కరోనా వైరస్‌ను తొలిసారి కనుగొన్నది ఎవరో తెలుసా..?

కరోనా వైరస్‌ను తొలిసారి కనుగొన్నది ఎవరో తెలుసా..?

జూన్ అల్మీడా

Coronavirus : కరోనా.. ఈ పేరు నాలుగేళ్ల పాప నుంచి పండు ముసలి దాకా ప్రతీ ఒక్కరి నోట్లో నానుతోంది. ప్రపంచవ్యాప్తంగా అంతటి ప్రళయాన్ని సృష్టిస్తోందీ వైరస్.

 • Share this:
  Coronavirus : కరోనా.. ఈ పేరు నాలుగేళ్ల పాప నుంచి పండు ముసలి దాకా ప్రతీ ఒక్కరి నోట్లో నానుతోంది. ప్రపంచవ్యాప్తంగా అంతటి ప్రళయాన్ని సృష్టిస్తోందీ వైరస్. స్కూలుకు ఎందుకు వెళ్లడం లేదని నాలుగేళ్ల పాపను అడిగితే.. కరోనా వచ్చింది. అందుకే బయటికి వెళ్లడం లేదు. బయటికి వెళ్లొద్దని మా అమ్మ చెప్పింది. కరోనా తగ్గాక స్కూలుకు వెళ్తాం అని అన్నదంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ మహమ్మారి ప్రభావం ఎంతుందో..! కరోనా జాతికి చెందిన కోవిడ్-19 అనే వైరస్ ప్రపంచవ్యాప్త వినాశనానికి కారణం అవుతోంది. అయితే, అసలు కరోనా జాతి గురించి ఎలా తెలుసు? తొలిసారి అది కనుగొన్నది ఎవరు? అని చరిత్రను పరిశీలిస్తే.. ‘డాక్టర్ జూన్ అల్మీడా’ను గుర్తు చేసుకోవాల్సిందే. ఈమే కరోనా వైరస్‌ను గుర్తించారు. 1964లో లండన్‌లోని సెయింట్‌ థామస్‌ హాస్పిటల్‌ ల్యాబ్‌లో ఈమె వైరస్‌ను తొలిసారి చూశారు.
  ప్రతీకాత్మక చిత్రం

  అల్మీడా జీవితం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. 16 ఏళ్ల ప్రాయంలోనే స్కూలుకు స్వస్తి చెప్పింది. ఈమెకు చదువు అబ్బలేదు. స్కాట్లాండ్‌కు చెందిన బస్ డ్రైవర్ కూతురు అల్మీడా. 1930లో గ్లాస్గోలో పుట్టారు. అయితే, చదువు మానేసిన సంవత్సరం(1947)లోనే గ్లాస్గో రాయల్‌ ఇన్‌ఫర్మెరీలో హిస్టోపాథాలజీ ల్యాబ్‌ టెక్నీషియన్‌గా జాబ్ సంపాదించారు. 1954 వరకు అదే ఉద్యోగం చేసిన ఆమె.. వెనిజులాకు చెందిన ఆర్టిస్ట్‌ ఎన్నకెస్‌ అల్మీడాను పెళ్లాడారు. కూతురు పుట్టాక అల్మీడా కుటుంబం కెనడాలోని టొరొంటోకు మారింది. అక్కడి ఒంటారియో కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో ఎలక్ర్టాన్‌ మైక్రోస్కోప్‌ వినియోగంలో పదేళ్ల పాటు పనిచేశారు. యాంటీబాడీలను ఉపయోగించి వైరస్‌లను మరింత పెద్దవిగా, మెరుగ్గా చూసే విధానాన్ని ఆమె అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో 1964లో డాక్టరేట్‌ పొందారు. అల్మీడా ప్రతిభను గుర్తించిన బ్రిటన్‌.. ఆమెను తిరిగి తమ దేశానికి ఆహ్వానించింది. స్వదేశానికి వచ్చిన ఆమె లండన్‌లోని సెయింట్‌ థామస్‌ హాస్పిటల్‌ మెడికల్‌ స్కూల్‌లో విధులు నిర్వర్తించారు.
  ప్రతీకాత్మక చిత్రం

  డాక్టర్‌ డేవిడ్‌ టిరెల్‌తో కలిసి సాధారణ జలుబుకు కారణమయ్యే కొన్ని వైరస్‌లపై అధ్యయనం చేశారు వీళ్లు. దానికోసం వలంటీర్ల నుంచి నమూనాలు సేకరించారు. వాటిల్లో ఒక విద్యార్థికి చెందిన బీ814 నమూనాలోని వైరస్‌ గురించి టిరెల్‌కు అంతుచిక్కలేదు. వీటిని పరిశీలించిన అల్మీడా... దీని లక్షణాలు ఇన్‌ఫ్లుయెన్జా వైరస్‌ తరహాలో ఉన్నాయని గుర్తించారు. అలా ఆమె గుర్తించిన వైరస్‌కే ‘కరోనా’ అని పేరు పెట్టారు. మానవులకు సోకిన తొలి కరోనా వైరస్ అదే. బీ814 నమూనాలో కొత్తగా గుర్తించిన వైరస్‌ వివరాలను 1965లో బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లోనూ ప్రచురించారు. ఆ జాతికి చెందిన వైరస్‌ ఇప్పుడు క్రమంగా జన్యు క్రమాన్ని మార్చుకుంటూ అంతుచిక్కని మహమ్మారిలా ప్రపంచంపై దండెత్తుతోంది.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: