హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

NEWS18 తో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్.. కరోనాపై కీలక వ్యాఖ్యలు..

NEWS18 తో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్.. కరోనాపై కీలక వ్యాఖ్యలు..

మంత్రి ఈటల రాజేందర్ (Twitter Photo)

మంత్రి ఈటల రాజేందర్ (Twitter Photo)

కరోనాను పూర్తిగా నిర్మూలించడం అసాధ్యమని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

కరోనాను పూర్తిగా నిర్మూలించడం అసాధ్యమని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి ‘న్యూస్18’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ సంభాషణ ఇదిగో..

NEWS18 : రాష్ట్రంలో ఈ మధ్య కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టుగా అనిపిస్తోంది. ఎలా సాధ్యమైంది?

ఈటల : అన్ని రాష్ట్రాల కంటే ముందుగా మేల్కొని ప్రజల్ని కాపాడుకోవాలని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వ యంత్రాంగమంతా పకడ్బందీగా ప్లాన్ చేసి అమలు చేయడం వల్ల డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. వైరస్ ఇక్కడ పుట్టింది కాదు... ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచి మన దేశంలోకి వైరస్ వచ్చింది. అయినా వాళ్ల నుంచి పెద్దగా స్ప్రెడ్ కాలేదు.. మర్కజ్ నుంచి వచ్చిన వారికి దాదాపు 250 మందికి వైరస్ సోకడం.. వారి నుంచి వందల మందికి సోకడం వల్ల ఆందోళన కలిగింది. అయినా దాన్ని ఆపడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇది మేం చెప్పడం కాదు.. భారత ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు చెబుతున్నాయి. మా చర్యలను యావత్ భారత దేశం హర్షిస్తోంది. ప్రజానికం కూడా ప్రభుత్వం చెబుతున్న సూచనలు సలహాలు పాటించడం ద్వారా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.

ఎప్పటి వరకు కరోనా ఫ్రీ అయ్యే అవకాశం ఉంది?

కరోనా ఇప్పట్లో ఫ్రీ అయ్యే పరిస్థితి లేదు. ఇటలీ, అమెరికా మాదిరిగా వందల మంది చనిపోయే పరిస్థితి లేదు. ఏప్రిల్‌లో ఢిల్లీ కేసుల వల్ల కాస్త నంబర్ పెరిగింది. దీన్ని సింగిల్ డిజిట్ కు పరిమితం చేయాలని చూస్తున్నాం.. కానీ అప్పుడప్పుడు అక్కడక్కడ ఇంకా కేసులు వస్తూనే ఉన్నాయి. మలక్ పేట ప్రాంతలో ఒకే కుటుంబంలో 20 మందికి కరోనా వచ్చింది. పాజిటివ్ కేసులు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డెత్ రేట్ ఎక్కువ లేదు. ప్రజల్ని కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

మే 7న లాక్ డౌన్ ఎత్తేసే అవకాశం ఉందా?

లక్ డౌన్ దేశ సమస్య... ప్రధాని రాష్ట్రాలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణలో బతికుంటే బల్సాకులు తిని బతక వచ్చని లాక్ డౌన్ మే 7 వరకు పొడగించుకున్నాం. పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం.

ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేస్తే మళ్లీ కరోనా విస్తరించే అవకాశం ఉంటుంది కదా..?

ప్రజలు గుమ్మికూడే అవకాశం ఉండే పెళ్లిళ్లు, పిల్లలకు క్లాసులు, మీటింగులు, ర్యాలీలు, దేవాలయాల్లో సామూహిక కార్యక్రమాలు, సినిమా థియేటర్లు, మాల్స్‌‌పై నిషేధం కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పనులకు అనుమతిస్తాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా చూస్తాం. ఎక్కడైతే వ్యాధి విస్తరించే ప్రమాదం ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం.

న్యూస్18 అసిస్టెంట్ ఎడిటర్‌ రమణతో మంత్రి ఈటల ఇంటర్వ్యూ..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పోల్చితే మన దగ్గర కేసుల సంఖ్య సరిగా చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి కదా?

