కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో లక్షల మందిని పొట్టన పెట్టుకున్న డెల్టా వేరియంట్ కంటే ఐదురెట్లు ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు యావత్ భూగోళాన్ని కలవరపెడుతున్నది. వేగంగా విస్తరిస్తోన్న ఈ కొత్తరకం మహమ్మారి ఇప్పటికే భారత్ సహా 38 దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్ ఆందోళనకారి అని, వ్యాప్తి ఎక్కువయితే దేశదేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో అన్ని దేశాలూ అంతర్జాతీయ ప్రయాణాలపై గట్టి ఆంక్షలు విధించాయి. ప్రధానంగా ఒమిక్రాన్ పుట్టిన సౌతాఫ్రికా, అది వ్యాపించిన ఇతర దేశల నుంచి వచ్చే ప్రయాణికులపై భారత్ లోని అన్ని ఎయిర్ పోర్టుల్లో గట్టి నిఘా పెట్టారు. పాజిటివ్ అని నిర్ధారణ కాగానే సదరు ప్రయాణికుల్ని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసినవారి జాబితాను లిస్టవుట్ చేసి అనుమానితులు అందరినీ 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉంచుతున్నారు. అయితే, అత్యంత షాకింగ్ పరిణామంగా.. భారత్ లో నమోదైన తొలి ఒమిక్రాన్ పేషెంట్ క్వారంటైన్ సెంటర్ నుంచి పారిపోయాడు. అంతేకాదు, సౌతాఫ్రికా సహా ఒమిక్రాన్ బాధిత దేశాల నంచి వచ్చిన 10 మంది ప్రయాణికులు ప్రస్తుతం గల్లంతయ్యారు. తొలి పేషెంట్ పారిపోవడంపై కర్ణాటక సర్కారు అటు కేంద్రం విస్మయం వ్యక్తం చేశాయి. దీనిపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. పారిపోయిన ఆ పేషెంట్, అనుమానిత వ్యక్తులు 10 మంది ద్వారా ఇంకా ఎంత మందికి వైరస్ అంటుకుని ఉంటుందోనని సర్వత్రా భయాందోళనలు రేకెత్తుతున్నాయి. వివరాలివి..
కరోనా కొత్త వేరియంట్ సౌతాఫ్రికాలో పుట్టినట్లు డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం చేయడంతో గడిచిన రెండు వారాలుగా ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులుపై సర్వత్రా ఆంక్షలు, నిఘా కొనసాగుతోంది. రాదురాదనుకుంటూనే ఇండియాలోకీ ఒమిక్రాన్ ఎంటరైపోవడం, కర్ణాటకలో తొలి కసులను గుర్తించామని కేంద్రం ప్రకటన చేయడం తెలిసిందే. సౌతాఫ్రికా జాతీయుడైన 66 ఏళ్ల వ్యక్తి భారత్ లో నమోదైన తొలి ఒమిక్రాన్ కేసుగా నిలిచాడు. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఆయనకు బెంగళూరు ఎయిర్ పోర్టులో పరీక్షలు చేయగా, కొవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అసలే సౌతాఫ్రికా నుంచి రావడంతో ఒమిక్రాన్ ఉందా లేదా అని నిర్ధారించుకునేందుకు అతని శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. ఆ వ్యక్తిని బెంగళూరులోనే ఓ హోటల్ గదిలో క్వారంటైన్ లో ఉంచారు. కానీ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అతను క్వారంటైన్ నుంచి తప్పించుకుని, మళ్లీ విమానంలోనే దుబాయ్ చెక్కేశాడని తెలియడంతో కర్ణాటక అధికారులు షాకయ్యారు..
బెంగళూరులోని హోటల్ లో క్వారంటైన్ లో ఉండగా సౌతాఫ్రికా జాతీయుడైన తొలి ఒమిక్రాన్ పేషెంట్.. నగరంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి అక్రమంగా నెగటివ్ సర్టిఫికేట్ సాధించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎయిర్ పోర్టులో పాజిటివ్ గా పట్టుపడిన మూడు రోజులకే అతను ప్రైవేటు ల్యాబ్ ద్వారా నెగటివ్ సర్టిఫికేట్ పొందడం, తన కంపెనీ బోర్డు సమావేశానికి ఆయన హాజరు కావడం.. జోనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు రాకముందే ఏకంగా దేశం విడిచి పారిపోవడం కలకలం రేపింది. అతను బెంగళూరు ఎయిర్ పోర్టు ద్వారానే దుబాయ్ వెళ్లిపోయినట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఈ ఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతో కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై కొద్ది గంటల కిందట అత్యవసర సమావేశం నిర్వహించారు. తొలి ఒమిక్రాన్ పెషెంట్ తప్పించుకున్న తీరుపై, ప్రైవేటు ల్యాబ్ లో అతను నెగటివ్ రిపోర్టు సాధించిన వ్యవహారం, తిరిగి బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్ వెళ్లిపోవడం తదితర ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు సీఎం బొమ్మై.
భారత్ లో తొలి ఒమిక్రాన్ కేసుగా భావిస్తోన్న సౌతాఫ్రికా జాతీయుడు బెంగళూరులో ప్రైవేటు ల్యాబ్ ద్వారా నెగటివ్ రిపోర్టు ఎలా సంపాదించాడు? అందులో ఏవైనా అవకతవకలు జరిగాయా? ఎయిర్ పోర్టులో వైద్య పరీక్షలను దాటుకుని దుబాయ్ ఎలా వెళ్లగలిగాడు? అసలు ఏం జరిగింది? అనే కోణాల్లో దర్యాప్తు చేయాల్సిందిగా బెంగళూరు పోలీస్ కమిషనర్ ను ఆదేశించినట్లు మంత్రి అశోక మీడియాకు చెప్పారు. మరోవైపు, సౌతాఫ్రికా నుంచి కర్ణాటకకు వచ్చిన 10 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఒమిక్రాన్ నేపథ్యంలో గడిచిన 14 రోజుల్లో సౌతాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికులు అందరికీ ప్రభుత్వం పరీక్షలు చేయిస్తుండగా.. ఇటీవలే అక్కడి నుంచి వచ్చిన 10 మంది ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేసి, ఆచూకీ తెలియకుండా తిరుగుతున్నారు. ఇది అత్యంత బాధ్యతారాహత్యమని, వారి జాడకోసం గాలిస్తున్నామని కర్ణాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ అన్నారు. మరోవైపు ఢిల్లీలో 12, ముంబైలో 14 అనుమానిత ఒమిక్రాన్ కేసులు తాజాగా బయటపడ్డాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid, Karnataka, Omicron, Omicron corona variant, South Africa