Coronavirus: జంతువుల్లో కరోనా వైరస్.. వాటి నుంచి కూడా మనుషులకు సోకుతుందా?

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో మొట్టమొదటిసారి జంతువులకు కూడా కరోనా వ్యాపించడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులు, పశువులకు మహమ్మారి సోకితే పరిస్థితి ఏంటని భయపడుతున్నారు.

  • Share this:
కరోనావైరస్ కారణంగా ప్రపంచం ప్రమాదం అంచుకు చేరుతోంది. జీవరాశుల ఉనికే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మానవాళిని కాటేస్తున్న కరోనా ఇప్పుడు మూగ జీవాలను సైతం వదలడం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తుంటే.. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. తాజాగా హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని ఎనిమిది సింహాలు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సింహాలకు ఆకలి లేకపోవడం, జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలను గమనించిన వైద్యులు.. తక్షణమే నమూనాలను సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి పంపించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా, వాటికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు.

దేశంలో మొట్టమొదటిసారి జంతువులకు కూడా కరోనా వ్యాపించడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులు, పశువులకు మహమ్మారి సోకితే పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విషయంపై స్పందించింది. హైదరాబాద్‌లో సింహాలకు కరోనా సోకడంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకదని ప్రకటించింది. ఇది కేవలం మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాపిస్తుందని వెల్లడించింది.

* జంతువుల నుంచి మనుషులకు సోకదు..
కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం లేదని చెబుతున్నారు నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్. ఇప్పటి వరకు మహమ్మారి మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాపిస్తుందని పరిశోధనల్లో తేలిందని చెప్పారు. అలాగే టీకాలు వేసుకున్న తరువాత కొందరిలో మాత్రమే ఒళ్లు నొప్పులు లేదా జ్వరం వంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయని పాల్ తెలిపారు. ఒకవేళ టీకా వేసుకున్నాక జ్వరం వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అన్ని రకాల కరోనా టీకాలు సురక్షితమని, సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండడం వంటి చర్యలతో కరోనాను కట్టడి చేయవచ్చని వీకే పాల్ తెలిపారు. వీటిని ప్రతి ఒక్కరు అనుసరించాలని ఆయన కోరారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. వైరస్ సోకిన వారు ఐసోలేషన్లో ఉంటూ ఇతరులకు కరోనా వ్యాపించకుండా జాగ్రత్తపడాలని పేర్కొన్నారు.
Published by:Shiva Kumar Addula
First published: