కరోనా కేసులు పెరిగిపోతుండటంతో మళ్లీ కర్ఫ్యూలు, లాక్డౌన్లు మొదలయ్యాయి. ఇక కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్న రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించగా.. కొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్డౌన్ను కూడా అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. అలాంటి రాష్ట్రాల్లో కర్ణాటక పొరుగున ఉన్న కర్ణాటక ఒకటి. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వీకెండ్ లాక్డౌన్ అమలు చేస్తామని కర్ణాటక ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే ప్రకటించింది. తాజాగా వీకెండ్ లాక్డౌన్ అమలు చేయనున్న రెండు రోజుల్లో మద్యం విక్రయాలు ఉండవని ఆ రాష్ట్రం ప్రకటించింది. వీకెండ్ కర్ఫ్యూ సమయంలో మద్యం అమ్మకాలు ఉండకూడదని నిర్ణయించామని కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి గోపాలయ్య తెలిపారు. వీకెండ్ లాక్డౌన్లో తమ దుకాణాలు తెరిచేందుకు మద్యం షాపు యజమానులు అనుమతి కోరారని.. కానీ ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు.
వీకెండ్ కర్ఫ్యూ సమయంలో అవసరమైన సేవలతో పాటు వైద్య సేవలు కొన్ని మాత్రమే అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. మరోవైపు వీకెండ్ కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో ఆసుపత్రికి వెళ్లాలనుకునే వారు అందుకు సంబంధించిన పత్రాలను కచ్చితంగా తమ వెంట తీసుకుని వెళ్లాలని పోలీసులు తెలిపారు. బస్సు, రైలు లేదా విమానంలో ప్రయాణించే వారు తప్పనిసరిగా టిక్కెట్లు, సంబంధిత పత్రాలను కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
మరోవైపు అనవసరంగా బయటకు రావద్దని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో ప్రజలు ప్రయాణించేందుకు పోలీసులు ఎలాంటి పాస్లు జారీ చేయరని అన్నారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ప్రకృతి విపత్తు నిర్వహణ చట్టం (ఎన్డిఎంఎ) కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకుని వారి వాహనాలను సీజ్ చేస్తామన్నారు.
కర్ణాటకలో మరీ ముఖ్యంగా బెంగళూరులో కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో 24 గంటల్లో 8,449 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.ఇది నిన్నటి కంటే 68 శాతం ఎక్కువ. రాష్ట్ర రాజధాని బెంగళూరులోనే 6,812 కేసులు నమోదయ్యాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.