అలా ఉండదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేన్నయినా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తారు. సమస్యను విజువలైజ్ చేసుకొని అర్థం చేసుకొని చర్యలకు ఉపక్రమిస్తారు. ఈ వ్యవహారం రాగానే పకడ్బందీగా ప్లాన్ చేసి కట్టడి చేశాం. కట్టడి చేయడం వల్ల కేసులు తగ్గాయి తప్పితే టెస్ట్ లు చేయకపోవడం వల్ల తగ్గడం ఉండదు. ఇలా వాదించడం మూర్ఖత్వం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనేది మా సూత్రం.

మీరు చెప్పిన మాటలు అమితంగా విశ్వసిస్తున్నారు. అయితే.. ఇక్కడ 15 వేల టెస్టులు చేశారు కాబట్టి వెయ్యి వరకు కేసులొచ్చాయి. అక్కడ 80 వేలకు పైగా చెశారు కాబట్టి కేసులు పెరిగాయి అనే ఓ భావన ఉంది. ఇలాంటి భావనలు గందరగోళం సృష్టిస్తుస్తోంది కదా...?

అది తప్పు... అసులు సమస్య వచ్చినప్పుడు నిద్ర పోయింది వాళ్లు. వ్యాధి విస్తరించిన తర్వాత టెస్టులు చేస్తున్నారు. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా టెస్టులు నిర్వహిస్తున్నాం. లక్షణాలు లేని వారి నుంచి స్వాప్ కలెక్ట్ చేయలేం. జలుబు చేసిన వాళ్లుకు, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్లకే వస్తుంది. పాజిటివ్ కేసులు డిటెక్ట్ చేసిన వాళ్ల చుట్టుపక్కన ఉన్న వాళ్లలో వ్యాధి లక్షణాలు ఉన్న వారికి టెస్ట్ చేయాలని ఐసీఎంఆర్ సూచించింది. సిప్టమ్స్ లేని వాళ్లను క్వారంటైన్ చేయాలన్నారు. శాస్త్రీయ విధానాలు పాటించి కరోనా కట్టడి చేస్తున్నాం. నమోదైన కేసులు కూడా తక్కువ కుటుంబాలకే పరిమితం అయింది. వైడ్ స్ప్రెడ్ లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన వారు ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ లలో ఉన్నారు. వాళ్లను వెంటనే గుర్తించి కట్టడి చేశాం. హైదరాబాద్ పెద్ద నగరం కాబట్టి ఎంత చేసినా ఏదో ఓ చేట కొత్త కాంటాక్ట్స్ లభిస్తున్నాయి. ఏదేమైనా కేసీఆర్ నిరంతరం వాళ్లను కనిపెట్టాలని ఆదేశించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు కూడా లక్షణాలు ఉన్న వారినే పరీక్షలు చేస్తున్నాయి . చేసిన టెస్టుల్లో కచ్చితత్వం ఉంది. ఇద్దర్ని పరీక్షిస్తే ఒకరికి పాజిటివ్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కువ టెస్టులు చేసి తక్కువ ఫలితాలు వస్తే లాభం ఏముంటుంది.

కరోనా ప్రాణాంతకమైన వ్యాధి. కాబట్టి కరోనా లేదని ప్రజలు ఎవరికి వారు నిర్ధారణ చేసుకుంటే శ్రేయస్కరం కదా?

కరోనాకు వాక్సిన్ వచ్చే వరకు ఎవరికీ కరోనా రాదని చెప్పలేం. చైనా, అమెరికా లాంటి దేశాలను చూస్తున్నాం. ఫలానా దేశంలో కరోనా లేదని చెప్పలేం. వాక్సిన్ వచ్చినా... మందులు వచ్చినా పూర్తి స్థాయి నిర్మూలించలేం. ఏ వ్యాధిని కూడా పూర్తిగా నిర్మూలించలేకపోయాం. కరోనా కూడా అంతే... నిర్మూలించే పరిస్థితి వస్తే సంతోషమే.

కొత్తగా ఏర్పాటు చేసే ఆసుపత్రులు భవిష్యత్ అవసరాల కోసమే అంటారా?

