Covid Deaths : దేశంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వాళ్ల సంఖ్య ఇదే
ప్రతీకాత్మక చిత్రం
Covid Deaths : అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక కరోనా మరణాలు నమోదు అయిన దేశంగా భారత్ నిలిచింది. అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువే కోవిడ్ మరణాలు దేశంలో నమోదై ఉంటాయని అంచనాలున్నాయి.
Covid Deaths In India : దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,49,394 కొత్త కరోనా పాజిటివ్ కేసులు,1072 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 5 లక్షల మంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య శుక్రవారం నాటికి అధికారికంగా ఐదు లక్షలు (5,00,055)దాటగా... అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక కరోనా మరణాలు నమోదు అయిన దేశంగా భారత్ నిలిచింది. అత్యధికంగా 9.1 లక్షల కోవిడ్ మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 6.3 లక్షల కోవిడ్ మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది.
కాగా, అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువే కోవిడ్ మరణాలు దేశంలో నమోదై ఉంటాయని అంచనాలున్నాయి. అనేక రాష్ట్రాల మరణ నమోదు డేటా, సీఎమ్ఐఈ గృహ సర్వేలు,సెరో సర్వే వంటి వివిధ పద్ధతుల ఆధారంగా అనేక అంతర్జాతీయ అధ్యయనాలు ప్రపంచంలోనే అత్యధిక కోవిడ్ మరణాలను భారత్ చవిచూసిందని సూచిస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు, మనదేశంలో కోవిడ్ మరణాలు 4 నుంచి 5 లక్షలకు చేరడానికి 217 రోజుల సమయం పట్టింది. దేశంలో 2021 జులై 1కి కరోనా మరణాలు 4 లక్షలకు చేరాయి. సెకెండ్ వేవ్‌లో రోజూ 2 నుంచి 3 వేల మంది వరకూ మహమ్మారికి బలయ్యారు. ఆ తర్వాత నుంచి మరణాలు తగ్గుముఖం పట్టడంతో ఐదు లక్షలకు చేరడానికి ఎక్కువ సమయం పట్టింది. గతేడాది డిసెంబరు చివరి వరకూ కరోనా మరణాలు తగ్గుతూ వచ్చాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో థర్డ్ వేవ్ మొదలైనా వైరస్ తీవ్రత తక్కువగా ఉండటం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడంతో మరణాలు తక్కువగానే చోటుచేసుకున్నాయి. కాగా,గత రెండు వేవ్ లతో పోల్చితే ప్రస్తుత ఒమిక్రాన్ వేవ్ లో మరణాలు తక్కువగానే ఉండటం కొంత ఊరట కలిగిస్తోంది.
దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 14,35,569కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 4,00,17,088 మంది కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో రికవరీ రేటు 95.39 శాతం ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 16,11,666 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు 73.58 కోట్ల పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ 168.47 కోట్ల డోసులకు చేరుకుంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.