Andhra Pradesh: పేరుకు అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి.. కానీ లోపలో ఏం జరుగుతోందో తెలుసా?

సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నర్సారావు పేట కోవిడ్ ఆస్పత్రి

పేరుకే అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి.. కానీ అక్కడ పరిస్థితి చూస్తే.. పైన పటారం.. లోన లొటారం అన్నట్టు ఉంది. 200ల పకడకలతో ఆస్పత్రి ఉన్నా.. లోపలకు వెళ్లిన వారికి మాత్రం షాక్ తప్పదు. అడగడుగునా అపరిశుభ్రతతో రోగుల కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు.

 • Share this:
  గుంటూరు జిల్లా నరసరావుపేటలో కోవిడ్ ఆస్పత్రిలో పరిస్థితి దారుణంగా ఉంది.  మేడి పండు చందంగా తయారైందది. నరసరావుపేట లోని 200 పడకల డాక్టర్ ఎస్ ఆర్ జిల్లా వైద్యశాల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధునాతన మైన హంగులు,ఆర్భాటాలతో ఇటీవలి కాలంలో నిర్మించిన హాస్పిటల్ ను పల్నాడులోనే అతిపెద్ద కోవిడ్ హాస్పిటల్ గా తీర్చిదిద్దారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ తో సహా వెంటిలేటర్లు, రెమీడిసీవర్ ఇంజక్షన్లు లాంటి అనేక సదుపాయాలు ఈ హాస్పిటల్ లో ఉన్నాయి.

  అన్ని వసతులు ఉన్నప్పటికీ వైద్యుల పర్యవేక్షణ మాత్రం కొరవడిందనే చెప్పాలి. ఈ ఆస్పత్రిలో పని చేసే ఓ కీలక  వైధ్యుడు.. ఇటీవలి కాలంలో ప్రైవేటుగా  ఓ చిన్న పిల్లల వైద్యశాలలో కోవిడ్ సెంటర్ పెట్టి బిజీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

  పారిశుధ్యం విషయానికి వస్తే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కరోన వైరస్ వచ్చిన రోగులకు వాడిన వైద్య పరమైన వ్యర్ధాలను చాలా జాగ్రత్తగా ఖననం చేయాలి అంటూ నిబంధనలు ఉన్నాయి. అవి ఈ హాస్పిటల్  ఏ కోశానా కనిపించవు.  పైగా కోవిడ్ పేషంట్లకు వాడిన సెలైన్ బాటిల్స్ పీపీఈ కిట్లు, శానిటైజేషన్ వస్తువులు మొత్తం హాస్పిటల్ ఎదురుగా ఉన్న త్రాగు నీటి కాలువలో విసిరేయడం పరిపాటిగా మారింది. దీనిపై చాలా వరకు ఫిర్యాదులు అందుతున్నా.. సిబ్బంది కాని.. ఆస్పత్రి అధికారులు కానీ స్పందించడం లేదు. ఇక రోగులకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు..? వారి పరిస్తితి ఎలా ఉంది అని తెలుసుకోవాలని రోగి బంధువులు ప్రయత్నించినా సమాచారం ఇచ్చేవారు ఒక్కరో కనిపించరు. దీంతో లోపల్ ఏం జరుగుతోంది అన్నది ఎవరీకీ తెలియకుండా పోతోంది.  ఒకవేళ కరోనాతో ఎవరైనా మరణించినా.. చాలా ఆలస్యంగా సమాచారమిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

  ఇదంతా ఒక ఎత్తైతే హాస్పిటల్ లోపల శానిటైజేషన్ అధ్వాన్నంగా ఉందని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. టాయ్లెట్లలో మలమూత్రాలు, వ్యర్ధాలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నా పట్టించుకునే నాధుడేలేడంటూ రోగులు వాపోతున్నారు. అన్నింటి కన్నా దారుణమైన విషయం ఏంటంటే.. ఈ హాస్పిటల్ ల్లో ఆక్సిజన్ పెట్టుకున్నారంటే వారు ఇంక చనిపోవడమే నంటూ స్వయానా ఓ వైధ్యుడు రోగి బంధువులకు చెప్పాడంటే పరిస్థితి  ఎంత దారుణంగా ఉందో అర్ధంచేసుకోవచ్చు.

  స్థానిక శాసన సభ్యులు ప్రతిరోజూ హాస్పిటల్ ను సందర్శించి పదే పదే ఇక్కడికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించమని మొత్తుకుంటున్నా హాస్పిటల్ ల్లోని డాక్టర్లు, సిబ్బందికి కనీసం చీమకుట్టినట్లైనా లేక పోవడం విచారకరం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నరసరావుపేట లోని  జిల్లా వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
  Published by:Nagesh Paina
  First published: