హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

US Presidential Debate: భారత్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..బైడెన్‌తో హాట్ హాట్ డిబేట్

US Presidential Debate: భారత్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..బైడెన్‌తో హాట్ హాట్ డిబేట్

జో బిడెన్, డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

జో బిడెన్, డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌లో డొనాల్డ్ ట్రంప్, బైడెన్ మధ్య ఈ వాడీవేడీ డిబేట్‌ జరిగింది. సామాజిక దూరం నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలను అనుమతించారు. కరోనా విజృంభణ కారణంగా ఇద్దరు నేతలు కరచాలనం చేయలేదు.

  అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మధ్య మొదటి డిబేట్ జరిగింది. ఈ డిబేట్‌కు అమెరికా న్యూస్ చానల్ ఫాక్స్ న్యూస్ యాంకర్ 72 ఏళ్ల క్రిస్ వాలెస్ హోస్ట్‌ గా వ్యవహరించారు. ఆరోగ్యం, న్యాయం, జాతి వివక్ష, ఆర్థిక వ్యవస్థ లాంటి రకరకాల అంశాలపై ఇరువురి మధ్య పలు అంశాలపై వాడీ వేడీ చర్చ జరిగింది. ఐతే డిబేట్‌లో భారత్ గురించి రెండు సార్లు ప్రస్తావన వచ్చింది. అమెరికాలో కరోనాను కట్టడి చేయడంలో డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని బైడెన్ తీవ్రంగా విమర్శించారు. దానికి భారత్, చైనాను సాకుగా చూపారు ట్రంప్. ''చైనా, రష్యా, భారత్‌లో ఎంత మంది కరోనాతో చనిపోతున్నారన్న విషయం మనకు తెలియదు. ఎందుకంటే వారు సరైన సమాధానం చెప్పడం లేదు. కరోనాకు సంబంధించి వాస్తవ గణాంకాలను వెల్లడించడం లేదు.'' అని ట్రంప్ అన్నారు.

  ఇక వాతావరణ మార్పు అంశంపై జరిగిన చర్చ సందర్భంలోనూ భారత్ పేరును ప్రస్తావించారు డొనాల్డ్ ట్రంప్. చైనా పరిశ్రమలు వాతావరణంలోకి కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని విమర్శించారు. రష్యా, ఇండియా కూడా కాలుష్యాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు.

  కోవిడ్ మహమ్మారిపై చర్చ సందర్భంగా ట్రంప్, బైడెన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని బైడెన్ విమర్శించారు. సమాధానంగా కరోనాను నియంత్రించడానికి తమ ప్రభుత్వం మెరుగ్గా పనిచేసిందని ట్రంప్ తెలిపారు. తన స్థానంలో బైడెన్ ఉంటే అమెరికాలో ఇంకా ఎక్కువ మంది చనిపోయే వారని అన్నారు. దానికి సమాధానంగా.. కరోనాతో పోరాడేందుకు ట్రంప్ వద్ద ఎలాంటి ప్లాన్ లేదని బైడెన్ చురకలటించారు. కరోనావైరస్‌ను ఎదుర్కోడానికి మాస్క్, పీపీఈ కిట్, మందులు తీసుకొచ్చామని.. కరోనా వ్యాక్సీన్ అభివృద్ధిలోనూ కీలక దశకు చేరుకున్నామని ట్రంప్ చెప్పారు. ఇక మాస్క్ ధరించడాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణించలేదని బైడెన్ ఆరోపించగా.. బైడెన్ 200 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, పెద్ద మాస్క్ వేసుకుని వచ్చేస్తారని సెటైర్లు వేశారు.

  కరోనా మహమ్మారి తర్వాత అమెరికా ఆర్థికవ్యవస్థను ఎలా పట్టాలెక్కిస్తారని హోస్ట్ క్రిస్ వాలెస్ ఆర్థికవ్యవస్థ సెగ్మెంట్‌లో ఇద్దరినీ ప్రశ్నించారు. లాక్‌డౌన్ తర్వాత అమెరికా ఆర్థికవ్యవస్థ అంచనాలకు మించిన వేగంతో కోలుకుంటుందని.. తాను అమెరికా చరిత్రలోనే అత్యంత మెరుగైన ఆర్థికవ్యవస్థను నిలబెట్టానని ట్రంప్ అన్నారు. ఆర్థిక వ్యవస్థపై చర్చ సమయంలో ట్రంప్ టాక్స్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. హోస్ట్ క్రిస్ వాలెస్ న్యూయార్క్ టైమ్స్ రిపోర్టును ఉటంకిస్తూ "మీరు 2016-17లో 750 డాలర్ల టాక్స్ మాత్రమే చెల్లించారట కదా.. ఇది నిజమేనా?" అని ట్రంప్‌ను పశ్నించారు. దానికి బదులిచ్చిన ట్రంప్.. తాను లక్షల డాలర్ల ట్యాక్స్ కట్టాను.. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.

  ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌లో డొనాల్డ్ ట్రంప్, బైడెన్ మధ్య ఈ వాడీవేడీ డిబేట్‌ జరిగింది. సామాజిక దూరం నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలను అనుమతించారు. కరోనా విజృంభణ కారణంగా ఇద్దరు నేతలు కరచాలనం చేయలేదు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Donald trump, Joe Biden, US Elections 2020, USA

  ఉత్తమ కథలు