ఆకలితో అలమటిస్తున్న అనాధలకు మేమున్నామని భరోసా నింపుతున్నారు. కరోనా కష్ట కాలంలో రోడ్లపై ఆకలితో అలమటిస్తూ.. ఎవరో వచ్చి ఏదో ఇస్తే వాటితోనే కడుపు నింపుకుంటున్న కొందర్ని చూసి చలించిపోయిన ఆ యువత.. ఇప్పుడు వారందరికీ మూడు పూటలా కడుపు నిండా భోజనాన్ని అందించేందుకు ఫుడ్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఎవరూ ఆకలితో ఉండకుండా వారే వచ్చి స్వయంగా ఆహారాన్ని తీసుకుని వెళ్లే విదంగా ఏర్పాటు చేయ్యడంతో నిరాశ్రయులైన అనాధలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్, ట్రీ బ్యాంక్, ల్యాండ్ బ్యాంక్ అనే పదాలు మనం వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు విజయనగరంలో ఫుడ్ బ్యాంకు అనేది వినూత్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఇక్కడి యువత. కోవిడ్ వల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోయాయని, ఒక్క పూట అన్నం కోసం అలమటించే అభాగ్యులైన వారు ఎందరో ఉన్నారని భావించి అలాంటి వారి అందరి ఆవేదన, ఆకలి తీర్చేలా ఫుడ్ బ్యాంక్ అనే ఓ కొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులు. విజయనగరం మయూరి కూడలి దగ్గర ఒక పెద్ద ప్రత్యేక ఫ్రిజ్ ను ఏర్పాటు చేసి దానినే ఫుడ్ బ్యాంక్ గా మార్చారు.
దీంతో ఆకలితో ఉన్న నిరాశ్రయులు తామే స్వయంగా ఫుడ్ బ్యాంకు వద్దకు వచ్చి ఆహారాన్ని తీసుకుని వెళ్లే విధంగా ఏర్పాటు చేయ్యడంతో అనాధలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గత ఏడాది కరోనా కష్ట కాలంలో కూడా రోడ్లు మీద వుండే వారికి ప్రతీ రోజూ కొన్ని వందల మందికి ఆహారాన్ని అందించామని.. దాని ద్వారానే ప్రస్తుతం ఫుడ్ బ్యాంకు ఆలోచన పుట్టుకొచ్చిందని విజయనగరం యూత్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు.
పేదవారికి పట్టెడన్నం పెట్టేందుకు ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, మీ ఇళ్లు, కళ్యాణ మండపాలలో జరిగే శుభకార్యాల సమయంలో మిగిలిపోయిన ఆహారపదార్ధాలను ప్యాక్ చేసి ఈ ఫుడ్ బ్యాంకులలో పెట్టాలని దీంతో మిగిలిన ఆహారాన్ని వృధా చెయ్యకుండా పదిమంది ఆకలి తీర్చేందుకు ఉపమోగ పడుతుందని, ప్రతీ ఒక్కరూ తమ విజ్ఞప్తిని పాటించాలని విజయనగరం యూత్ అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు.
నిత్యం రోడ్ల మీద ఎందరో అభాగ్యులు ఒక్కపూట అన్నం కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారని.. వారందరికీ దయార్ద్ర హృదయులకు సహాయం చేయాలని ఉన్నా, ఎక్కడ ఎలా ఎవరికి సహాయం చేయాలో తెలియక తమ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నారని అన్నారు. అటు అన్నార్తులకి, ఇటు దాతృత్వం కలిగిన దాతలకి మధ్య వారధిగా ఉంటుందన్నఉద్దేశ్యంతో ఈ ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు.
ఈ ఫుడ్ బ్యాంకులో ఎవరైనా తమ వద్ద మిగిలిన ఆహారాన్ని ప్యాకింగ్ రూపంలో పెట్టవచ్చును, అలాగే ఎవరికైనా ఆహారం కావాలంటే ఈ ఫుడ్ బ్యాంక్ నుండి తీసుకోవచ్చుని..
విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులు చెబుతున్నారు. ఈ ఫుడ్ బ్యాంకు రోడ్ల పక్కనే ఆధారంగా జీవిస్తున్న అనాధలతో పాటు వివిధ పనులతో విజయనగరం పట్టణానికి బయట ప్రదేశాల నుండి వచ్చిన వారు కూడా భోజన సమయంలో రెండు పూటలా ఈ ఫుడ్ బ్యాంకుల వద్ద ఉన్నఆహారాన్ని తీసుకుని వెళ్తున్నారు. ప్రస్తుతం బస్టాండ్ వద్ద మాత్రమే ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ బ్యాంకును మరికొన్ని ముఖ్యమైన రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఈ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. ఈ ఫుడ్ బ్యాంకు ఏర్పాటు చెయ్యడం తమలాంటి వారికి కడుపు నిండా రెండు పూటలా భోజనం దొరుకుతోందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నిరాశ్రయులు.
విజయనగరం పట్టణంలో ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంకు ద్వారా ప్రతీరోజూ మధ్యాహ్నం మూడు వందల మందికి, రాత్రి పూట 2 వందల మందికి సరిపడా ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసి రెండు పూటలా అందిస్తున్నామని.. ఆహారంతో పాటు బ్రెడ్ లను కూడా ఫుడ్ బ్యాంకులో వుంచుతున్నామని చెబుతున్నారు. అలాగే ఈ మహత్తర కార్యక్రమానికి దాతలు కూడా సహకారాన్ని అందిస్తే.. అన్ని ముఖ్యమైన కూడళ్లలో ఈ ఫుడ్ బ్యాంకులని ఏర్పాటు చేసి వాటి ద్వారా మరింత మందికి ఆహారాన్ని అందిస్తామని విజయనగరం యూత్ సభ్యులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Corona helping, Helping