెన్ క్రికెటర్ వేద కృష్ణమూర్తి కుటుంబంలో ఏకంగా ఏడుగురికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గుబులు రేపుతోంది. కరోనా సోకి పరిస్థితి విషమించడంతో ఆమె తల్లి చెలువాంబ దేవి చిక్కమగళూరు జిల్లా కడూరులో శుక్రవారం రాత్రి మృతి చెందారు. అనంతరం.. కుటుంబ సభ్యులంతా పరీక్షలు చేయించుకోగా ఏడుగురికి పాజిటివ్‌గా బయటపడింది. వేదా కృష్ణమూర్తి తండ్రితో పాటు అక్క, అన్న, వదిన, ఇతర కుటుంబ సభ్యులకు కోవిడ్ సోకింది. కర్ణాటకలో నమోదైన కరోనా కేసులను ఒక్కసారి పరిశీలిస్తే.. బెంగళూరు నగరంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత తుమకూరులో 1153, కొడగు జిల్లాలో 1077, బెంగళూరు రూరల్‌లో 864, మండ్య 814, హాసన్ 768, కోలార్ 782, మైసూరు 700, బళ్లారి 732, దక్షిణ కన్నడ 564, రాయచూరు 643, ధార్వాడ 546, ఇతర జిల్లాల్లో 100 నుంచి 500 లోపు కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మరణాలు కూడా ఎక్కువగా బెంగళూరు నగరంలోనే నమోదవుతున్నాయి. కర్ణాటకలో ఆదివారం 143 కరోనా మరణాలు నమోదు కాగా.. ఇందులో 77 మంది బెంగళూరు నగర పరిధిలోనే చనిపోవడం ఆందోళన కలిగించే విషయం. అంతేకాదు.. పరిస్థితి విషమించి చికిత్స పొందుతున్న వారిలో కూడా బెంగళూరులోనే ఎక్కువ మంది బాధితులు ఉన్నారు.

    బెంగళూరు నగరంలో 1,80,542 మంది కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,492 మంది పరిస్థితి విషమించి ఐసీయూలో ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలోనే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం గమనార్హం.

    ప్రస్తుతం కర్ణాటకలో లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమలులో ఉన్నాయి. నైట్‌ కర్ఫ్యూ అమలుతో పాటు వీకెండ్ లాక్‌డౌన్‌ను కూడా అమలు చేస్తున్నప్పటికీ ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో కనీసం రెండు వారాల పాటు కర్ణాటక మొత్తం సంపూర్ణ లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప సోమవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    Published by:Sambasiva Reddy
    First published: