Home /News /coronavirus-latest-news /

HYDERABAD MAY BECOME FIRST INDIAN CITY WHICH WILL BE 100 PERCENT VACCINATED IN NEXT 15 DAYS AK GH

Telangana: వ్యాక్సినేషన్‌లో రికార్డు సృష్టిస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వం.. 15 రోజుల్లోనే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: ప్రజలకు టీకా ఆవశ్యకత పట్ల అవగాహన పెంచేందుకు అధికారులు సైతం తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రజలు, అధికారులు.. ఒకరికొకరు కలసికట్టుగా తెలంగాణాని 100% వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రంగా మార్చేందుకు సిద్ధమవుతున్నారు.

భారతదేశంలో థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. అయితే ఉచిత సార్వత్రిక టీకాల కార్యక్రమం ప్రారంభమైన జూన్ 21 నుంచి టీకా ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే.. రాబోయే 10 - 15 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను 100% పూర్తిచేసిన నగరంగా హైదరాబాద్‌ను మారుస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ కాలనీల్లోని ప్రజలకు 100% వ్యాక్సిన్లు వేయించాలనే లక్ష్యంతో ఆరోగ్య శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. గురువారం బీఆర్‌కేఆర్ భవన్‌లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు జిల్లాల కలెక్టర్‌లతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మాట్లాడిన సోమేశ్ కుమార్.. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి.. 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకాలు వేయించాలని వైద్య, మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.

జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ టీకా కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని.. అందుకే అదే మిషన్ మోడ్‌లో కోవిడ్ టీకాలు వేయాలని సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. అర్హత ఉండి ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారికి టీకాలు వేసేందుకు మానవశక్తి, మెటీరియల్ లతో కాలనీల వారీగా బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇదిలా ఉండగా జీహెచ్‌ఎంసీ పరిధిలో గడిచిన 24 గంటల్లో 71 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 409 కొత్త కరోనా కేసులు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,865 కాగా రికవరీలు సంఖ్య 6,43,318 కి చేరింది. కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రత ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. దీంతో ప్రజలందరూ వ్యాక్సినేషన్ తీసుకునేందుకు సుముఖత చూపుతున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద క్యూ కట్టి మరీ టీకా తీసుకుంటున్నారు. ప్రజలకు టీకా ఆవశ్యకత పట్ల అవగాహన పెంచేందుకు అధికారులు సైతం తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రజలు, అధికారులు.. ఒకరికొకరు కలసికట్టుగా తెలంగాణాని 100% వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రంగా మార్చేందుకు సిద్ధమవుతున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Telangana, Vaccinated for Covid 19

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు