HYDERABAD BASED BIOLOGICAL E SEEKS EUA FROM DCGI FOR ITS CORBEVAX VACCINE FOR 12 TO 18 YRS AGE GROUP MKS
Corbevax: 12-18 ఏళ్ల పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్.. Biological E ఘనత.. DCGI ఆమోదమే తరువాయి
బయోలాజికల్ ఈ వారి కార్బెవాక్స్ టీకా
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న బయోలాజికల్-ఈ సంస్థ 12 నుంచి 18 ఏళ్ల పిల్లల కోసం మరో టీకాను అభివృద్ది చేసింది. కార్బెవాక్స్ (Corbevax)' పేరుతో రూపొందిన వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ ఆ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసింది.
కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ కీలక దశకు చేరింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 175 కోట్ల డోసులు పంపిణీకాగా, రాబోయే రోజుల్లో తలెత్తే కొత్త వేరియంట్లకు ధీటుగా చిన్నారులనూ సంరక్షించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతానికి 15ఏళ్లు పైబడినవారికే వ్యాక్సిన్లు అందిస్తుండగా, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న బయోలాజికల్-ఈ సంస్థ 12 నుంచి 18 ఏళ్ల పిల్లల కోసం మరో టీకాను అభివృద్ది చేసింది. కార్బెవాక్స్ (Corbevax)' పేరుతో బయోలాజికల్ ఇ తయారు చేసిన వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ ఆ సంస్థ భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకుంది.
తుదిదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను విశ్లేషించిన అనంతరం టీకాను అత్యవసర కేసులకు వినియోగించేలా అనుమతి కోరినట్లు బయోలాజికల్ ఈ సంస్థ వెల్లడించింది. ఇక పెద్దవాళ్లకు వినియోగించేందుకు డిసెంబర్ 28నే ఈ వ్యాక్సిన్ వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి పొందడం తెలిసిందే. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి RBD ప్రోటీన్ సబ్-యూనిట్ వ్యాక్సిన్ కావడం గమనార్హం.
బయోలాజికల్ 12 నుంచి 18 ఏళ్ల పిల్లల కోసం రూపొందించిన కార్బెవాక్స్ టీకాకు తాజాగా అనుమతి కోరింది. అంతేకాదు, 5 నుంచి 18ఏళ్ల చిన్నారులకు వినియోగించేందుకు గానూ కార్బెవాక్స్ వ్యాక్సిన్ తుదిదశ ప్రయోగాలు చేసేందుకు గత సెప్టెంబర్ నెలలో బయోలాజికల్ ఇ అనుమతి పొందినట్లు ఆ సంస్థ ప్రతినిధి శ్రీనివాస కొసరాజు పేర్కొన్నారు. పిల్లల కొవిడ్ టీకాలకు సంబంధించి సురక్షిత, రోగనిరోధకత ఫలితాలను విశ్లేషించగా మెరుగైన ఫలితాలు కనిపించినట్లు బయోలాజికల్ ఈ ప్రతినిధి వెల్లడించారు. మధ్యంతర ఫలితాలను విశ్లేషించిన అనంతరం 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నామన్నారు.స
హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ - ఇ అభివృద్ధి చేసిన కార్బివాక్స్ టీకా 5 కోట్ల డోసుల కోసం ఆ సంస్థకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో డోసును రూ. 145 (జీఎస్టీ అదనం) చొప్పున వీటిని కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. అయితే, ఈ టీకాను ఎవరికి అందిస్తారన్న దానిపై స్పష్టతలేనప్పటికీ ప్రికాషినరీ డోసుగా ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ప్రికాషనరీ డోసు పేరుతో మూడో డోసును ప్రభుత్వం ఇప్పటికే అందిస్తోంది. ఇదే సమయంలో రానున్న రోజుల్లో 60ఏళ్లలోపు వారికి మూడో డోసుగా దీనినే పంపిణీ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే, రెండు డోసుల్లో తీసుకునే కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్ను 28 రోజుల వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.