INTERNATIONAL NEWS IPBES SHOCKING REPORT MORE PANDEMICS IN FUTURE NGS
Pandemics: మనపై మరిన్ని మహమ్మారులు దాడి చేస్తాయా..? ఐపీబీఈఎస్ సంచలన నివేదిక
ఐపీబీఈఎస్ సంచలన నివేదిక
కరోనా నుంచి ఈ ప్రపంచం కోలుకునేది ఎప్పుడు...? పూర్తిగా కరోనా అంతం కావడానికి ఎన్నేళ్లు పడుతుంది..? అసలు ఇలాంటి మహమ్మారులు ఎందుకు దాడి చేస్తున్నాయి..? భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందా..? ఐపీబీఈఎస్ నివేదిక సంచలనంగా మారుతోంది.
ప్రపంచాన్ని ఎవ్వరూ ఊహించని రీతిలో భయపెట్టింది కరోనా వైరస్. ఇంకా వణికిస్తూనే ఉంది. కరోనా వైరస్ గుర్తించి ఏడాదిన్నర దాటినా ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రజలకు నిద్ర, తిండి అన్నింటినీ దూరం చేసింది. దీనికి అంతమెప్పుడు? అంటే సమాధానం లేని ప్రశ్నే అంటున్నారు నిపుణులు. అసలు మనుషులపై ఇలాంటి మహమ్మారుల దాడి ఇదే మొదటిదీ కాదు.. ఇదే చివరిది అయ్యే అవకాశమూ లేదని కొందరు పరిశోధరకులు చెబుతున్నారు. తరచూ ఏదో ఓ కొత్త వైరస్ దాడి మొదలవుతూనే ఉంటుందని చెబుతున్నారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? కారణాలు ఏమిటి? భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుంది? అన్న సందేహాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనిపై ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫాం ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీస్ (ఐపీబీఈఎస్)’ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది.
మనుషులకు కొత్తగా సంక్రమిస్తున్న వైరస్ లు కావొచ్చు.. రోగాలు కావొచ్చు.. అన్నీ జంతువులు లేదా పక్షుల నుంచి వ్యాపిస్తున్నవే. అంటే ప్రాథమికంగా జంతువులు, పక్షుల్లోనే ఉండి, వాటిపైనే ప్రభావం చూపే సూక్ష్మజీవులు.. మ్యూటేషన్ చెంది మనుషులపైనా ప్రభావం చూపిస్తున్నాయి. ఇలాంటి వ్యాధులను జూనోటిక్ లేదా జూనోసెస్ అని పిలుస్తారు. 1940 దశాబ్దం నుంచి ఇప్పటివరకు కొత్తగా 330 అంటువ్యాధులను గుర్తించగా.. అందులో 60 శాతానికిపైగా జంతువులు, పక్షుల నుంచి మనుషులకు వ్యాపించినవే అని అధ్యయనం చెబుతోంది. జంతువులు, పక్షుల నుంచి మనుషులకు విస్తరిస్తున్న కొత్త వ్యాధుల సంఖ్య ఏటా పెరుగుతూపోతోంది. సగటున 3 నుంచి 4 వ్యాధులు ప్రభావం చూపుతున్నాయి. వీటిల్లో కొన్నిరకాల వైరస్లు సామర్థ్యం పెంచుకుని మహమ్మారులుగా మారుతున్నాయి.
ఇన్ఫ్లుయెంజా, సార్స్, ఇప్పటి కోవిడ్ సహా మహమ్మారిగా మారి ప్రపంచాన్ని వణికించిన, వణికిస్తున్న వ్యాధులు మొత్తం కూడా జంతువులు, పక్షుల నుంచి వచ్చినవే. ఎబోలా, జికా, నిఫా వంటి ప్రమాదకర వ్యాధులను కలిగించే వైరస్లలో 70 శాతానికిపైగా అడవి జంతువుల నుంచో, పెంపుడు జంతువుల నుంచో మనుషులకు విస్తరించినవే. జంతువులు, పక్షుల్లో ఉండే వైరస్లలో మనం ఇంకా గుర్తించని వాటి సంఖ్య 17 లక్షలకుపైనే అని ఒక అంచనా. అందులో 6.3 లక్షల నుంచి 8.2 లక్షల వైరస్లకు మనుషులకు సోకే సామర్థ్యం ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నిజానికి భూమ్మీద కొన్నికోట్ల రకాల వైరస్లు ఉన్నాయని.. వాటిలో మనం గుర్తించినవి, గుర్తించగలిగినవి చాలా తక్కువేనని స్పష్టం చేస్తున్నారు.
వైరస్లు ఇప్పుడిప్పుడు కొత్తగా పుడుతున్నవేమీ కాదు. కొన్ని లక్షల ఏళ్లుగా జంతువులు, పక్షుల్లో ఉన్నవే. పరిస్థితులకు అనుగుణంగా రూపుమార్చుకుంటున్నవే. మరిప్పుడు కొత్తగా ప్రభావం చూపించడం ఏమిటన్న సందేహాలు వస్తున్నాయి కదా. ప్రకృతి సమతౌల్యాన్ని మనుషులు దెబ్బతీయడమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అడవులను నరికివేయడం వల్ల వస్తున్న వాతావరణ మార్పులు, వన్యప్రాణులు జనావాసాలకు దగ్గర కావడం, వాటి మాంసం వినియోగం వంటివి ప్రమాదకరంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.
దాదాపు వందేళ్ల కిందటితో పోలిస్తే.. 30 శాతం అడవులు తగ్గిపోయాయి. ఆ భూమిలో వ్యవసాయం, పట్టణీకరణ పెరిగింది. 2050 నాటికి 247 కోట్ల ఎకరాల అడవులు అంతరిస్తాయని ఒక అంచనా. ప్రపంచవ్యాప్తంగా అడవి జంతువుల్లో 24 శాతం వరకు స్మగ్లింగ్ బారినపడుతున్నాయి. దీని విలువ సగటున ఏటా 17 వేల కోట్ల రూపాయలకుపైనే అని అంచనా.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.