ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 9.4 కోట్లకు పైగా జనాలు కరోనా వైరస్ బారిన పడ్డారు. అయినా కూడా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఇటీవల వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ భయం కూడా జనాలను వణికిస్తోంది. ఇదిలా ఉంటే మరో పిడుగు లాంటి వార్త ఇప్పుడు జనాలను షాక్‌కు గురిచేస్తోంది. ఐస్‌క్రీమ్ శాంపిల్స్‌లో కరోనా వైరస్ ఉన్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. ఉత్తర చైనాలోని టియాంజిన్ డాకియోగావో ఫుడ్ కంపెనీ ఉత్పత్తి చేసిన ఐస్‌క్రీమ్స్‌ను పరిశీలించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆ కంపెనీ చెందిన అన్ని రకాల ఉత్పత్తులను అధికారులు సీజ్ చేశారు. వివరాలు.. టియాంజిన్ డాకియోడావో కంపెనీ ఈ వారం వ్యాధి నియంత్రణలో భాగంగా తమ కంపెనీ నుంచి మూడు శాంపిల్స్‌ను మున్సిపల్ కేంద్రానికి పంపింది. అక్కడ పరిశోధనలు జరిపిన అధికారులు అన్ని శాంపిల్స్‌లో కోవిడ్ నిర్ధారణ అయినట్టు గుర్తించారు. ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు.. టియాంజిన్ డాకియోడావో కంపెనీలో కరోనా వైరస్ గుర్తించబడ్డ ఐస్‌క్రీమ్‌లను తయారుచేయడానికి న్యూజిలాండ్ నుంచి దిగుమతి చేసుకున్న పాలపొడిని, ఉక్రైయిన్ నుంచి దిగుమతి చేసుకున్న పాల విరుగుడు వంటి ముడి పదార్థాలను వినియోగించినట్టుగా సూచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన టియాంజిన్ డాకియోడావో కంపెనీ.. గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు 1,662 మంది తమ సంస్థ ఉద్యోగులను క్వారంటైన్లో ఉంచినట్టు తెలిపింది. వారిలో 700 మందికి కరోనా నెగిటివ్‌గా తేలిందని, మిగిలిన 962 మంది ఉద్యోగులు కరోనా నిర్ధారణ పరీక్షలు ఫలితాలు రావాల్సి ఉందని చెప్పింది.
ఇందుకు సంబంధించి లీడ్స్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ డాక్టర్ స్టీఫెన్ గ్రిఫిన్ మాట్లాడుతూ.. ఈ ఘటన ద్వారా భయాందోనలు సృష్టించకూడదని అన్నారు. ప్రతి ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్ ఉంటుందని భయపడాల్సిన పనిలేదని అన్నారు. ఐస్‌క్రీమ్‌లు ఉత్పత్తి చేసిన కంపెనీలో లోపాలు, అపరిశుభ్రత వల్ల ఇలా జరగడానికి అవకాశం ఉందని అని పేర్కొన్నారు. ఐస్‌క్రీమ్‌లు నిల్వచేయబడిన చల్లని ఉష్ణోగ్రత, అందులో ఉండే కొవ్వును పరిశీలిస్తే ఆ శాంపిల్స్‌లో కరోనా వైరస్ ఎలా బయడపడిందో వివరించగలమని డాక్టర్ స్టీఫెన్ తెలిపారు.
ఇక, ఈ ఘటనతో అప్రమత్తమైన అంటువ్యాధి నిరోధక శాఖ అధికారులు మాట్లాడుతూ.. డాకియోడావో కంపెనీకి చెందిన కోవిడ్ నిర్దారణ అయిన ఐస్‌క్రీమ్ బ్యాచ్‌కు చెందిన 4,836 బాక్స్‌లను గుర్తించామని తెలిపారు. అందులో 2,089 వాటిని సీల్ చేశామని వెల్లడించారు. ఇక, మిగిలినవాటిని కూడా ప్రజలకు చేరకుండా చర్యలు చేపట్టారు.