Corona: ఆక్సిజన్ కొరత కారణంగా కరోనాతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మంత్రి పీఏ మృతి

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరులో మంత్రి పీఏ ఆక్సిజన్ కొరత కారణంగా కరోనాతో చికిత్స పొందుతూ చనిపోవడం కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ వ్యక్తిగత కార్యదర్శి రమేశ్‌ ఈ నెల 13న అనారోగ్యం కారణంగా, శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో...

  • Share this:
    బెంగళూరు: కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా ఉధృతంగా ఉన్న ఈ తరుణంలో ప్రధానంగా మూడు అంశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆక్సిజన్ కొరత దేశాన్ని పీడిస్తోంది. ఊహించని విధంగా కేసులు పెరుగుతుండటంతో పేషంట్లకు సరిపడా బెడ్లు ఏర్పాటు చేయడం ప్రభుత్వాలకు కష్టతరమైంది. కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వారికి వినియోగించే రెమ్‌డిసివిర్ ఇంజక్షన్‌కు మార్కెట్‌లో కొరత ఏర్పడింది. ఈ మూడు సమస్యలు కరోనా కష్టకాలంలో ప్రజలను పీడిస్తున్నాయి. అయితే.. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆక్సిజన్ కొరత గురించి. కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటం, గతంలో ఎన్నడూ లేనంతగా భారత్‌లో కొత్తగా కరోనా కేసులు నమోదవుతుండటంతో పేషంట్లకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ ఇవ్వడం రాష్ట్రాలకు సవాల్‌గా మారింది. చాలా రాష్ట్రాల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. కేంద్రం కూడా 50,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. ఈ తరుణంలో.. బెంగళూరులో మంత్రి పీఏ ఆక్సిజన్ కొరత కారణంగా కరోనాతో చికిత్స పొందుతూ చనిపోవడం కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ వ్యక్తిగత కార్యదర్శి రమేశ్‌ ఈ నెల 13న అనారోగ్యం కారణంగా, శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆయనకు వైద్యులు కోవిడ్-19 పరీక్షలు చేశారు. రిజల్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే.. శ్వాస తీసుకోవడానికి రమేష్ ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌ సాయంతో వైద్యులు చికిత్సనందించారు. ఈ క్రమంలోనే.. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడిన రమేశ్ చనిపోయారు. మంత్రి పీఏగా అనేక మంది కరోనా రోగులకు సాయపడిన రమేష్ ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

    మంత్రి పీఏకే ఆక్సిజన్ దొరకని పరిస్థితుల్లో ఇక దురదృష్టవశాత్తూ కరోనా సోకితే తమ ప్రాణాల సంగతేంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఈ ఒక్క ఘటన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆక్సిజన్ కొరతకు అద్దం పడుతుంది. ఇదిలా ఉంటే.. బెడ్స్ కొరత కూడా కర్ణాటకలో ప్రధాన సమస్యగా మారింది. బెంగళూరు నగరంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరగడంతో ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడినట్లు స్వయంగా ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖా మంత్రే వెల్లడించిన పరిస్థితి నెలకొంది.

    బెంగళూరులో సోమవారం ఒక్కరోజే 9,618 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక.. కరోనా రోగులకు బెడ్లు కేటాయించని 5 ప్రైవేట్ ఆసుపత్రులకు బృహణ్ బెంగళూరు మున్సిపల్ పాలికె(బీబీఎంపీ) నోటీసులు జారీ చేసింది. బెంగళూరులో రోజువారి కరోనా కేసులు పది వేలకు దగ్గర్లో ఉండగా.. అందులో సుమారు 25 శాతానికి పైగా లక్షణాలు తీవ్రంగా ఉండి ఆసుపత్రుల్లో చేరే పరిస్థితి ఉంది.

    అయితే.. బెడ్లు ఇచ్చే విషయంలో కార్పొరేట్ ఆసుపత్రులు పేదధనిక భేదం చూపుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలొస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదు ఆసుపత్రులకు బీబీఎంపీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా కరోనా బారిన పడి ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మొత్తంగా పరిశీలిస్తే.. కర్ణాటకలో కరోనా ఉధృతి ఆ రాష్ట్ర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
    Published by:Sambasiva Reddy
    First published: