గొర్రెలు కాస్తున్న డిగ్రీ లెక్చరర్.. రూ.200 కోసం రోజంతా కష్టాలు

ఓ వ్యక్తికి చెందిన గొర్రెలు కాస్తూ రోజుకు రూ. 200 సంపాదిస్తున్నాడు. ఆయన భార్య పత్తి తీత కూలీకి వెళ్లి రూ.150 సంపాదిస్తోంది.

news18-telugu
Updated: November 12, 2020, 10:30 AM IST
గొర్రెలు కాస్తున్న డిగ్రీ లెక్చరర్.. రూ.200 కోసం రోజంతా కష్టాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా దెబ్బకు ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. అన్ని వ్యవస్థలూ అస్తవ్యస్తమయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్ల పరిస్థితి దారుణంగా ఉంది. మార్చి నుంచి స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో ఇంటికే పరిమితమయ్యారు. అప్పటి నుంచీ జీతాల్లేక వీధినపడ్డారు. ప్రభుత్వ కాలేజీలూ మూతపడినా ఉద్యోగులకు ప్రభుత్వం జీతం చెల్లిస్తుంది. కానీ ప్రైవేట్ లెక్చరర్ల పరిస్థితే అగమ్యగోచరంగా తయారైంది. తామేం చేయలేమని యాజమాన్యాలు చేతులెత్తేయడంతో వారంతా అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో కొందరు టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటే.. మరికొందరు కూరగాయల దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఐతే కర్నాటకలో ఓ లెక్చరర్ మాత్రం గొర్రెల కాపరిగా మారిపోయాడు.

కర్నాటకలోరి రాయిచూరు జిల్లా లింగసూగూర్ మండలం హల్లిగడ్డ గ్రామానికి చెందిన వీరన్న గౌడ M.A, B.Ed పూర్తి చేశారు. KSET, KTET పరీక్షల్లో అర్హత సాధించారు. అనంతరం మస్కి ప్రాంతంలో ఉన్న దేవనాంప్రియ గవర్నమెంట్ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేసేవారు. ఆయనకు అప్పుడు నెలకు రూ.13వేల వేతనం వచ్చేంది. అదే కాలేజీలో తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నప్పటికీ రెగ్యులరైజ్ చేయలేదు. వీరన్న గౌడకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు, సోదరులు కలిపితే వీరి కుటుంబంలో మొత్తం 9 మంది సభ్యులు ఉంటారు. వారందరూ ఇతడిపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

ఐతే మార్చి నుంచి కాలేజీలు మూతపడడంతో గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. చేతిలో డబ్బుల్లేక విలవిల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో దిక్కుతోచని పరిస్థితిలో గొర్రెల కాపరిగా మారారు వీరన్న గౌడ. ఓ వ్యక్తికి చెందిన గొర్రెలు కాస్తూ రోజుకు రూ. 200 సంపాదిస్తున్నారు. ఆయన భార్య పత్తి తీత కూలీకి వెళ్లి రూ.150 సంపాదిస్తోంది. ఈ డబ్బుపైనే తాము బతుకుతున్నామని.. లాక్‌డౌన్ సమయంలో అప్పులు కూడా చేశామని చెప్పారు వీరన్న గౌడ.

మరోవైపు తన తల్లి కంటి సమస్యలతో బాధపడుతుందోని.. ఆమె కంటి ఆపరేషన్ కోసం కొంత డబ్బును కూడబెడుతున్నామని చెప్పారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల, ప్రైవేట్ లెక్చరర్ల కోసం ప్రభుత్వ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని వీరన్న గౌడ కోరుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే తమ బతుకులు మారవని.. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరన్న గౌడ ఒక్కడి పరిస్థితే కాదు.. దేశంలో ఉన్న ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల అందరి పరిస్థితి ఇదే. వారందరినీ ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: November 12, 2020, 10:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading