Andhra Pradesh: అమానుషం నిండు గర్భిణిని నడిపించిన గ్రామస్తులు.. అంబులెన్స్ లోనే ప్రసవం

గర్భిణిని నడిపించిన గ్రామస్తులు

కరోనా మహమ్మారి మనుషుల్లో మానవత్వం చంపేస్తోంది. కరోనా సోకుతుందనే భయం.. పక్కన ఉన్న వారి కష్టం కనిపించనీయకుండా చేస్తోంది. ఓ గర్భిణిని తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్ ను సైతం గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమె నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

  • Share this:
    ఏపీని కరోనా భయపెడుతోంది. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. గత 24 గంటల్లో 20 వేలకుపైగా మంది కరోనా బారిన పడితే.. ఒక్కరోజులోనే కరోనా కారణంగా వందకుపైగా మరణాలు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కఠిన కర్ఫ్యూ అమలు చేస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్నీ బంద్ చేస్తోంది. ప్రజలను రోడ్లపైకి అనుమతించడం లేదు. మొదట కేవలం పట్టణాలకే పరిమితమైన వైరస్.. ఇప్పుడు గ్రామాలను చుట్టేస్తోంది. దీంతో చాలా గ్రామాల్లోనూ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. బయట నుంచి వచ్చే వ్యక్తులను రానివ్వడం లేదు. ముఖ్యంగా వహనాలను అనుమతించడం లేదు.

    సాధారణ వాహనాలను అనుమతించకపోతే సరే కరోనా సమయం అని అనుకోవచ్చు.. కానీ అంబులెన్స్ కూడా అనుమతించకపోతే ఎలా? ఎవరికి ఎంత కష్టమొచ్చిందో తెలీదు. ఒక గ్రామానికి అంబులెన్స్ వచ్చింది అంటే అత్యవసరమైతేనే వస్తుంది. కానీ కరోనా పేరుతో ఆ వాహనాన్ని కూడా గ్రామంలోకి అనుమతించకపోతే ఎలా?.. కరోనా వైరస్‌ భయం మనుషుల్లో విచక్షణ కోల్పోయేలా చేస్తోంది. ప్రాణ భయంతో మంచి, చెడులను పక్కన పెట్టేస్తున్నారు. వైరస్ సోకుతుందనే భయంతో మనుషులం అన్న సంగతి మరిచిపోతున్నారు చాలామంది. పక్కవారి ప్రాణం మీదకు వచ్చినా తమకేం పట్టనట్టు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లాలో జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణ.

    ఎంత అమానుషం అంటే పురుటి నొప్పులతో అల్లాడుతున్న ఓ గర్భిణిని సైతం గ్రామస్తులు పట్టించుకోలేదు. నొప్పి భరించలేకపోతున్నా అన్న ఆ గ్రామస్తుల చెవికి ఎక్కలేదు. ఆ గర్భిణి కోసం వచ్చిన అంబులెన్స్‌ను సైతం ఊర్లోకి రాకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగుల మండలం పాల మామిడిలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. తమ గ్రామంలోకి వేరే వాళ్లు రాకుండా సరిహద్దు వద్ద గేట్‌ ఏర్పాటు చేశారు గ్రామస్తులు.

    గేటు ఏర్పాటు చేసిన గ్రామస్తులు.. వాహనాలను అనుమతించేది లేదని రూల్ పెట్టారు. అయితే అదే గ్రామానికి చెందిన పాంగి లలిత అనే మహిళకు పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు కోరిన మేరకు అంబులెన్సు గ్రామానికి వచ్చింది. కానీ కరోనా భయం.. రూల్స్ పేరుతో గ్రామస్తులు గ్రామంలోకి అంబులెన్స్‌ను అనుమతించలేదు. ఎంత చెప్పినా వారు అర్థం చేసుకోలేదు. దీంతో ఆ గర్భిణిని నడిపించుకుంటూ గ్రామ శివారులోని అంబులెన్స్ ఎక్కించారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్లేలోగా లలిత బాబుకు జన్మనిచ్చింది. అయితే ఆ తల్లికి బిడ్డకు ఏం అవ్వలేదు. సురక్షితంగానే ఉన్నారు. కానీ ఏదైనా అయ్యి ఉంటే ఎవరు బాధ్యులు.. కరోనా భయంతో అంబులెన్స్‌ను గ్రామంలోకి అనుమతించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: