‘రండి బాబూ రండి, నాకు కరోనా లేదు, కూరగాయలు కొనుక్కోండి’

తనకు కరోనా లేదంటూ సర్టిఫికెట్ చూపుతున్న కూరగాయల వ్యాపారి

Telangana Covid 19 Data | ఉట్నూరులో ఓ కూరగాయల వ్యాపారి తనకు కరోనా లేదని, ప్రజలు నిర్భయంగా వచ్చి తన వద్ద కూరగాయలు కొనుగోలు చేయవచ్చని బోర్డు వేలాడదీసి మరీ వ్యాపారం చేస్తున్నాడు.

 • Share this:
  Adilabad Coronavirus Cases | ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూరులో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం కూడా బయటకు రావాలంటే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ఉట్నూరులో ఓ కూరగాయల వ్యాపారి తనకు కరోనా లేదని, ప్రజలు నిర్భయంగా వచ్చి తన వద్ద కూరగాయలు కొనుగోలు చేయవచ్చని బోర్డు వేలాడదీసి మరీ వ్యాపారం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే ఉట్నూరుకు చెందిన డోలి శంకర్ అనే కూరగాయల వ్యాపారి స్థానిక ఎస్.ఐ సుబ్బారావు ఆదేశాల మేరకు స్థానిక కొమురంభీం ప్రాంగణంలోని కొవిడ్ పరీక్షా కేంద్రంలో పరీక్ష చేయించుకున్నాడు. ఆ పరీక్షలో తనకు నెగెటివ్ అని తేలటంతో వైద్యులు ఇచ్చిన ధృవ పత్రాన్ని తన కూరగాయల దుకాణంలో అందరికి కనబడేలా వేలాడ దీశాడు. తనకు కరోనా లేదని ఆరోగ్యంగా ఉన్నానని వినియోగదారులు నిర్భయంగా వచ్చి తన వద్ద కూరగాయలు కొనవచ్చని అంటూ భరోసా ఇస్తున్నాడు.

  ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారి డోలి శంకర్ మాట్లాడుతూ రోజురోజుకు కరోనా గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరిస్తోందని, ఉట్నూరు మండలంలో అనేక పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఎవరి వద్ద కూరగాయలను కోనాలో అని వెనుకముందు అవుతున్నారని చెప్పాడు. తాను తనతో పాటు కొందరు కోవిడ్ 19 పరీక్షలు చేయించుకున్నామని, డాక్టర్లు ఇచ్చిన కోవిడ్ నిర్థారణ పత్రాన్ని తమ దుకాణాలలో పెట్టుకొని కూరగాయలని అమ్ముతున్నామని తెలిపాడు. ప్రజలు కూడా తమ వద్ద నుంచి నిర్భయంగా కొనుక్కుంటున్నారని ఇక తనతో పాటు తన కుటుంబం కూడా సంతోషంగా ఉందని తెలిపాడు.

  కూటి కోసం కోటి విద్యలు అంటారు. ప్రస్తుతం కరోనా సమయంలో అందరి భయం అదే. ఎవరి దగ్గర ఏం కొంటే కరోనా వస్తుందేమో అనే భయం. అలాంటిది, తనకు కరోనా లేదని, తన వద్ద కూరగాయలు కొనుక్కోవచ్చంటూ ఆ వ్యాపారి ఎంచక్కా భరోసా కల్పిస్తుండడంతో అందరూ అతడి వద్ద కూరగాయలు కొనేందుకు ముందుకొస్తున్నారు. ‘ఇతనికి కరోనా ఉందేమో’ అని అనుమానించే వారికి కూడా అలాంటి భయం లేకుండా పోయింది. దీంతో అతడికి గిరాకీ కూడా పెరిగింది.

  తెలంగాణలో గత 24 గంటల్లో 3018 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 111688కి చేరింది. అలాగే... నిన్న 10 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 780కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు మరింత తగ్గి 0.69 శాతానికి చేరింది. దేశంలో అది 1.84 శాతంగా ఉంది. 24 గంటల్లో తెలంగాణలో 1060 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 85223కి చేరింది. రికవరీ రేటు 76.30గా ఉంటే... దేశంలో అది... 75.92 శాతంగా ఉంది. తెలంగాణలో యాక్టివ్ కేసులు 25685 ఉన్నాయి. వాటిలో 19113 మంది ఇళ్లలోనే ఉంటూ... ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. తెలంగాణలో నిన్న 61040 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 1082094కి చేరింది. 1176 రిపోర్టులు రావాల్సి ఉంది. తెలంగాణలో ప్రస్తుతం సాధారణ బెడ్లు 11585 ఖాళీగా ఉంటే... 699 నిండి ఉన్నాయి. అలాగే... ఆక్సిజన్ బెడ్లు 4763 ఖాళీగా ఉంటే... 1098 నిండి ఉన్నాయి. అలాగే... ICU బెడ్లు... 1610 ఖాళీగా ఉంటే... 641 నిండి ఉన్నాయి.

  GHMC పరిధిలో... కొత్తగా 475 కేసులు వచ్చాయి. జిల్లాల్లో గత 24 గంటల్లో రంగారెడ్డిలో 247, మేడ్చల్ మల్కాజిగిరి 204, నల్గొండలో 190, ఖమ్మంలో 161, వరంగల్ అర్బన్‌లో 139, నిజామాబాద్‌లో 136, కరీంనగర్‌లో 127, మంచిర్యాలలో 103, జగిత్యాలలో 100 కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 28 కరోనా కేసులు నమోదయ్యాయి.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: