కరోనావైరస్ను మనలో చాలా మంది మరిచిపోయారు. అంతటా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతానికైతే అంతా ఓకే అని అందరూ అనుకుంటున్న వేళ.. వాక్సిన్ పంపిణీకి అంతా సన్నద్ధమైన వేళ.. యూకే నుంచి ఓ భయంకరమైన విషయం బయటకొచ్చింది. యూకేలో కరోనా వైరస్ మ్యుటేటెడ్ వేరియెంట్‌ను గుర్తించారు. ఈ కొత్తరకం కోవిడ్ 19 వైరస్ వలన యూకేలో కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అంతేకాదు దాన్ని కంట్రోల్ చేయడం కూడా యూకే ప్రభుత్వం వల్ల కావడం లేదు. ఇఫ్పుడీ విషయం యావత్ ప్రపంచానికి కలవరపాటుకు గురిచేస్తోంది.
యూకేలో కరోనావైరస్ కొత్త రకం విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. ఈ క్రమంలోనే నేడు అత్యవసర భేటీకి వైద్యఆరోగ్యశాఖ పిలుపునిచ్చింది. జాయింట్ మానిటరింగ్ గ్రూప్‌తో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) సమావేశం కానున్నారు. సమావేశంలో యూకే మ్యుటేటెడ్ కరోనా వైరస్ గురించి చర్చించనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లో భారత ప్రతినిధి డాక్టర్ రోడ్రికో హెచ్. ఓఫ్రిన్ కూడా ఈ భేటీకి హాజరయ్యే అవకాశముంది.
కాగా, యూకేలో పరిస్థితి చేదాటిపోతున్న నేపథ్యంలో.. ఆదివారం నుంచి కఠినమైన లాక్డౌన్ విధిస్తూ అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసరం కాని వస్తువులను అమ్మే దుకాణాలు మూతపడ్డాయి. ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఐతే ఈ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెంది తీవ్రమైన లక్షణాలను కలుగ చేస్తుందనడానికి, వ్యాక్సీన్ పని చేయకుండా పోతుందనడానికి, మరణాల రేటు ఎక్కువగా ఉందనడానికి.. ఖచ్చితమైన ఆధారాలు లేవని బ్రిటన్ అధికారులు పేర్కొన్నారు.
కరోనాలో కొత్త రకానికి సంబంధించి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థను అప్రమత్తం చేసినట్లు యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. కొత్త మ్యుటేషన్‌ను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ.. దానిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. బ్రిటన్‌లో కరోనా మ్యుటేషన్లు విజృంభిస్తున్నందున.. భారత ఆరోగ్యశాఖ అత్యవసర సమావేశమవుతోంది. ఈ కీలక భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
Published by:Shiva Kumar Addula
First published:December 21, 2020, 04:05 IST