గతంలో ఎబోలా వైరస్ సోకితే 35 శాతం, స్వైన్ ఫ్లూ 9.5 శాతం, కోవిడ్ వల్ల 7 శాతం, మన దేశంలో 3.2 శాతం, తెలంగాణలో 2.5 శాతం చనిపోయారు. దీని ద్వారా చనిపోయింది అతి తక్కువ మంది. భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మన వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, మనలో ఉండే రోగ నిరోధక శక్తి కరోనా ప్రభావాన్ని తగ్గించగలుగుతున్నాయి. సౌత్ ఆఫ్రికాలో కూడా వ్యాధి తీవ్రత అంతగా లేదు. గతంలో ఎన్నో సమస్యలు వచ్చాయి వాటన్నింటిని తట్టుకొని దేశం నిలబడింది. కరోనాలో కూడా అంతే.

మన పక్కన ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడి ప్రజలకు కూడా సహజంగానే భయాందోళనలు ఉంటాయి కదా.... ఇక్కడి ప్రజలకు ఏం కాదు అనే భరోసా ఇవ్వగలరా?

గత యాభై, అరవై రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే గతంలో రకరకాల జబ్బులు ఉన్న వ్యక్తులు ప్రత్యేకించి బీపీ, షుగర్, కిడ్నీ, లివర్, శ్వాసకోశ సంబంధ సమస్య ఉండి.. 60 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్లలో వైరస్ ప్రభావం ఎక్కువ. బెల్జియంలో 14.2 శాతం మంది వ్యాధిగ్రస్తులు చనిపోయారు. ఇటలీలో ఎక్కువ మంది వృద్ధులు చనిపోయారు. మన రాష్ట్రంలో చనిపోయిన 25 మందిని విశ్లేషిస్తే ఎక్కువ మంది 65 ఏళ్లు పైబటి రకరకాల జబ్బులున్న వాళ్లే చనిపోయారు. యువకులు ఎవరూ చనిపోలేదు. వయస్సు పైబడిన వారు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ఇదివరకే సూచించింది.

మీరు ఆర్థిక మంత్రిగా పని చేశారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది?

వ్యాధిని మనం పూర్తి స్థాయిలో కట్టడి చేశాం. కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత కొన్ని రకాల పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. మనిషి జీవించి ఉంటే ఏదైనా చేయొచ్చు. ఉన్నంతలో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం.

ఎంఐఎం పార్టీ కరోనా కట్టడిలో సహకరించడం లేదనే విమర్శ ఉంది.

ఇలాంటి సందర్భాల్లో పార్టీలను పట్టించుకోం. తీసుకున్న నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తాం. తెలంగాణ గడ్డమీద పుట్టిన బిడ్డ.. ప్రభుత్వం గొప్పగా చేస్తుందని గర్వపడుతున్నారు. కేసీఆర్ మాకున్నాడు మాకేం కాదని ప్రజలు విశ్వసిస్తున్నారు. విపక్షాలను మమ్మల్ని ప్రజల మాదిరిగా పొగడాలని అనట్లేదు. కనీసం మానసిక ధైర్యాన్ని ప్రజలకు, ప్రభుత్వానికి ఇవ్వాలని అడుగుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో చిల్లర రాజకీయాలు చేయడం సరికాదు. చావుకు, పెళ్లికి ఒకే డప్పు ఉండదు.

సీఎంఆర్ఎఫ్ లెక్కలు చెప్పండని అడుగుతున్నారు?

వాళ్ల మనస్తత్వం అంత సంకుచితంగా ఉంటుంది. వాళ్లు ఆలోచిస్తున్నట్లు ఇతరులు కూడా ఆలోచిస్తున్నారనుకోవడం తప్పు.

' isDesktop="true" id="507404" youtubeid="0MUh38vyXnw" category="coronavirus-latest-news">

First published:

Tags: CM KCR, Corona, Corona virus, Coronavirus, Covid-19, Eetala rajender, Telangana Government, Telangana News

ఉత్తమ కథలు